గద్దర్‌ ఇప్పుడు పార్టీ పెడతాడా?

ప్రజాగాయకుడు గద్దర్‌ రాజకీయరంగ ప్రవేశం గురించి మీడియాలో వచ్చినన్ని వార్తలు ఇంకెవరి గురించి వచ్చివుండవేమోననిపిస్తోంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, పార్టీ పెడుతున్నానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని అనేకసార్లు ప్రకటించాడు. కాని ఇప్పటివరకు ఏదీ వర్కవుట్‌ కాలేదు. గద్దర్‌ను ఎన్నికల బరిలోకి దింపుతామని సీపీఎం, మరికొన్ని పార్టీల నాయకులు ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గద్దర్‌ పార్టీ పెట్టబోతున్నాడంటూ ఓ ప్రముఖ పత్రిక రాసింది.

ఈయనొక్కడే కాదు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ఱయ్య కూడా పార్టీ పెట్టబోతాడని సమాచారం. పార్టీలు పెట్టడమే కాకుండా ఎన్నికల బరిలోకి కూడా దింపుతారట. గడప ముందు ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు పార్టీ పెట్టి, దాన్ని ఎన్నికల బరిలోకి దింపడం సాధ్యమా? గతంలో గద్దర్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆహ్వానించినా తిరస్కరించి తానే సొంతంగా పార్టీ పెడుతున్నానన్నాడు.  'త్వరలోనే రాజకీయరంగ ప్రవేశం చేయడం, పార్టీ పెట్టడం తథ్యం' అన్నాడు.

'పార్టీని ప్రకటించేముందు స్టీరింగ్‌ కమిటీ వేస్తా. గ్రామాలకు వెళ్లి ప్రజలను ఓటర్లుగా మారుస్తా. భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతో చర్చలు జరుపుతా. వేములవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ నిర్మాణాన్ని, కార్యాచరణ గురించి తెలియచేస్తా' అని చెప్పాడు గద్దర్‌. ఓసారి భువనగిరిలో పదిలక్షల మందితో భారీ సభ నిర్వహిస్తానన్నాడు. తరువాత మౌనంగా ఉండిపోయాడు. 'వచ్చే ఎన్నికల్లో నేను కింగ్‌ మేకర్‌ను అవుతా. అవసరమైతే కింగ్‌ను అవుతా' అని ఒకసారి మీడియాతో అన్నాడు. రకరకాలుగా మాట్లాడటం తప్ప గద్దర్‌ ఏమీ చేయలేకపోయాడు.

ఈ నేపథ్యంలో వివాదాస్పద దళిత రచయిత ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య 'టీ మాస్‌ తరపున గద్దర్‌ను కేసీఆర్‌కు పోటీగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతాం' అని కొంతకాలం కిందట ప్రకటించారు. ఐలయ్య టీ మాస్‌ రాష్ట్ర కన్వీనర్‌. టీ మాస్‌ అంటే తెలుసుకదా. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పనిచేస్తున్న 280 ప్రజాసంఘాలు, సంస్థలూ కలిసి టీ-మాస్‌గా (తెలంగాణ మాస్‌ అండ్‌ సోషల్‌ ఆర్గనైజేషన్స్‌). అగ్రవర్ణాల పాలనను అంతం చేసి, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కేలా చేయడం టీ మాస్‌ లక్ష్యం.

ఇది కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోరాటాలు చేస్తోంది. ఈమధ్యనే ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై గద్దర్‌ను, కేటీఆర్‌పై విమలక్కను పోటీకి పెడతామని చెప్పారు. వీరిద్దరూ తెలంగాణ కోసం త్యాగాలు చేశారని చెప్పారు. వీరిపై ఇతర పార్టీలు పోటీకి అభ్యర్థులను నిలబెట్టవద్దని కూడా కోరారు. గతంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గద్దర్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని, చట్టసభకు పంపుతామని ప్రకటించారు.

తమ పార్టీ నేతృత్వంలోని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. మావోయిస్టు మార్గాన్ని వీడిన గద్దర్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉండే ఏ పార్టీ అయినా రంగంలోకి దింపుతుంది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయొచ్చు. గద్దర్‌గాని, ఆర్‌. కృష్ణయ్యగాని ఇప్పటికిప్పుడు పార్టీలు పెట్టి సాధించేది ఏమైనా ఉంటుందా?

Show comments