గెలిస్తే ఎం జరుగుతుంది?.. గెలవకపోతే ఏమవుతుంది?

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఏమి జరుగుతుంది? ఏ ఫలితం ఎలా వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లి రిస్కు తీసుకున్నారా? లేక, అదే కలిసి వచ్చిందా అన్నది కూడా రెండు రోజులలో తేలుతుంది. ఒకమాట మాత్రం ఒప్పుకోవాలి. టీఆర్‌ఎస్‌ తేలికగా గెలుస్తుందన్న భావన నుంచి టఫ్‌ పోటీ అయిందన్న భావనను తీసుకురావడంలో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, జనసమితిల ప్రజాకూటమి సఫలం అయిందని ఒప్పుకోవాలి. దీనికి కారణం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనిచెప్పాలి.

ఆయన తన ఆర్థిక వనరులు, రాజకీయ వ్యూహాలన్నిటిని ప్రయోగించి, మడియా ద్వారా టీఆర్‌ఎస్‌ను కొంతమేర భయపెట్టగలిగారని ఒప్పుకోవాలి. తాను టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నా, కాంగ్రెస్‌ను చెత్త పార్టీ అని గతంలో విమర్శించినా, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను విమర్శించి, కాంగ్రెస్‌ను భుజాన వేసుకున్నా, ఆయనకే చెల్లిందని చెప్పాలి. మామూలుగా అయితే కాంగ్రెస్‌ పార్టీ టీడీపీతో సంబంధం లేకుండా పోటీచేసి ఉంటే పరిణామాలు ఒక రకరంగా ఉండేవి. కాని ఇంత ప్రచారం, మీడియా కవరేజీ. ఇంత డబ్బు వచ్చేదా అన్నది కాంగ్రెస్‌ వారి ప్రశ్నగా ఉంది.

మరి తెలంగాణలో యాంటి చంద్రబాబు సెంటిమెంట్‌ నడవదా? అంటే ఎలాగోలా సర్ధుబాటు చేసుకోవచ్చని కాంగ్రెస్‌ నేతలు భావించారు. ముఖ్యంగా రాహుల్‌గాంధీ స్థాయిలో చంద్రబాబు మేనేజ్‌ చేసుకుని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎవరూ నోరు ఎత్తలేకపోయారు. పైగా తక్కువ సీట్లు తీసుకోవడానికి కూడా చంద్రబాబు సిద్ధపడిపోయారు. రాహుల్‌గాంధీతో కలిసి తిరిగితే చాలని ఆయన అనుకుంటే, చంద్రబాబు డబ్బు, ఆయన ద్వారా మీడియా ప్రచారం వస్తేచాలని కాంగ్రెస్‌ నేతలు అనుకున్నారు.

కాకపోతే ఇద్దరూ కలసి కాంగ్రెస్‌, టీడీపీ కార్యకర్తల సెంటిమెంటును, తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. అయినా ప్రజాకూటమి గెలిస్తే చేయగలిగింది ఏమిలేదు. సమాజం కూడా అలాంటి విలువలు లేని రాజకీయాలకు అలవాటు పడిందని అనుకోవాలి. రకరకాల సర్వేల ప్రకారం టీఆర్‌ఎస్‌ ఎంతోకొంత ఆధిక్యతతో బయటపడవచ్చు. సామాన్య జనంలో ప్రత్యేకించి పేద వర్గాలలో టీఆర్‌ఎస్‌ అనుకూలత కనిపించింది. కాస్త ఎగువ మధ్య తరగతి, కొన్ని అగ్రవర్ణాలలో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉంది. నిజంగానే కేసీఆర్‌పై కూటమి నేతలు చెబుతున్నట్లు వ్యతిరేకత ఉంటే వారికి పూర్తిస్థాయిలో ఆధిక్యత వస్తుంది.

కాని లగడపాటి రాజగోపాల్‌ కూడా దైర్యంగా ఆమాట చెప్పినట్లు కనిపించలేదు. పైగా ఆయన చెబుతున్న దానిలో హేతుబద్దత లేదు. ఎంఐఎమ్‌కు ఏడు లేదా ఎనిమిది, బీజేపీకి ఎనిమిది నుంచి పది, ఇండిపెండెంట్లకు పదిసీట్లు వస్తే మిగిలిన తొంభై సీట్లలో కాంగ్రెస్‌ అరవై సంపాదించగలగాలి. అలావస్తే అప్పుడు అది కూటమి వేవ్‌ అవుతుంది. మరి ఆ పరిస్థితి ఉందా అన్నది సందేహం. టీఆర్‌ఎస్‌కు ఏభై సీట్లు వచ్చి, ఎంఐఎమ్‌కు ఏడు సీట్లు వస్తే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులువు అవుతుంది. ఎందుకంటే బీజేపీ ఎటూ కాంగ్రెస్‌కు మద్ధతు ఇవ్వదు.

ముగ్గురు, నలుగురు ఇండిపెండెంట్లు గెలిచినా వారిని టీఆర్‌ఎస్‌ ఆకట్టుకుంటే సరిపోతుంది. అదే కాంగ్రెస్‌ కూటమికి ఏభైసీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు కష్టంకావచ్చు. ఏదో ఒక పార్టీకి మెజార్టీ వస్తే ఈ చర్చలకు అవకాశమే ఉండదు. చంద్రబాబు ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్య మాదిరి తీసుకుని ఖర్చుపెట్టడం చేశారు. ఆయనకు పోటీగా కేసీఆర్‌ కూడా ఖర్చుచేశారు. కేవలం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఒంటరిగా పోటీచేసుకుని అధికారంలోకి వస్తే పెద్దగా సమస్యలురావు. తెలంగాణ, ఏపీల మద్య విబేధాలు పెరగవు. ప్రజల మద్య వివాదాలు ఉండేవికావు.

కాని చంద్రబాబు మద్ధతుతో ప్రజాకూటమి అధికారంలోకి వస్తే మాత్రం భవిష్యత్తులో  తెలంగాణ సెంటిమెంటు తెరపైకి  రావచ్చు. టీఆర్‌ఎస్‌ ప్రతి అంశంలోను రకరకాల ఆందోళనలు చేపట్టవచ్చు. వారికి కాంగ్రెస్‌లో మంత్రిపదవులు రానివారు సహజంగానే సహకరిస్తారు. ఇప్పటికే చంద్రబాబు కింగ్‌మేకర్‌ అవుతారని టీడీపీ మీడియానే బానర్లు కట్టీ వార్తలు ఇచ్చింది. అంటే కాంగ్రెస్‌ ఎటూ ఆయన కంట్రోల్‌కు వచ్చింది. కేసీఆర్‌ విజయం సాధించకపోతే, చంద్రబాబుకు తెలంగాణలో కూడా ప్రస్తుతానికి ఎదురులేని పరిస్థితి ఏర్పడుతుంది.

తెలంగాణకు కూడా తానే దిక్కు అన్నట్లుగా చంద్రబాబు, టీడీపీ వారు వ్యవహరించే అవకాశం ఉంటుంది. అది సహజంగానే తెలంగాణలో మళ్లీ అభిమాన సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. 2009-2014 మద్య ఎలాంటి సంక్షోభాలను ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఎదుర్కున్నారో, అలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కావచ్చు. కాంగ్రెస్‌ ఒంటరిగా గెలిస్తే, టీఆర్‌ఎస్‌కు ఆ అవకాశం ఉండేదికాదు. టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే చంద్రబాబుకు టీఆర్‌ఎస్‌కు మద్య రాజకీయ సమస్య ఉంటుంది తప్ప, ప్రాంతీయ గొడవ, ప్రజల మధ్య విబేధాలకు ఆస్కారం ఉండకపోవచ్చు.

ఒకరకంగా చూస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణలో నివసిస్తున్న సీమాంద్రులకు కొత్త టెన్షన్‌ పెడుతున్నట్లు లెక్క. తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు కళ్ల సిద్దాంతం అంటూ టెన్షన్‌కు కారణం అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకలిసి ఆయన ప్రమాదకరమైన ప్రయోగం చేశారు. ఆ ప్రయోగంలో ఆయన సఫలం అయితే తెలంగాణ సెంటిమెంట్‌ ప్రబలమే కాకుండా, సీమాంధ్రులకు కొత్త సమస్యలు ఎదురు అవుతాయేమోనన్న అనుమానం కలుగుతుంది.

అలా జరగకపోతే సంతోషమే. కాని రాజకీయాలు ఎప్పడూ ఒకేరకంగా ఉండవు కదా! తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్ర ప్రజలకు కూడా ఈ ఎన్నికలు ఒక పరీక్షగా మారాయి.

-కొమ్మినేని శ్రీనివాసరావు 

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments