గాయం కెలకడం తప్ప ఆర్జీవీ సాధించేది ఏమిటి?

రియల్ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడం ఒక్కోసారి ఇబ్బందిగా మారుతుంది. ముంబాయిపై దాడి లాంటి సంఘనటలు ఆధారంగా సినిమా తీస్తే చూడాలవనే ఆసక్తి వుంటుంది. కానీ నలుగురు కిరాతకులు ఓ అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి, కాల్చి చంపిన సంఘటనను మళ్లీ సినిమాగా తీసి, కళ్ల ముందుకు తెస్తే, చూడడానికే భయంగా వుంటుంది. ఆందోళనగా వుంటుంది. బాధగా వుంటుంది. ఆ సంఘటన కారణంగా అనంత విషాదానికి గురైన కుటుంబానికి మరింత బాధగా మారుతుంది.

ఆర్జీవీ ఇప్పుడు చేస్తున్న పని ఇదే. హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన సంఘటన ఆధారంగా దిశ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా ట్రయిలర్ ను వదిలారు. చూడ్డానికే ఇబ్బంది పడేలా, బాధపడేలా వుంది. ఇక నిజమైన దిశ ఇంటి సభ్యులు ఈ ట్రయిలర్ చూస్తే గుండె ముక్కలయ్యేలా బాధపడరా?

ఇలాంటి సినిమా తీసి ఆర్జీవీ సాధించేది ఏమిటి? నాలుగు డబ్బులా? సామాజిక బాధ్యత వుండక్కరలేదు. కనీసం మానవతా విలువలైనా వుండాలి కదా? మన చర్యలతో ఆ కుటుంబాన్ని మరింత బాధపెట్టకూడదు అనే ఇంగిత జ్ఞానం అయినా వుండాలి కదా. అయినా ఇలాంటి సుద్దులు అన్నీ ఆర్జీవీ చెవికి ఎక్కేవి కావు. ఎవరు ఏమనుకుంటేనేం, ఎలా అనుకుంటేనేం, నాలుగు డబ్బులు సంపాదించామా? లేదా? అంతే కదా? ఆయన ఆలోచన.

Show comments