విజయ్ దేవరకొండను క్రాస్ చేయలేకపోయిన వెంకీ

సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్2 సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దిల్ రాజు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఇప్పుడీ సినిమా స్మాల్ స్క్రీన్ పై కూడా సంచలనం సృష్టించింది. రీసెంట్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ఈ సినిమాకు ఏకంగా 13.34 రేటింగ్ (అర్బన్, రూరల్ కలిపి) రావడం విశేషం. కేవలం అర్బన్ లో చూసుకున్నట్టయితే దీని రేటింగ్ ఏకంగా 17.38 నమోదైంది.

ఉగాది కానుకగా ఏప్రిల్ 7న ప్రసారమైన ఈ సినిమాకు బుల్లితెర వీక్షకులు అతుక్కుపోయారనే విషయం రేటింగ్ చూస్తే అర్థమౌతూనే ఉంది. నిజానికి ఈ సినిమాకు ఇంతకంటే ఎక్కువ రేటింగ్ అంచనా వేశారు. అటుఇటుగా 20 టీఆర్పీ టచ్ అవుతుందని లెక్కకట్టారు. కానీ టీవీలో ప్రసారం కంటే ముందే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వచ్చేయడంతో చాలామంది డిజిటల్ స్ట్రీమింగ్ లో ఒకటికి రెండుసార్లు ఈ సినిమా చూశారు. అందుకే బుల్లితెరపై ఎఫ్2కు కాస్త రేటింగ్ తగ్గింది.

కానీ వరుణ్ తేజ్, వెంకటేష్ సినిమాలకు టీవీల్లో రీచ్ తో పోల్చి చూసుకుంటే ఇది చాలా ఎక్కువ. అయితే వెంకీ, వరుణ్ కలిసినా విజయ్ దేవరకొండను మాత్రం క్రాస్ చేయలేకపోయారు. ఇతడు నటించిన గీతగోవిందం సినిమాకు ఏకంగా 20.7 టీఆర్పీ రావడం విశేషం. ఈ సినిమా ఏకంగా రంగస్థలాన్ని కూడా క్రాస్ చేసింది.

ఎఫ్2 అనేది పూర్తిగా కుటుంబ కథా చిత్రం కాబట్టి.. రంగస్థలం, గీతగోవిందం సినిమాల్ని సైతం క్రాస్ చేసేస్తుందని లెక్కలు కట్టారు. కానీ అది సాధ్యంకాలేదు. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు వెంకీ, వరుణ్ తేజ్ సినిమాలకు ఈ టీఆర్పీ చాలా ఎక్కువ.

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?