సినిమా రివ్యూ: గూఢచారి

రివ్యూ: గూఢచారి
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: అభిషేక్‌ పిక్చర్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్‌ మర్చంట్స్‌
తారాగణం: అడివి శేష్‌, శోభిత ధూళిపాల, ప్రకాష్‌ రాజ్‌, సుప్రియ యార్లగడ్డ, వెన్నెల కిషోర్‌, మధుషాలిని, అనీష్‌ కురువిల్లా తదితరులు
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
కూర్పు: గ్యారీ బి.హెచ్‌.
ఛాయాగ్రహణం: షానీల్‌ డియో
కథ: అడివి శేష్‌
కథనం: అడివి శేష్‌, శశికిరణ్‌ తిక్క, రాహుల్‌ పాకాల
నిర్మాతలు: అభిషేక్‌ నామా, టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌
దర్శకత్వం: శశికిరణ్‌ తిక్క
విడుదల తేదీ: ఆగస్ట్‌ 3, 2018

గూఢచారి కథలతో అప్పట్లో సూపర్‌స్టార్‌ కృష్ణ చాలా చిత్రాలు చేశారు. ఆ తర్వాతి తరం హీరోలు ఆ తరహా కథల జోలికి పోలేదు. హాలీవుడ్‌లో మాత్రం ఈ కాన్సెప్ట్‌ ఎవర్‌గ్రీన్‌ స్టోరీ సోర్స్‌. ఎప్పటికప్పుడు పెరుగుతోన్న సాంకేతిక నైపుణ్యంతో స్టయిలిష్‌గా, ఎక్సయిట్‌ చేసేలా ఎన్నెన్నో చిత్రాలు తీస్తుంటారు. హాలీవుడ్‌ ఫిలిం మేకర్స్‌ ఫాలో అయ్యే స్టయిల్‌లో మన 'ఏజెంట్‌ గోపి'ని మన ఎమోషన్స్‌కి తగ్గట్టుగా మలిచే ప్రయత్నమే 'గూఢచారి'. తక్కువ బడ్జెట్‌లో, పరిమిత వనరులతోనే 'గూఢచారి' చిత్ర బృందం దీనిని మలిచిన విధానం మాత్రం మెప్పిస్తుంది. అలాగని కాన్సెప్ట్‌, థ్రిల్స్‌, స్టయిల్‌ అని మాత్రమే కాకుండా అంతు చిక్కని కథ, ఉత్కంఠ కలిగించే కథనంతో యాక్షన్‌ లవర్స్‌ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు ప్రశంసలు అందుకుంటుంది.

కథలోకి వెళితే... చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన గోపి (అడివి శేష్‌) పెరిగి పెద్ద అయి తండ్రిలానే దేశసేవ చేయాలని అనుకుంటాడు. ప్రతిష్టాత్మక సీక్రెట్‌ సర్వీస్‌ సంస్థ త్రినేత్రలో జాయిన్‌ అయ్యే అవకాశం వస్తుంది. సమీర (శోభిత) అనే సైకాలజిస్టుతో ప్రేమలో పడిన గోపి అలియాస్‌ అర్జున్‌ తెలియకుండానే ఒక వలయంలో చిక్కుకుంటాడు. తాను అనుకున్నది సాధించిన కొద్ది రోజులకే త్రినేత్రకి ప్రధాన టార్గెట్‌ అవుతాడు. అసలు తనని ఎవరు టార్గెట్‌ చేసారు, ఎందుకు టార్గెట్‌ చేసారనే రహస్యం చేధించడానికి గోపి బయల్దేరతాడు. ఊహించని పరిస్థితులు ఎదురయి, తన బలహీనతల్ని పూర్తిగా అధిగమించాల్సిన అవసరం వచ్చినపుడు అతడు ఎలా రెస్పాండ్‌ అవుతాడు?

'గూఢచారి' తీసిన విధానంలో హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్స్‌ స్ఫూర్తి లేకపోలేదు. పలుపాత్రలు, సంఘటనలు, మలుపులు, సెట్టింగ్‌... ఈ జోనర్‌లో అద్భుతాలు అనిపించే కొన్ని సినిమాలని గుర్తుచేస్తాయి. అలాగని ఇది ఏ సినిమాకీ కాపీ కాదు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని అదే తరహా లుక్‌, ఫీల్‌ తీసుకురావడానికి కృషిచేసారు. అయితే ఈ చిత్రానికి బేస్‌గా స్ట్రాంగ్‌ ఇండియన్‌ ఎమోషన్‌ని పెట్టడంతో ఈ కథకి కమర్షియల్‌ అప్పీల్‌ కూడా వచ్చింది. 'గూఢచారి'లో ఒక ప్రధాన పాత్రని గూఢంగా వుంచి ఇచ్చిన సర్‌ప్రైజ్‌ థ్రిల్‌ చేస్తుంది. సినిమాలో చాలా ట్విస్టులు, సర్‌ప్రైజులు వుంటూనే వుంటాయి. ఏ క్షణంలోను తదుపరి ఏమి జరుగుతుందనేది ఊహించడానికి ఆస్కారముండదు. ఇందుకోసం దర్శకుడు ఆడియన్స్‌ని కొంచెం చీట్‌ చేసినా కానీ దానివల్ల వచ్చిన షాక్‌ వేల్యూకి ఆ చీటింగ్‌ క్షమించేయవచ్చు.

ఒక్కసారి గోపి తనని ఇరికించిన వారిని కనుక్కోవడం కోసం బయల్దేరిన దగ్గర్నుంచి కథ పరుగులు పెడుతుంది. ఈ టెంపో బ్రేక్‌ అవకుండా చూసుకోవడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. కమర్షియల్‌ అప్పీల్‌ కోసమని పాటలు కానీ, అతిగా అనిపించే పోరాట దృశ్యాలు కానీ లేకుండా కథనం బిగి సడలకుండా నడిపించిన విధానం యాక్షన్‌ లవర్స్‌కి సంతృప్తినిస్తుంది. ఇదేజోరు ప్రథమార్ధంలో కనిపించలేదు. చాలా లీజర్‌గా కథ మొదలై, అంతే తాపీగా సైడ్‌ట్రాక్‌ పడుతూ ముందుకెళుతున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా కార్యోన్ముఖుడైన కథనాయకుడికి పెట్టిన లవ్‌ ట్రాక్‌ అసలు కథని చాలాసార్లు పక్కదారి పట్టిస్తుంది. ఆ క్రమంలో పాటలు కూడా రావడం వల్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. అయితే అత్యంత ఆసక్తికరంగా సాగే ద్వితియార్ధంలో ఫస్ట్‌ హాఫ్‌లోనివి డీవియేషన్స్‌ కావని, వాటికి స్ట్రాంగ్‌ రీజన్‌ వుందని తెలుస్తుంది.

పతాక సన్నివేశంలో ఊహించని ఎమోషనల్‌ టచ్‌ ఇవ్వడం బాగుంది కానీ సదరు రహస్య పాత్రని సెంటిమెంటల్‌గా మలచడమే పాత్రోచితంగా అనిపించలేదు. ఆ ఫైనల్‌ కాన్‌ఫ్రంటేషన్‌ సీన్‌ ద్వారా కథానాయకుడికి అతిపెద్ద పరీక్ష ఎదురవుతుంది. అతనిలోని అతిపెద్ద బలహీనతని జయించి ఇంకా స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌గా అవతరించే అవకాశం చిక్కుతుంది. ఈ విధంగా దీనికి కొనసాగింపు (తీసే ఉద్దేశం ఉన్నట్టుంది) వున్నట్టయితే గూఢచారి ఇంకా స్ట్రాంగ్‌గా కనిపించే ఆస్కారముంది. 'త్రినేత్ర ఎప్పుడూ చూస్తూనే వుంటుంది' అనే ట్యాగ్‌ లైన్‌కి సంబంధించిన సీన్లు కమర్షియల్‌ హైస్‌ చాలానే ఇస్తాయి. కథానాయకుడిగా కంటే కథకుడిగా అడివి శేష్‌కి ఎక్కువ మార్కులు పడతాయి.

నటుడిగా తనకంటూ కొన్ని పరిమితులు వున్నప్పటికీ కాన్ఫిడెంట్‌గానే నటించాడు. కాకపోతే ఆ స్టయిల్‌, స్వాగ్‌, స్టార్‌డమ్‌ వున్న యాక్టర్‌ అయితే ఈ పాత్ర ఇంకా రక్తికట్టించేదేమో అనిపించక మానదు. సపోర్టింగ్‌ కాస్ట్‌ చక్కగా కుదిరింది. శోభిత రెగ్యులర్‌ హీరోయిన్‌లా కాకుండా ఈ చిత్ర సెటప్‌కి తగ్గ 'బాండ్‌ గాళ్‌'లా బాగా సెట్‌ అయింది. పవన్‌ కళ్యాణ్‌ తొలి హీరోయిన్‌ సుప్రియ ఎన్నో ఏళ్ల తర్వాత తెరముందుకి వచ్చి తన పాత్రకి వన్నెతెచ్చింది. ప్రకాష్‌రాజ్‌ నటన ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అయింది. వెన్నెల కిషోర్‌, అనీష్‌ కురువిల్లా, మధుషాలిని సీక్రెట్‌ ఏజెంట్స్‌గా బాగా చేసారు.

వేగంగా సాగే సన్నివేశాలకి తగ్గ నేపథ్య సంగీతంతో శ్రీచరణ్‌ ఈ చిత్రంలో చాలా సన్నివేశాలని మరింత ఎలివేట్‌ చేసాడు. పరిమిత వనరులతోనే రియలిస్టిక్‌గా, స్టయిలిష్‌గా ఈ చిత్రాన్ని ప్రెజెంట్‌ చేసిన సినిమాటోగ్రాఫర్‌ షానీల్‌ డియో ప్రతిభ ఆకట్టుకుంటుంది. పోరాట దృశ్యాలని చిత్రీకరించిన తీరు విశేషంగా మెప్పిస్తుంది. నిడివి కాస్త తక్కువ చేసినట్టయితే మరింత బాగుండేది. దర్శకుడు శశి కిరణ్‌ ఈ చిత్రాన్ని హ్యాండిల్‌ చేసిన విధానం ప్రశంసలు అందుకుంటుంది.

టాప్‌ డైరెక్టర్లకి స్టార్లు, బడ్జెట్‌ ఇచ్చినా కానీ ఇంత అథెంటిక్‌గా స్పై థ్రిల్లర్‌ తీయడం కష్టమని ఇటీవలే రుజువయింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సాయంతో రెగ్యులర్‌ చిత్రాల మధ్య ఒక స్పెషల్‌ మూవీగా దీనిని నిలబెట్టిన ప్రతిభ విశేషంగా మెప్పిస్తుంది. ప్రథమార్ధం విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని, నిడివి కాస్త తగ్గించినట్టయితే, యాక్షన్‌కి సడన్‌ బ్రేకులు వేసేయడం కాకుండా, ఇంకాస్త లాజికల్‌ కాన్‌ఫ్లిక్ట్‌ వున్నట్టయితే 'గూఢచారి' మరింత ఆకట్టుకుని వుండేది.

ఏదేమైనా మూస చిత్రాలతో విసిగిపోయిన ప్రేక్షకులకి సరికొత్త యాక్షన్‌ సెటప్‌లో థ్రిల్‌ చేస్తుంది 'గూఢచారి'. నవీన ఆలోచనలతో రొటీన్‌ పోకడలు బ్రేక్‌ చేసి తెలుగు సినిమాని కొత్త మార్గంలో నడిపిస్తోన్న చిత్రాల సరసన ఇది నిలుస్తుంది.

బాటమ్‌ లైన్‌: 'ఏజెంట్‌ గోపి' ఈజ్‌ బ్యాక్‌!
-గణేష్‌ రావూరి

Show comments