తమిళనాడులో ఎప్పుడూ ఇదే గొడవ...!

కొన్ని రాజకీయ పార్టీలకు ఎప్పుడూ రెడీమేడ్‌ వివాదాలు సిద్ధంగా ఉంటాయి. ఆ పార్టీల పరిస్థితి రాజకీయంగా బాగాలేదనుకున్నప్పుడో, ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకున్నప్పుడో ఆ వివాదాలను కెలుకుతుంటాయి. అది కొన్నాళ్లపాటు నడిచి కనుమరుగువుతుంది. మళ్లీ కొంతకాలం తరువాత మళ్లీ అదే వివాదానికి దుమ్ము దులిపి మళ్లీ గొడవ చేస్తుంటారు. తమిళనాడులో ఓ రెడీమేడ్‌ వివాదం స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉంది. అయితే స్వాతంత్య్రం వచ్చిన డెబ్బయ్‌ ఏళ్ల తరువాత కూడా ఆ వివాదాన్ని సజీవంగా ఉంచి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుండటం ద్రవిడ పార్టీల ప్రత్యేకత. ఆ వివాదం పేరు హిందీ వ్యతిరేకత లేదా కేంద్ర ప్రభుత్వ హిందీ ఆధిపత్యం. 'కేంద్రం తమిళనాడు మీద హిందీని బలవంతంగా రద్దుతోంది మొర్రో'..అని ద్రవిడ పార్టీలు మొత్తుకుంటూ ఉంటాయి. 

తాజాగా డీఎంకే ఈ వివాదానికి దుమ్ము దులుపుతోంది. దాన్ని చూసి తామెక్కడ వెనకబడిపోతామోననే భయంతో మిగిలిన పార్టీలూ వంత పాడుతున్నాయి. ఈ వివాదాన్ని డీఎంకే ఎందుకు నెత్తికెత్తుకోవల్సివచ్చింది? ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తున్నందుకేమో...! బీజేపీపై జనానికి వ్యతిరేకత రావాలంటే 'కేంద్రం హిందీ బలవంతంగా రద్దుతోంది' అని ప్రచారం చేయాలి. ప్రస్తుతం కేంద్రం హిందీని బలవంతంగా రుద్దే చర్యలు ఏం తీసుకుంది? ఏం తీసుకున్న దాఖలా లేదు. డీఎంకే నాయకులకు రాష్ట్రంలోని కొన్ని హైవేల మీది మైలు రాళ్లలో హిందీ పేర్లు కనబడ్డాయట....! కృష్ణగిరి, వెల్లూరులో హైవేల మీద ఇంగ్లీషు పేర్ల స్థానంలో (ఊళ్ల పేర్లు వగైరా) హిందీ పేర్లు కనపించాయట. దీంతో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ ఆగ్రహించారు. చిత్తూరు-వెల్లూరు హైవే, కృష్ణగిరి -త్రివేండ్రం 77వ జాతీయ రహదారిపై మైలు రాళ్లలో పేర్లను హిందీలో రాశారని, ఇది హిందీని రుద్దడమేనని అన్నారు. 'ఇది తమిళుల సెంటిమెంటును అగౌరవపరచడమే. దొడ్డిదారిన హిందీ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు' అని విమర్శించారు. 

రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా మరిన్ని హిందీ పేర్లు కనిపించినట్లయితే ఉద్యమం లేవదీస్తామని స్టాలిన్‌ హెచ్చరించారు. మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎండీకే) పాటాలి మక్కళ్‌ కట్చి (పీఎంకే) కూడా ఉద్యమిస్తామని చెప్పాయి. ఇంగ్లీషు పేర్లను చెరిపేసి హిందీలో రాయడం నిరంతరం కొనసాగుతోందని ఆ పార్టీల నాయకులన్నారు. రాష్ట్రంలో 1930లో, 1960లో హిందీ వ్యతిరేక ఉద్యమం భారీఎత్తున సాగింది. 1930లో ద్రవిడ కళగం (డీకే) ఉద్యమానికి నాయకత్వం వహించింది. 1965లో డీకే నుంచి అన్నాదురై విడిపోయి డీఎంకే పేరుతో పార్టీ పెట్టుకున్నారు. ఆయన నాయకత్వంలో హిందీ వ్యతిరేక ఉద్యమం సాగింది. ఆ సమయంలోనే యువ నాయకుడిగా స్టాలిన్‌ రంగంలోకి దిగారు. హిందీ వ్యతిరేక ఉద్యమాల ప్రభావం కారణంగా రాజకీయాలు జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్రంలోనూ మారిపోయాయి. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ అధ్యాయం పరిసమాప్తమైంది.

తమిళనాడులో హిందీ వ్యతిరేకత అనేది రాజకీయాస్త్రమే తప్ప సామాన్య జనంలో హిందీ వ్యతిరేకత అంతగా ఉన్నట్లు కనబడదు. ఇప్పటితరం యువత హిందీని పనిగట్టుకొని వ్యతిరేకించడంలేదు. భాషను ఆయుధంగా ఉపయోగించిన తీరును ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చూశాం. తెలంగాణ ఓ ప్రత్యేక భాషని, ఇది తెలుగు భాష కాదని ఉద్యమకారులన్నారు. తెలుగుతల్లితో తమకు సంబంధం లేదంటూ తెలంగాణ తల్లిని తయారుచేసుకున్నారు. పాల్కురికి సోమనాథుడిని తెలంగాణ ఆది కవిగా ప్రకటించుకున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ తమకు ప్రత్యేక అస్తిత్వం ఉందని చాటుకున్నారు. కాని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ తీవ్రత తగ్గిపోయింది. కాని తమిళనాడులో హిందీ వ్యతిరేకతను జిడ్డులా పట్టుకొని వదలడంలేదు.

Show comments