గోదారి సరే, పక్కదారి ఎందుకోయ్‌ జనసేనానీ.!

2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పాలకొల్లు అసెంబీ సిగ్మెంట్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పట్లో ఆయన తిరుపతి నుంచీ పోటీచేశారు, అక్కడినుంచి గెలవడంతో పరువు నిలబెట్టుక్కున్నట్లయ్యింది. పాలకొల్లు చిరంజీవి సొంతూరు. అలాంటి చోట పరాజయమంటే అది పెద్ద అవమానం కిందేలెక్క. కానీ, రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని చిరంజీవి సరిపెట్టుకున్నారు. ఇప్పుడు తమ్ముడి వంతు.. పశ్చిమగోదావరి జిల్లా నుంచే పవన్‌కళ్యాణ్‌ తాను పోటీచేసే నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.

అయితే పాలకొల్లు నుంచి కాదు, పక్కనేవున్న భీమవరం అయితే 'సేఫ్‌' అన్నది బహుశా పవన్‌ భావన కావొచ్చు. అదీకాదు, తెలుగుదేశం పార్టీనే అత్యంత వ్యూహాత్మకంగా జనసేనానితో భీమవరం నుంచి పోటీ చేయిస్తోందన్న వాదనా లేకపోలేదు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఉభయ గోదావరి జిల్లాల్లో తనకున్న సానుకూలత నేపథ్యంలో, అత్యంత వ్యూహాత్మకంగా పవన్‌, భీమవరంను ఎంచుకుని వుండొచ్చు. కానీ, గత భయాలు అభిమానుల్ని వెంటాడుతున్నాయి. చిరంజీవి అభిమానులు వేరు, పవన్‌ అభిమానులు వేరని పూర్తిగా అనేయడానికి వీల్లేదు.

పవన్‌ అభిమానుల్లో కొందరు చిరంజీవి సహా మిగతా హీరోలకు కొరకరాని కొయ్యిలుగా కన్పించొచ్చుగాక.. కానీ, చిరంజీవి అభిమానులు పవన్‌ని వేరుగా చూడరు, చూడలేరు కూడా. ఆ లెక్కన ఆ అభిమానులు, పవన్‌ గెలుపు కోసం కృషి చేయకుండా వుంటారా.? అయినాగానీ, వారిలో కొన్ని భయాలైతే గట్టిగానే వెంటాడుతున్నాయి. గత అనుభవాలు అలాంటివి మరి. చిరంజీవికే ఓటమి తప్పనప్పుడు, పశ్చిమగోదావరి జిల్లాలో పవన్‌ పరిస్థితి ఏంటి.?

ఇక, ఉత్తరాంధ్రలో సానుకూలత, తెలుగుదేశం పార్టీ నుంచి తెరవెనుక సహకారం దృష్టిలో పెట్టుకుని అత్యంత వ్యూహాత్మకంగా విశాఖజిల్లా గాజువాకని పవన్‌ ఎంచుకున్నట్లు కన్పిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ - జనసేన పార్టీ.. చిరంజీవి రెండుచోట్ల - పవన్‌ కళ్యాణ్‌ రెండుచోట్ల.. ఇలాంటి సెంటిమెంట్లు మెగా అభిమానులకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.

ఇప్పటిదాకా వెలుగు చూసిన ఏ సర్వే కూడా జనసేన పార్టీకి కనీసం ఏడెనిమిది శాతం ఓట్లు కూడా ఇవ్వడంలేదాయే. మరి, అన్నయ్య సాధించినట్లుగా అయినా తమ్ముడు రానున్న ఎన్నికల్లో ఓట్లు, సీట్లు సాధించగలుగుతాడా? వేచి చూడాల్సిందే.  

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments