గ్రేట్ ఆంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ః రాప్తాడు

అనంతపురం జిల్లాకు కూతవేటు దూరంతో మొదలవుతుంది రాప్తాడు నియోజకవర్గం. టౌన్ పూర్తిగా దాటకముందే.. రాప్తాడు నియోజకవర్గం మొదలవుతుంది. ఇక అటుగా చూస్తే.. చాలా పొడవున విస్తరించి ఉంటుంది. చెన్నేకొత్త పల్లి మండలాన్ని కలుపుకుని.. పెనుకొండ దరిదాపుల వరకూ, ఇటు వెల్దుర్తిని కలుపుకుని కొత్తచెరువుకు దగ్గర దగ్గరగా ఉంటుంది. రెండువేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పడిన ఈ నియోజకవర్గం రూపు రేఖలు ఇలా చిత్రంగా ఉంటాయి.

మిగతా నియోజకవర్గాలతో ఎక్కువగా సరిహద్దును పంచుకునే నియోజకవర్గం ఇదే. అప్పటివరకూ పెనుకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన పరిటాల కుటుంబం తమ సొంతూరు, మండలం రాప్తాడులో భాగంకావడంతో ఇక్కడకు వలస రావాల్సి వచ్చింది. ఇక తొలిసారి ఈ నియోజకవర్గంలో గెలుపుకోసం పరిటాల సునీత చాలా శ్రమించాల్సి వచ్చింది. కేవలం పదిహేడు వందల ఓట్ల తేడాతో ఆమె నెగ్గగలిగారు.

అప్పుడే తోపుదుర్తి వాళ్లు నెగ్గాల్సింది. అయితే అప్పుడు మద్దెలచెరువు సూరి ఒక రెబల్ ను పోటీచేయించడం, అతడు ఐదారు వేల ఓట్ల వరకూ చీల్చడం.. వంటి పరిణామాలు పరిటాల కుటుంబాన్ని కాపాడాయి. లేకపోతే అప్పుడే గట్టి ఓటమి ఎదురు కావాల్సింది. ఇక ఆ తర్వాతి ఎన్నికల్లో అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి.. ఎన్నికల హామీలు కలిసి వచ్చాయి.

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గట్టిగానే పోరాడినా.. రైతు రుణమాఫీ గట్టిగా పనిచేసింది. దీంతో సునీత ఎనిమిది వేల వరకూ మెజారిటీని సంపాదించుకున్నారు. ఒకరకంగా ఆఖరి నిమిషం వరకూ గెలుస్తారనే నమ్మకం వారిలో కూడా లేదు.

ఐదేళ్ల పరిణామాలు ఇలా..!
వరసగా రెండుసార్లు ఓటమి పాలైనా.. తోపుదుర్తి కుటుంబం ఈసారి కూడా గట్టిగా పోరాడుతూ ఉంది. ఐదేళ్ల నుంచి నియోజకవర్గంలోనే ప్రకాష్ రెడ్డి పోరాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లపై భౌతిక దాడులు కూడా జరిగాయి. రాప్తాడు రెవెన్యూ ఆఫీస్ లో ప్రసాద్ రెడ్డి దారుణ హత్య సంచలనం రేపింది. అలాగే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కందుకూరు ప్రాంతంలో కూడా ఫ్యాక్షన్ హత్యలు చోటు చేసుకున్నాయి. దీంతో తండ్రి ఫ్యాక్షన్ వారసత్వాన్ని పరిటాల శ్రీరామ్ కొనసాగిస్తూ ఉన్నాడనే ప్రచారం మొదలైంది.

ఇక మంత్రిగా ఉన్నప్పటికీ పరిటాల సునీత నియోకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన దాఖలాలు లేవు. ఎంతసేపూ మంత్రి చుట్టూ ఉంటే ఐదారుమంది బాగుపడటమే కానీ.. సామాన్యులకు ఒరిగింది ఏమీలేదు. ఏదైనా కావాలని అడిగిన ప్రజల విషయంలో కూడా పరిటాల కుటుంబం ఘాటుగా స్పందించిందని అంటారు. ‘ఏం ఊరికే ఓటేశారా.. డబ్బులు తీసుకునే కదా...’ అనేమాట పరిటాల వాళ్ల నుంచి వచ్చింది.

ఇక పరిటాల శ్రీరామ్ జనాకర్షణ కూడా ఏమీలేకుండా పోయింది. ఎంతసేపూ తన వందమాగధులను వెంట పెట్టుకుని తిరగడమే తప్ప.. తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోలేకపోయాడీయన. కనీసం ధాటిగా మాట్లాడలేకపోవడం, పరిటాల సునీతకు ఏ విషయం మీద అవగాహన లేకపోవడం.. ఈ దఫా పూర్తిగా బయటపడిపోయింది.

ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఇవే..
-బీసీల్లో మార్పు.. గత పర్యాయంతో పోలిస్తే ఈ మార్పు మరింత ఎక్కువగా ఉంది. బీసీలంతా టీడీపీనే.. అనే పరిస్థితి గత ఎన్నికల సమయంలోనే పోయింది.
-ఈసారి ప్రత్యేకించి కురుబ సామాజికవర్గం తెలుగుదేశం పార్టీకి, పరిటాల కుటుంబానికి పూర్తిగా దూరం అయ్యింది.
-వరసగా రెండుసార్లు ఓటమిపాలు కావడంతో తోపుదుర్తి కుటుంబంపై సానుభూతి కూడా కనిపిస్తోంది. ఒకసారి ప్రకాష్ రెడ్డికి, అదే సమయంలో జగన్ కు ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-నియోజకవర్గంలో కొద్దోగొప్పో ఉన్న కమ్మవాళ్లు తెలుగుదేశం వైపే ఉన్నారు. ఇక బీసీలు తమ వీరాభిమానులు..తమ రాజరికానికే వారు ఓట్లు వేయాలనే తీరు పరిటాల కుటుంబం ధోరణిగా కనిపిస్తోంది.
-అలాంటి బీసీలనే లక్ష్యంగా చేసుకుని ప్రకాష్ రెడ్డి వారిని తన వైపు మళ్లించుకోవడంలో విజయవంతం అవుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.
-హిందూపురం లోక్ సభ సీటు పరిధిలోకి వచ్చే రాప్తాడుపై గోరంట్ల మాధవ్ అభ్యర్థిత్వం ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
-నియోజకవర్గంలో కురుబ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మాధవ్ కు వైసీపీ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు చేయడం వారిలో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంది. పెనుకొండ ఎమ్మెల్యే పార్థ సారధితో కూడా సునీతకు సత్సంబంధాలు లేవు.
-సునీత పట్ల తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనూ వ్యతిరేకత ఉంది. వీరి ఆధిపత్య ధోరణిని సాటి కమ్మవాళ్లే భరించలేకపోతున్నారని టాక్. ప్రభాకర్ చౌదరి, పయ్యావుల కేశవ్, వరదాపురం సూరి వంటి కమ్మ నేతలు.. పరిటాల కుటుంబం ఓడిపోతే మేలనే భావనలోనే ఉన్నారు!
-ఆర్థికంగా తిరుగులేని స్థాయిలో ఉండటం సునీతకు ప్లస్ పాయింట్. అడవి పందుల వేటకు వెళ్లడం తప్ప శ్రీరామ్ చేసింది ఏమీలేదని రూరల్ లో జనాలు అంటున్నారు.
-సునీతపై వ్యతిరకత తీవ్రంగా ఉందనే నేపథ్యంలోనే.. శ్రీరామ్ అభ్యర్థిత్వానికి చంద్రబాబు కూడా ఓకే చెప్పారట. అయితే శ్రీరామ్ పోటీచేస్తే.. తమ గెలుపు మరింత ఈజీ అవుతుందని వైఎస్సార్ సీపీవాళ్లు అంటున్నారు.
-హోరాహోరీ పోరు తప్పదు. వైఎస్సార్సీపీకి కొన్ని మైనస్ పాయింట్లు లేకపోలేదు. ఈసారి ప్రకాష్ ఓడిపోతే.. నెక్ట్స్ తమకే ఛాన్స్ వస్తుందనే వాళ్లు ఆ పార్టీలోనూ ఉన్నారు. తోపుదుర్తి కవితా భాస్కర్ రెడ్డి, గంగుల భానుమతి, పార్టీలోని మరి కొందరు నేతలు ఇలానే వ్యవహరిస్తున్నారనే ఒక ప్రచారం ఉంది. అయితే..  రాప్తాడులో మరోసారి పరిటాల కుటుంబం గెలిస్తే.. వీళ్లంతా తలా ఒక దిక్కుకు పారిపోవాల్సిందే అని సామాన్యులు అనుకుంటున్నారు. ప్రకాష్ రెడ్డికి మోసం చేస్తే.. అది మిగతా వైఎస్సార్సీపీ నేతలు.. తమకు తోకకు తాము నిప్పు పెట్టుకోవడమే అని జనసామాన్యం విశ్లేషిస్తోంది!
-అంతిమంగా రెండువేల మెజారిటీతో అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేది స్థానికుల విశ్లేషణ. జగన్ వేవ్ ఉంటే, బీసీలు ఆఖరి వరకూ ఇలాగే నిలబడితే.. ఆ మెజారిటీ అంతకు అనేక రెట్లు కూడా పెరగొచ్చని తటస్థులు అంటున్నారు.

గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితం ఇలా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -51
తెలుగుదేశం పార్టీ -49
జనసేన -02

కర్నూలు ఎంపీ సీటు YCPకి ఇబ్బందులు తప్పవు

సావిత్రి, క్రీడాకారుల సినిమా చూశారే! మరి ఎన్టీఆర్ దే ఎందుకిలా?

Show comments