గంటా వర్సెస్‌ విష్ణు: విశాఖ నార్త్‌లో గెలుపెవరిది.?

మంత్రి గంటా శ్రీనివాసరావుకీ, బీజేపీ శాసనసభా పక్షనేత సిట్టింగ్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుకీ మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది విశాఖ నార్త్‌ నియోజకవర్గంలో. ప్రతిసారీ ఎన్నికల సందర్భంలో నియోజకవర్గాన్ని మార్చే గంటా శ్రీనివాసరావు, ఈసారి విశాఖ నార్త్‌ని ఎంచుకున్నారు. బోల్డంత కన్‌ఫ్యూజన్‌ నడుమ విశాఖ నార్త్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాన్ని గెల్చుకున్న గంటా, మాజీ మిత్రుడు విష్ణుకుమార్‌రాజు నుంచి గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది.

'ఈ ఎన్నికల్లో పోటీ నాకూ, గంటా శ్రీనివాసరావుకీ మాత్రమే.. ఇది పార్టీల మధ్య పోటీ అస్సలేకాదు.. ఇతర పార్టీలు ఇక్కడ పోటీచేసినా అది లెక్కే కాదు..' అంటూ బీజేపీనేత విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా విశాఖ నార్త్‌ ప్రజానీకం, విష్ణుకుమార్‌రాజు 'అత్యుత్సాహంపై' ముక్కున వేలేసుకుంటున్నారు. గెలిచే నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో గంటా శ్రీనివాసరావు దిట్ట. అన్ని ఈక్వేషన్స్‌ చూసుకున్నాకే ఆయన విశాఖ నార్త్‌ వైపుకు మొగ్గారు.

'అత్యంత అవినీతి పరుడు గంటా శ్రీనివాసరావుకీ, అత్యంత నిజాయితీ పరుడైన నాకూ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి' అని విష్ణుకుమార్‌రాజు చెప్పడం వరకూ బాగానే వున్నా, ఇక్కడ వైఎస్సార్సీపీ సైతం బలంగానే వుంది. విశాఖ నార్త్‌పై వైసీపీ ఎప్పటినుంచో ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆ మాటకొస్తే, విశాఖజిల్లాలో ఎలాగైనా గెలవాలన్న కసితో, టిక్కెట్ల ఎంపికలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరోపక్క, జనసేన ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం. జనసేన గెలవడం, గెలవకపోవడం అన్నది వేరే విషయం, ఇతర రాజకీయ పార్టీల విజయావకాశాల్ని దెబ్బకొట్టే స్థాయిలో జనసేనకు ఇక్కడ బలమైన క్యాడర్‌ కన్పిస్తోంది. కొసమెరుపేంటంటే, చివరి నిమిషం వరకూ విష్ణుకుమార్‌రాజు బీజేపీకి గుడ్‌ బై చెప్పి, టీడీపీలో చేరేందుకు ప్రయత్నించడం.

ఎన్నికల ప్రకటనకు కొద్దిరోజుల ముందుకూడా చంద్రబాబుతో విష్ణుకుమార్‌రాజు మంతనాలు జరిపారుగానీ, ఆ చర్చలు సఫలంకాలేదు. విశాఖజిల్లాలో అధికార పార్టీ భూ కుంభకోణాన్ని వెలికి తీయడంలో విష్ణుకుమార్‌రాజు విజయం సాధించినా, ఆ తర్వాత అధికార పార్టీ ఒత్తిళ్ళకు తలొగ్గిపోయిన మాటా వాస్తవం.  

కర్నూలు ఎంపీ సీటు YCPకి ఇబ్బందులు తప్పవు

సావిత్రి, క్రీడాకారుల సినిమా చూశారే! మరి ఎన్టీఆర్ దే ఎందుకిలా?

Show comments