గ్రేటాంధ్ర జోస్యం : పవన్ సైలెంటే!

తెలంగాణ ఎన్నికలకు పవన్ కల్యాణ్ – జనసేన పార్టీ దూరంగా ఉంటున్నట్టే! ఆ పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ.. ఆ సంగతి దాదాపుగా ఖరారైపోయింది. కొన్ని నెలలుగా పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకుని, వారితో కలిసి తెలంగాణ ఎన్నికలను ఎదుర్కోవాలని.. ఉవ్విళ్లూరుతూ... వారి చుట్టూ తిరుగుతూ మంతనాలు సాగిస్తూ వచ్చిన సీపీఎం.. తాజాగా జనసేన ప్రస్తావన కూడా లేకుండా.. తాము ఎన్నికలకు సిద్ధమవుతున్న తీరు గురించి పత్రికలకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఈ విషయం తేటతెల్లమైంది.

తెలంగాణలో సీపీఎం స్పష్టంగా కేసీఆర్ వ్యతిరేకతతోనే ఎన్నికల బరిలోకి దిగుతోంది. అందకే వారు పవన్ కల్యాణ్ ఆసరాను కూడా కోరుకున్నారు. అయితే.. మొన్న మొన్నటి దాకా కేసీఆర్ పాలన గురించి.. ఆయన కుటుంబ వారసత్వ రాజకీయాల గురించి.. తనదైన శైలిలో విపరీతంగా భజన చేస్తూ వచ్చిన పవన్ కల్యాణ్.. కేవలం సీపీఎం తో పొత్తు పెట్టుకున్న పాపానికి ఒక్కసారిగా తన వైఖరి మార్చుకుని.. కేసీఆర్ ను తిట్టడం ప్రారంభిస్తారా అనే సందేహాలు పలువురికి కలిగాయి.

తెలంగాణ ఎన్నికలకు పవన్ దూరంగా ఉండదలచుకున్నారని.. ఆయనకు అంతకు మించి గత్యంతరం కూడా లేదని విశ్లేషిస్తూ గ్రేటాంధ్ర ఒక విశ్లేషణాత్మక కథనాన్ని కొన్ని రోజుల కిందటే అందించింది. అచ్చంగా ఆ విశ్లేషణలో పేర్కొన్నట్టుగానే ఇప్పుడు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీపీఎం ప్రపోజల్ కు పవన్ ఓకే చెప్పలేదు. పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది.

పవన్ కల్యాణ్ ప్రధానంగా రెండు అంశాలకు భయపడినట్లుగా తెలుస్తోంది. 1) తెలంగాణ ఎన్నికల్లో  ఇప్పటికిప్పుడు బరిలోకి దిగినా గెలిచేదేమీ ఉండదు. పవన్ బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోతే.. పరువు పోతుంది. దాని ప్రభావం ఏపీ రాజకీయాల మీద విపరీతంగా పడుతుంది. అక్కడ రాబోయే ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతిన్నా ఆశ్చర్యం లేదు. 2) కేసీఆర్ తో ఇప్పటిదాకా పవన్ మంచి సంబంధాలను కలి గిఉన్నారు. కేవలం తాము గెలిచే చాన్సు లేని ఈ ఎన్నికల వలన ఆయనతో సున్నం పెట్టుకోవడం కొరివితో తల గోక్కోవడం లాంటిదని ఆయన భావించారు.

ఏది ఏమైనప్పటికీ.. కేసీఆర్ ను ఉన్నపళంగా తిట్టడం పవన్ కు ఇష్టం లేదని, అందుకే ఆయన సీపీఎం తో పొత్తు వద్దనుకుని ఎన్నికలకు దూరంగా ఉండదలచుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన సైలెన్స్ వ్యూహాత్మక సైలెన్స్ అని, అందులో ఆయనకు బహుళ ప్రయోజనాలు దాగి ఉన్నాయని కూడా విశ్లేషిస్తున్నారు.

Show comments