'బాహుబలి' ఆయుష్షు ఎంత?

భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా... అని మరికొందరు అంటున్నారు! ఇవి ఒక సినిమాకు ఇస్తున్న కితాబులే కానీ, మనస్థాయి మరీ ఇంత తక్కువ? అనే సందేహాన్ని రైజ్‌ చేసే మాటలు కూడా ఇవి! జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి.. అనే మాటలను ప్రామాణికంగా తీసుకుని మాట్లాడుతున్నారు, ఆ మాటలు ''బాహుబలి'' సినిమాను పొగడటానికి ఉపయోగించుకుంటున్నారు. బాహుబలి మంచి ఎంటర్‌టైనరే కానీ, 'స్థాయి' అనే పదాన్ని చాలా సులభంగా వాడేయడమే ఇక్కడ ఒకింత దురదృష్టకరమైన అంశం. ఈ సినిమాను చూపించి మనవాళ్లు జబ్బలు చరుచుకోవడం, తొడలు కొట్టుకోవడాన్ని చూస్తే మనమే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది!

అతికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన తెలుగు మీడియా హాలీవుడ్‌ కూడా రాజమౌళి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. సినిమాలు తీయడం ఎలాగో రాజమౌళిని అడిగి తెలుసుకోవాలి.. అమెరికా వాళ్లు, ఇరాన్‌ వాళ్లు, సౌత్‌ కొరియన్లు క్యూలు కట్టాలి.. అంటూ నోటికొచ్చిన మాటలతో రెచ్చిపోతోంది. అలా చెబుతున్న అజ్ఞానానికి నివాళి ఘటించడం తప్ప మరేం చేయలేం. బాహుబలి లాంటి సినిమాను ప్రపంచ స్థాయి సినిమా.. హాలీవుడ్‌కు ధీటైన సినిమా అనడం.. మరో విస్మయకరమైన అంశం. అసలు హాలీవుడ్‌కు నిర్వచనం తెలియని వాళ్లే ఇలాంటి మాటలు చెబుతున్నారు! వారికీ జోహారులు.

మరి ఏ హాలీవుడ్‌ సినిమాతో పోలుద్దాం? ఏ రకంగా ఈ సినిమా భారత సినీకీర్తికి మకుట స్థాయిది అని వివరిద్దాం? వసూళ్లను వివరించా? గ్రాఫిక్స్‌ను చూపించా? ఈ రెండూగాక మరోమాట ఏదైనా ఉందా? బాహుబలిపై ఉన్న మాస్‌ మానియాను తక్కువ చేయడం లేదిక్కడ. మీడియా పుణ్యమో.. లేక మరో రకమైన అదృష్టమో.. ఈ సినిమాపై అనితర సాధ్యమైన క్రేజ్‌ ఏర్పడింది. ఆ క్రేజ్‌కు సినిమా ఎంత వరకూ న్యాయం చేసిందో.. దీన్ని క్రేజీగా చూసిన వాళ్లకే తెలియాలి. దాన్ని దాటి బయటకు వచ్చి ''స్థాయి'' గురించి మాట్లాడితే దీన్ని మన డొల్లతనాన్ని మనమే ఎండగట్టాల్సి వస్తుంది.

ఆయనెవరో అన్నాడట.. బాహుబలి సినిమాకు ఆస్కార్‌ అవార్డ్స్‌ కోసం లాబీయింగ్‌ చేయిస్తాను అని, ఈ మాట వింటే గత ఏడాది బాహుబలి పార్ట్‌-1ను ఇండియా తరపున ఆస్కార్‌ ఎంట్రీకి పరిశీలించిన విషయాన్ని గుర్తు చేయాల్సి వస్తుంది. బాహుబలి పార్ట్‌-1కు జాతీయ అవార్డును అయితే ఇచ్చారు, సగం సినిమాకే జాతీయ ఉత్తమ పురస్కారాన్ని ఇచ్చి అసలు నేషనల్‌ అవార్డ్స్‌నే నవ్వుల పాల్జేశారు. ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో అవార్డును ఇవ్వాలంటే.. సదరు సినిమాకు క్లైమాక్స్‌ ఉండాలనే ప్రాథమిక విషయాన్ని మరిచి నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల స్థాయిని నేలకు తీసుకొచ్చారు. అయితే ఫారెన్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్స్‌ ఎంట్రీ విషయంలో మాత్రం బాహుబలి తొలి రౌండ్‌లోనే వెనక్కొచ్చింది. చాలా సినిమాలు ఎంట్రీ కోసం పోటీపడగా.. బాహుబలి ది బిగినింగ్‌ను వెనకేసి, తమిళ సినిమా ''విసారణై'' ఆస్కార్స్‌కు టికెట్‌ పొందింది!

అదీ విషయం. వందలకోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన సినిమా కాదు, మరిన్ని వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన సినిమా కాదు, ప్రతిష్టను నిలిపే సినిమాలు వేరే. మనల్ని అంతర్జాతీయానికి పరిచయం చేసే సినిమాలు వేరే. వాటిని తెలుగు వాళ్లు ఎన్నడో తీశారు. వాటి తర్వాత మనకు క్షీణయానం మొదలైంది. ఆ క్షీణయానంలో మహాయానమే ''బాహుబలి వన్‌ అండ్‌ టూ''. వీటిని చూసే మనోళ్లు మురిసిపోతున్నారు.

బాహుబలిని కల్ట్‌ హిట్‌ అందామా..? అంటే.. అనొచ్చు. కానీ, దీని ప్రభావం ఎన్ని రోజులుంటుంది? అనేదే సందేహం. వీరమాస్‌ మానియాకు నిర్వచనం అయితే ఇచ్చింది కానీ, ఇదే జనానికి ఈ సినిమా ఎంతకాలం గుర్తుంటుంది? రేపు టీవీలో వేస్తే ఫస్ట్‌ అండ్‌ సెకెండ్‌ టైమ్స్‌ తర్వాత మూడోసారి ఇది ఎంతమందిని రిమోట్‌ పైచేయి వేయనీయకుండా చూడగలదు? అనేది ఆలోచిస్తే.. ఈ సినిమా స్థాయెంతో ఇట్టే స్పష్టత వస్తుంది.

బాహుబలి సినిమా గ్రేట్‌ అంటున్న వారు కూడా.. దీన్ని మాయాబజార్‌తోనో, మిస్సమ్మతోనో, పాండవ వనవాసంతోనో, మరో దానవీర శూర కర్ణతోనో.. పోల్చే దుస్సాహసం చేయలేదు. కాబట్టి గొప్ప గొప్ప తెలుగు సినిమాలతోనో.. అంతేస్థాయి హాలీవుడ్‌ ఫాంటసీపిరియాడిక్‌ డ్రామాలతోనో పోల్చి సమయాన్ని వృథా చేసుకోనక్కర్లేదు. తెలుగులో అరవై డెబ్బైయేళ్ల కిందటే వచ్చిన క్లాసికల్‌ ఎరా సినిమాల్లో దేని కాలిబోటికీ సమానమైన సినిమా కాదు బాహుబలి. రోజులు గడుస్తున్న కొద్దీ మన పాత బంగారానికి మెరుపు పెరుగుతోంది. అది పెరుగుతూనే ఉంటుంది. మధ్య అలాంటి లల్లాయి సినిమాలను తీసుకొచ్చి.. మనస్థాయి పెరిగింది అని ముచ్చట పడనక్కర్లేదు.

బాహుబలి రేంజ్‌ గురించి మాట్లాడుకోవడానికి.. తగిన సినిమా ఒకటే ఒకటి. అది తెలుగులోనే వచ్చింది. సంచలన విజయం సాధించింది. అదే 'అరుంధతి'. వాస్తవాలు మాట్లాడుకుంటే.. విడుదలకు ముందు ఎలాంటి హైప్‌ లేకుండా, విడుదలకు అపసోపాలు పడి.. వాయిదాలుపడి వచ్చి.. మీడియా సహకారం ఏదీలేకుండా.. జనాలకు విపరీతమైన స్థాయిలో ఎక్కేసిన 'అరుంధతి' సినిమా కన్నా బాహుబలి ఏ రకంగానూ గొప్పది కాదు.

అసలు 'అరుంధతి' అనే సినిమాను తీస్తున్నారని కూడా ఎవరికీ తెలియదు. అప్పటికి అనుష్క ఎవరో కూడా పెద్దగా తెలియదు. నాగార్జున సరసన సెకండ్‌ హీరోయిన్‌, సుమంత్‌ సరసన ఫస్ట్‌ హీరోయిన్‌ అదీ ఆమె స్థాయి. ఆ సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ ఔట్‌ ఆఫ్‌ ఫామ్‌. ఇక మల్లెమాల శ్యాంప్రసాద్‌ రెడ్డి ఎప్పుడో మంచి సినిమాలు తీశారు కానీ, 'అంజి' డిజాస్టర్‌ తర్వాత ఆయనను నమ్మడం మానేశారు ప్రేక్షకులు. ఆయనేదో పిచ్చికొద్దీ సినిమాలు తీస్తారు కానీ, ఆకట్టుకునేవి కాదేమో.. అనేది క్రిటిక్స్‌ అభిప్రాయం.

ఇక మేకింగ్‌ దశలో కానీ, విడుదల దశలో కానీ.. అరుంధతికి మీడియా ఇచ్చిన సహకారం శూన్యం. జీరో అంటే జీరో. అది వస్తుందనే విషయాన్ని మీడియా గుర్తించలేదు. కానీ.. అది వచ్చిన తర్వాత మీడియా అవసరం ఆ సినిమాకు లేకుండా పోయింది. సంక్రాంతి సందర్భంగా విడుదలన్నారు.

అవతల పోటీలో భారీ సినిమాలు. మీడియా ఆకాశానికెత్తేస్తున్న ''ఒక్కమగాడు'' వంటి సినిమాలతో పాటు విడుదలైంది అరుంధతి. సినిమాను ముందుగా ప్రకటించిన రోజు విడుదల చేయలేకపోయారు శ్యామ్‌. విడుదల ప్రకటనను పేపర్లకు ఇచ్చి.. ఆ రోజున సినిమాను విడుదల చేయలేదంటే... అదంత నెగిటివ్‌ పాయింటో ప్రత్యేకంగా వివరింనక్కర్లేదు. మరి రెండో రోజైనా విడుదలైందా? అంటే, అదీలేదు. చివరకు ఎలా విడుదల అయ్యిందో, ఏ పూటకు ప్రదర్శితం అయ్యిందో కానీ... ఎలా బొమ్మ పడింది! రాష్ట్రానికి 'బొమ్మాళి'' జ్వరం వచ్చింది!

ఊదరగొట్టే మీడియా లేదు, ఊరికే ప్రచారం చేసిపెట్టే కార్పొరేట్‌ పబ్లిసిటీ లేదు.. క్రేజీ డైరెక్టర్‌ లేడు, క్రేజీ హీరో లేడు, క్రేజీ విలన్‌ అంతకన్నా కాదు... ఏముంది ఆ సినిమాలో? బాహుబలి వీళ్లంతా మోస్తున్న స్థాయితో పోల్చుకుంటే, అరుంధతికి దక్కిన ప్రచారం ఎంత? అరుంధతిని మోసి పెట్టింది ఎవరు? ఒకవేళ అరుంధతికి కూడా ముందు, వెనుక బాహుబలి లాంటి హైప్‌తోడయి ఉండుంటే.. దాని వసూళ్లు మరే స్థాయిలోఉండేవి? ఆ సినిమాపై ఇంకా ఎలాంటి ప్రశంసలు వచ్చేవి? మోసేవాళ్లు మచ్చుకైనా లేకపోయినా.. అరుంధతి ఎన్ని అద్భుతాలను సృష్టించగలిగింది?

కొంచెం డీప్‌గా వెళ్లి మాట్లాడితే.. ఇదీ బాహుబలి స్థాయి. బాహుబలి వన్‌ అండ్‌ టూ ఈక్వలుస్‌ టు అరుంధతి! అదీ సమీకరణం. బాహుబలి సినిమాను మోసిన, మోస్తున్న మీడియా వర్గాల ప్రయోజనాలు వాటికున్నాయి. ఒక మాస్‌ హిస్టీరియాతో ఆ విధంగా వ్యవహారం కొట్టుకుపోయింది. కానీ.. ఇదంతా నీటిబుడగ. రెండు మూడేళ్ల తర్వాత చూసుకుంటే.. ఏమీ ఉండదు!

కాబట్టి... బాహుబలిని మనకు మకుటయమానం అనుకోవడానికి మించిన అపోహ మరోటిలేదు. బాహుబలిని కాదని.. విసారణైకి ఆస్కార్స్‌ టికెట్‌ ఇచ్చి పంపించినప్పుడే.. ఈ విషయం స్పష్టం అయ్యింది. అదేమంటే.. తమిళ సినిమాను పొగుడుతారు.. అని విరుచుకుపడతారు. మరి ఆస్కార్స్‌లో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించింది వాళ్లు కాబట్టి.. పొగిడి తీరాల్సింది. వందలకోట్ల రూపాయల వ్యాపారాన్ని చేశామని మనం జబ్బలు చరుచుకుంటే.. ఐదారు కోట్ల బడ్జెట్‌తో సినిమాను ఆస్కార్స్‌కు పంపించారు. ఎవరు గొప్ప?

ఎన్నిసార్లు కళ్లు చమర్చాయి? మరెన్నిసార్లు చర్మం జలదరించింది, ఇంకెన్నిసార్లు రోమాలు నిక్కబొడుచుకున్నాయి? బాహుబలి టూని చూసినప్పుడు ఇలాంటి ఫీలింగ్స్‌ ఎన్నిసార్లు కలిగాయి? 'దంగల్‌'ను చూసినప్పుడు మరెన్నిసార్లు మనసు, శరీరం భావోద్వేగపూరితం అయ్యింది? దంగల్‌ కలెక్ష్లను కూడా బాహుబలి బ్రేక్‌ చేయొచ్చు గాక.. మనసును వెంటాడటంలో మాత్రం దంగల్‌ను ఏ రకంగానూ గెలవలేదు.. బాహుబలి. ఇలాంటి బాహుబలి ఆయుష్షు కేవలం మూడున్నాళ్ల ముచ్చట. మరికొందరు అమాయక జనం.. బహుబలి సినిమా చైనాలో హిట్టైంది, నైజీరియాలో సంచలన విజయం సాధించింది అని మురిసిపోతున్నారు. ఎప్పుడో దశాబ్దాల కిందట వచ్చిన ''అల్లూరి సీతారామరాజు'' లండన్‌లో అర్ధశతదినోత్సవం జరుపుకున్న విషయాన్ని ప్రస్తావిస్తే.. మన ప్రతిష్ట దశాబ్దాల కిందటే ఖండాంతరాలను దాటింది, కొత్తగా భుజాలు తడుముకోనక్కర్లేదురా బాబూ.. విదేశాల్లో ఆడటం అనేది బాహుబలికే పరిమితం అయిన గొప్పదనం కాదు, దీన్ని గొప్పదనం అనుకోవడం కేవలం మీకే ప్రత్యేకమైన అజ్ఞానం అని చెప్పాల్సి వస్తుంది. ఇంతకీ ఇంత గొప్పదిగా ఇప్పుడు చెప్పబడుతున్న.. బాహుబలి ఆయుష్షు ఎంత? అంటే మాత్రం, దానికి కాలమే సమాధానం ఇవ్వబోతోంది!

Show comments