అప్పుడు ఉదయ్ కిరణ్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ

ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ హీరోకు ఎనలేని గుర్తింపు వస్తుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతుంది. సేమ్ టైం, ఇండస్ట్రీలో అతడిపై ఓ రకమైన ఈర్ష్య కూడా ప్రారంభమౌతుంది. నిన్నగాకమొన్న వచ్చిన వీడికి ఇంత క్రేజ్ ఏంటి అనే కుళ్లుబోతు మాటలు కూడా వినిపిస్తాయి. తెరవెనక కారాలు-మిరియాలు నూరే బ్యాచ్ రెడీ అయిపోతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరిస్థితి ఇదే. 

అర్జున్ రెడ్డి సక్సెస్ తో ఎక్కడికో వెళ్లిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక గీతగోవిందం హిట్ తో ఏకంగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. స్వయంగా చిరంజీవి లాంటి హీరో "స్టార్ హీరోల క్లబ్ లోకి స్వాగతం" అంటూ నిండుసభలో ప్రకటించాడంటే విజయ్ దేవరకొండ హవా అర్థంచేసుకోవచ్చు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు దేవరకొండను కిందకి లాగాలనే ప్రయత్నాలు, అతడికి ఫ్లాప్ వస్తే చూసి సంబరపడాలనే మనుషులు రోజురోజుకు ఎక్కువయ్యారు. 

ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. నోటా సినిమా ఫ్లాప్ అయింది. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మాత్రం మారలేదు. సినిమా ఫ్లాప్ అని ఓపెన్ గా ఒప్పుకున్నాడు. మరింత కష్టపడతానని ప్రకటించాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో దేవరకొండకు వ్యతిరేకంగా ఓ వర్గం మొదలైంది. అతడికి ఫ్లాప్ వస్తే ఇండస్ట్రీలో పండగ చేసుకునే బ్యాచ్ తయారైంది. 

నిన్నటికినిన్న విజయ్ దేవరకొండపై హీరో నిఖిల్ పరోక్షంగా ట్వీట్ చేశాడు. ప్రపంచం తమ చుట్టూనే ఉందనే భ్రమలు వద్దని, యాటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిదని పోస్ట్ చేశాడు. అంతకంటే ముందు నాగశౌర్య కూడా దాదాపు ఇలాంటి అర్థంవచ్చేలా, పరోక్షంగా విజయ్ దేవరకొండపై విమర్శలు గుప్పించాడు. విజయ్ దేవరకొండ కొన్ని పాత్రలకే పరిమితం అంటూ మాట్లాడాడు. ఆఫ్ ది రికార్డు శర్వానంద్ కూడా దాదాపు ఇలానే రియాక్ట్ అయ్యాడు. 

ఇలా పరిశ్రమలో చాలామంది హీరోలకు ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే నచ్చడంలేదు. తమకు సక్సెస్ రాకుండా, తమకంటే ఆలస్యంగా వచ్చిన మరో హీరోకు బ్లాక్ బస్టర్ దక్కితే ఏ హీరోకైనా కడుపుమంటగానే ఉంటుంది. గతంలో ఉదయ్ కిరణ్ విషయంలో ఇదే జరిగింది. 

ఉవ్వెత్తు కెరటంలా దూసుకొచ్చాడు ఉదయ్ కిరణ్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అప్పటి హీరోల్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఒకదశలో యూత్ అంతా ఉదయ్ కిరణ్ వెంటపడింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో తెరవెనక జరిగిన రాజకీయాలు ఉదయ్ కిరణ్ కెరీర్ ను ఎలా నాశనం చేశాయో అందరం చూశాం. 

ఇప్పుడు సరిగ్గా అదే స్టేజ్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రేక్షకుల్లో ఇతడికి అభిమానులున్నారు. కానీ పరిశ్రమలో కనిపించని శత్రువులున్నారు. పైకి నవ్వుతారు. నేను నీవాడినే అన్నట్టు మాట్లాడారు. కానీ ఊహించని లోతులో గోతులు తవ్వుతారు.

అందరూ నిఖిల్ లా ఓపెన్ అవ్వరిక్కడ. విజయ్ దేవరకొండ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన టైమ్ ఇది. రైట్ యూటిట్యూడ్ చూపించాల్సిన సమయం ఇదే.

Show comments