ఎమ్బీయస్‌: ఎగ్జిట్‌ పోల్స్‌ - బిజెపి బహుపరాక్‌

సెమీ ఫైనల్స్‌గా అభివర్ణించబడిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చాయి. ఎప్పటిలాగానే వాటి మధ్య చాలా అంతరాలున్నాయి. డిసెంబరు 11న ఫలితాలు వచ్చినపుడు వాటి నిక్కచ్చితనం బయటపడుతుంది. అయితే యీ లోపుగా అంచనాలు వేసుకుని చూసినా, బిజెపి జాగ్రత్త పడవలసిన సందర్భం వచ్చిందనిపిస్తోంది. 2014 పార్లమెంటు ఎన్నికలలో వచ్చినన్ని సీట్లు బిజెపికి 2019 ఎన్నికలలో రావని అందరం అనుకుంటున్నాం. అయితే ఏ మేరకు తగ్గుతాయన్నది తెలియరాలేదు. ఎందుకంటే అప్పటి కంటె అది అనేక కొత్త రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలలో గెలిచింది, లేదా బలం పుంజుకుంది. పాత వాటిల్లో తగ్గినా, కొత్త వాటిల్లో వచ్చి చేరతాయనే ధీమా దాని అభిమానుల్లో ఉంది. పాత వాటిల్లో ఏ మేరకు తగ్గుతాయనేది యీ ఎగ్జిట్‌ పోల్స్‌ కాస్త చెప్పవచ్చు. ఎందుకంటే యివి ఓటింగు శాతాన్ని సూచిస్తాయి. ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ఒక్క 1% స్వింగ్‌ అటుది యిటైనా అంకెల్లో చాలా తేడా వచ్చేస్తుంది. పార్లమెంటు నియోజకవర్గం పెద్దగా వుంటుంది కాబట్టి స్వింగ్‌ ప్రభావం తక్కువగా ఉంటుంది.

మొదటగా 25 పార్లమెంటు సీట్లు ఉన్న రాజస్థాన్‌ తీసుకుందాం. 2009లో బిజెపికి 4 వస్తే 2014లో 25 వచ్చాయి. ఇప్పుడు ఏ సర్వే చూసినా బిజెపి కంటె కాంగ్రెసుకు దాదాపు రెట్టింపు సీట్లు వస్తాయంటున్నారు. నార్త్‌ ఇండియా సర్వేల్లో చెప్పుకోదగినవంటూ రాజగోపాల్‌ మెచ్చుకున్న ఏక్సిస్‌, టుడేస్‌ చాణక్యలను పరిగణిద్దాం. ఏక్సిస్‌ ప్రకారమైతే మొత్తం 200 అసెంబ్లీ సీట్లలో బిజెపికి 63, కాంగ్రెసుకు 130 వస్తాయి. చాణక్య ప్రకారమైతే బిజెపికి 68 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 12 వస్తాయి. కాంగ్రెసుకు 123 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 12 వస్తాయి. వీటి సరాసరి తీసుకుంటే బిజెపికి 66 కాంగ్రెసుకు 127 అనుకోవచ్చు. ఇండియా టుడే బిజెపికి యిచ్చిన 55-72 సరాసరి 64. బిజెపికి మద్దతిచ్చే రిపబ్లిక్‌ టివి యిచ్చిన 83-103 సరాసరి 93 అయింది. టైమ్స్‌ నౌ 85 అంది. న్యూస్‌ నేషన్‌ 91 అంది. వీటన్నిటిని కలగలిపి చూస్తే ఎక్కువలో ఎక్కువ 80 అనుకోవచ్చు. అంటే మొత్తం సీట్లలో 40%. పార్లమెంటు సీట్లకు దీన్ని అన్వయిస్తే 10 అవుతుంది. అంటే గతంలో కంటె 15 తగ్గుతాయన్నమాట.

ఇక 29 సీట్ల మధ్యప్రదేశ్‌. 2009లో బిజెపికి 16 వస్తే 2014లో 27 వచ్చాయి. ఇప్పుడు ఏ సర్వే చూసినా బిజెపి, కాంగ్రెసు మధ్య హోరాహోరీ పోరాటమంటున్నారు. ఏక్సిస్‌ ప్రకారమైతే మొత్తం 230 అసెంబ్లీ సీట్లలో బిజెపికి 111, కాంగ్రెసుకు 113 వస్తాయి. చాణక్య ప్రకారమైతే బిజెపికి 103 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 12 వస్తాయి. కాంగ్రెసుకు 125 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 12 వస్తాయి. వీటి సరాసరి తీసుకుంటే బిజెపికి 112 కాంగ్రెసుకు 119 అనుకోవచ్చు. బిజెపికి ఏబిపి న్యూస్‌ 109, రిపబ్లిక్‌ టీవీ-సీ ఓటర్‌ 98, టైమ్స్‌ నౌ- సిఎన్‌ ఎక్స్‌ 126 యిచ్చాయి. వీటన్నిటినీ చూసుకుంటే బిజెపికి సరాసరిన 111 వస్తాయనుకోవచ్చు. అంటే మొత్తం సీట్లలో 48%. పార్లమెంటు సీట్లకు దీన్ని అన్వయిస్తే 14 అవుతుంది. అంటే గతంలో కంటె 13 తగ్గుతాయన్నమాట.

ఇక 11 సీట్ల ఛత్తీస్‌గఢ్‌.  బిజెపికి 2009లో, 2014లో రెండు సార్లూ 10 వచ్చాయి. సర్వేలు బిజెపి, కాంగ్రెసు పోటాపోటీగా ఉన్నాయంటున్నాయి. ఏక్సిస్‌ ప్రకారమైతే మొత్తం 90 అసెంబ్లీ సీట్లలో బిజెపికి 26, కాంగ్రెసుకు 60 వస్తాయి. చాణక్య ప్రకారమైతే బిజెపికి 36 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 8 వస్తాయి. కాంగ్రెసుకు 50 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 8 వస్తాయి. వీటి సరాసరి తీసుకుంటే బిజెపికి 31 కాంగ్రెసుకు 55 అనుకోవచ్చు. బిజెపికి ఏబిపి న్యూస్‌ 35, రిపబ్లిక్‌ టీవీ-సీ ఓటర్‌ 39, టైమ్స్‌ నౌ- సిఎన్‌ ఎక్స్‌ 46 యిచ్చాయి. వీటన్నిటినీ చూసుకుంటే బిజెపికి సరాసరిన 48 వస్తాయనుకోవచ్చు. అంటే మొత్తం సీట్లలో 53%. పార్లమెంటు సీట్లకు దీన్ని అన్వయిస్తే 6 అవుతుంది. అంటే గతంలో కంటె 4 తగ్గుతాయన్నమాట.

మిజోరంలో కాంగ్రెసు పోతోందంటున్నారు కానీ దానివలన బిజెపికి వచ్చే లాభమేమీ లేదు. తెలంగాణలో బిజెపి కొత్తగా గెలిచేది, పోగొట్టుకునేది ఉండకపోవచ్చు. దీన్ని వాళ్లు గాలికి వదిలేసినట్లు కనబడుతోంది. అందువలన పైన చెప్పిన మూడు రాష్ట్రాలలో కలిపి చూస్తే బిజెపికి 32 సీట్లు తగ్గుతాయి. ఈ మేరకు ఏ రాష్ట్రాలలో బిజెపి పుంజుకోవచ్చు? ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, కర్ణాటక వంటివి కనబడుతున్నాయి. కానీ యుపిలో గతంలో లాగ స్వీప్‌ చేసే పరిస్థితి కనబడటం లేదు. ఎస్పీ, బియస్పీ విడివిడిగా పోటీ చేసినా ఇదివరకట్లా గెలుస్తుందనే ఆశ పెట్టుకోవడం కుదరదు. బిహార్‌లో జెడియుతో చేతులు కలిపినా అవతల లాలూ కూడా బలంగానే కనబడుతున్నాడు.

2014 గుజరాత్‌లో మొత్తం స్థానాలను గెలుచుకున్నారు కానీ యిప్పుడు అయిదారైనా తగ్గుతాయనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే హీనపక్షంగా 35 సీట్లు తక్కువౌతాయని కచ్చితంగా చెప్పవచ్చు. 2014లో బిజెపి సొంతంగా 282 తెచ్చుకుని తనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంది. కానీ యీ 35 తగ్గితే మాత్రం ఎన్‌డిఏలోని యితర భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పదు. అప్పుడు మోదీ ఏకచ్ఛత్రాధిపత్యానికి, ఏకపక్ష నిర్ణయాలకు గండి పడినట్లే. బిజెపి పార్టీలో కూడా అసమ్మతి గళాలు వినిపించడం ప్రారంభమౌతుంది. అది పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి, దీర్ఘకాలపు మనుగడకు మంచిదే. పార్లమెంటరీ ఎన్నికలకు ఈ లెక్కలేమీ పనికి రావు, వాటికీ, అసెంబ్లీ ఎన్నికలకు తేడా వుంటుంది, అక్కడ మోదీ వర్సెస్‌ రాహుల్‌ పోటీ ఉంటుంది కాబట్టి మోదీ గెలిచేస్తాడు అని వాదించవచ్చు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అయితే వ్యక్తుల మధ్య పోటీ ఉంటుంది. కానీ మన దేశంలో పార్లమెంటరీ ఎన్నికల పద్ధతి అది కాదు, ఎంపీలు గెలిచాక ప్రధాని ఎవరో వాళ్లు ఎన్నుకోవాలి. మా పార్టీ ప్రధాని అభ్యర్థి ఫలానా అని ముందే చెప్పవలసిన పని లేదు. పార్టీని చూసి మాత్రమే ఓటేయాలి. తర్వాత వాళ్లు విడిగానో, సంయుక్తంగానో ప్రభుత్వం ఏర్పరచుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుంటారు. నెహ్రూ హయాంలో కాంగ్రెసు తరఫున ప్రధాని ఆయనే అవుతాడు అని అనుకునేవారు తప్ప, అలా ప్రకటించుకోలేదు. ఆయన పోయాక ఎవరూ వూహించనట్లుగా శాస్త్రి ప్రధాని అయ్యారు. ఆయన పోయాక ఇందిర అయ్యారు.

ఇందిర బలపడ్డాక యిక ఆమెయే ప్రధాని అని గట్టిగా చెప్పుకోవడం జరిగింది. కానీ ఆమె తర్వాత రాజీవే అనుకున్నారు. రాజీవ్‌ అనంతరపు రోజుల్లో మొరార్జీ, విపి సింగ్‌, చంద్రశేఖర్‌, పివి నరసింహారావు, గుజ్రాల్‌, దేవెగౌడ, మన్‌మోహన్‌ సింగ్‌ - వీరెవరినీ ముందుగా ప్రధాని అభ్యర్థిగా చూపలేదు. బిజెపి మాత్రం వాజపేయినే చూపించుకుంది - 'ప్రధాన్‌మంత్రీ అగ్‌లీబారీ, అటల్‌ బిహారీ' అనే నినాదంతో ముందుకెళ్లింది. మోదీ జాతీయ నాయకుడిగా ఎదిగిన తర్వాత అతన్నే ప్రధాని అభ్యర్థిగా బిజెపి చూపసాగింది. అసెంబ్లీ ఎన్నికలలో కూడా మోదీ వర్సెస్‌ అదర్స్‌ అన్నట్లుగానే యుద్ధాలను మలచుకుంటూ వస్తోంది. అలాటప్పుడు 2019 పార్లమెంటరీ ఎన్నికలు మోదీ పేరు మీదుగానే నడపడం తథ్యం.

మోదీకి దీటైన నాయకుడు ఎవరు చెప్పండి చూతాం అనే సవాలు విసురుతూ, దీన్ని అమెరికా అధ్యక్ష తరహాలో వ్యక్తిగత పోరాటంగా మార్చాలని బిజెపి వ్యూహం. ఎందుకంటే మోదీతో సరితూగే యిమేజి ఉన్నవాళ్లు దేశం మొత్తంలో ఎవరూ లేరు. ఈ విషయం కాంగ్రెసుకూ తెలుసు. అందువలన అది వ్యవస్థాపరంగా ఎదుర్కుందామని చూస్తోంది. స్థానికంగా కాంగ్రెసు నాయకత్వాన్ని బలోపేతం చేస్తే అది ఎక్కడికెక్కడ బిజెపి వ్యతిరేక పక్షాలతో కలిసి బిజెపిని నిలవరించగలదు. మొత్తం మీద బిజెపికి వచ్చే సీట్ల సంఖ్యను తగ్గించగలదు. అది చేయడానికి చాలా ఓపిక కావాలి, నేర్పు కావాలి, సర్దుబాటు లక్షణం కావాలి. కానీ కాంగ్రెసుకు పెద్దన్న తరహా పెత్తందారీ బుద్ధులు ఓ పట్టాన పోవు. వాళ్లల్లో వాళ్లు కొట్టుకోవడం, ఏమైనా అంటే మీడియాకు వెళ్లి చెప్పడం మానరు. వాళ్లను అదిలించగలిగే సమర్థనాయకత్వం ఉండాలి.

సోనియాకు ఓపికలేదు, రాహుల్‌కు యింట్రస్టు లేదు. ఈ మధ్యే కాస్త కాస్త నేర్చుకుంటున్నాడు. అది సరిపోదు. మధ్యమధ్యలో బిజెపి ట్రాప్‌లో పడుతున్నాడు. వాళ్లు నీ గోత్రం ఏమిటని అడగడమేమిటి? ఇతను నాయనమ్మ తండ్రి గోత్రం చెప్పడమేమిటి నాన్సెన్స్‌! రాజీవ్‌ అమెరికా వెళ్లినపుడు తను పార్శీ అని చెప్పుకున్నాడట, తండ్రి పార్శీ కాబట్టి! మరి అతని అంత్యక్రియలేమో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగాయి. రాహుల్‌ తనను తాను హిందూగా భావించుకుంటే తప్పేమీ లేదు. అనేకమంది నికార్సయిన మ్లేచ్ఛులే హిందువులుగా మారుతున్నారు. వారందరూ ఏ గోత్రం పేరు చెప్పుకుంటారో మరి! ఎంతోకొంత హిందూ రక్తం కలిసిన రాహుల్‌ కూడా ఆ గోత్రమే చెప్పుకోవచ్చు.

సామూహిక పూజలు జరిగేటప్పుడు గోత్రం పేరు తెలియదని చెప్పినవారికి పూజారి ఈశ్వరుడి గోత్రమో, మరోటో చెప్పడం చూశాను. రాహుల్‌ అలాటిదేదో చెప్పుకోవచ్చు లేదా కరుణానిధి స్టయిల్లో జందెం లేని బ్రాహ్మణుణ్ని, శిలువ లేని క్రైస్తవుణ్ని... అంటూ చెప్పుకోవచ్చు. కానీ అతనిలో యిటీవల నేనూ హిందూత్వవాదినే అని చెప్పుకోవాలన్న తాపత్రయం కనబడుతోంది. దాని వలన ఉభయభ్రష్టత్వం తప్పదు. పైగా మోదీకి హిందూమతం గురించి ఏం తెలుసని ప్రశ్నించడమొకటి. అసలు రాహుల్‌కి క్రైస్తవం, జొరాస్ట్రియనిజం గురించి కూడా తెలుసో లేదో నాకు డౌటే. దేని గురించీ క్షుణ్ణంగా తెలిసినట్లు ఎప్పుడూ కనబడదు. ఎవరో స్క్రిప్టు రాసిస్తారు, అప్పజెపుతున్నాడు అనిపిస్తుంది.

తనను తాను ప్రధాని అభ్యర్థిగా చెప్పుకోవడం కూడా అనవసరమైన ప్రేలాపన. అంత ఉబలాటమే ఉంటే మన్‌మోహన్‌ కాబినెట్‌లో చేరి, ముఖ్యమైన మంత్రిత్వశాఖ తీసుకుని ఆయన దగ్గర తర్ఫీదై, తన సత్తా ఏమిటో చాటి వుండవచ్చు. అదే పని జగన్‌ కూడా చేసి వుండవచ్చు అని గతంలోనే రాశాను.  రోశయ్య కాబినెట్‌లో ఏ ఆర్థిక శాఖో నిర్వహించి వుంటే, డొక్కశుద్ధి ఉన్నవాడేమో అనే అనుమానం కలిగేది. కానీ మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి, నేను ఎకాయెకి ముఖ్యమంత్రి అయిపోతానని పట్టుబట్టడమే అతని కెరియర్‌ను నాశనం చేసింది. అలాగే రాహుల్‌ కూడా. మన్‌మోహన్‌ ఉన్నంతకాలం విదేశాల్లో షికార్లు కొట్టాడు తప్ప ఏ బాధ్యతా తీసుకోలేదు. దాంతో ఏదీ వంటబట్టలేదు.

ఇప్పటికే యిండియా చాలా కష్టాల్లో ఉంది. ఎప్పటికి తేరుకుంటుందో తెలియదు. అలాటి పరిస్థితుల్లో రాహుల్‌ వంటి యావరేజి స్టూడెంటుకి (ఈ మధ్య హోంవర్కు చేసుకుని వస్తున్నాడు కదాని మొద్దబ్బాయి అనడం దేనికని ఆలోచిస్తున్నాను) దేశాన్ని నడిపే బాధ్యత అప్పగించగలమా? రాజకీయ చతురత పుష్కలంగా ఉన్న సోనియాయే ప్రధాని బాధ్యత తీసుకోవడానికి జంకి, మన్‌మోహన్‌కు అప్పగించింది. ఆ చతురత కూడా లేని రాహుల్‌ యిప్పటికైనా యుపిఏ మళ్లీ అధికారంలోకి వస్తే ఫలానా మేధావికి ప్రధాని బాధ్యత అప్పగించి, నేను పార్టీ అధ్యక్షుడిగా ఆ పనులు చూసుకుంటాను అని ప్రకటిస్తే కాస్తయినా ఊరట లభిస్తుంది. నేనే ప్రధాని అవుతా అంటే మీకెందుకు లెండి అంత శ్రమ అనబుద్ధవుతుంది.

నిజానికి కాంగ్రెసుకు దేశమంతా అంతోయింతో ఓటుబ్యాంకు ఉంది. అనేకమంది బలమైన స్థానిక నాయకులున్నారు. సోనియా కుటుంబం పక్కకు తప్పుకుని పార్టీలో ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపి మంచి నాయకులను ఎంపిక చేస్తే దానికి భవిష్యత్తు ఉంటుంది. కొడిగడుతున్న సోనియా, వీధిబడిలోనే ఉన్న రాహుల్‌, అవినీతిమింగలంలా నోరు తెరుచుకుని ఉన్న వాధ్రా కళ్లముందు కదలాడుతుండగా కాంగ్రెసు నుంచి ప్రధాని అంటే అమ్మబాబోయ్‌ అనిపిస్తుంది. ఇది తెలిసే బిజెపి రాహుల్‌ బూచిని చూపించి బతికేస్తోంది. మోదీ పాలనలో లోపాలు అని ఎత్తి చూపితే 'అయితే ప్రత్యామ్నాయంగా రాహుల్‌ కావాలా? అఘోరించు' అంటోంది. బిజెపికి ప్రాంతీయ పార్టీలతో కూడిన కాంగ్రెసు ప్రత్యామ్నాయం కాగలదేమో కానీ మోదీకి రాహుల్‌ యీ దశాబ్దంలో ప్రత్యామ్నాయం కాలేడు.

కాంగ్రెసు అది గమనించి ఫోకస్‌ను వ్యక్తుల మీద నుంచి తప్పించి పార్టీ మీదకు మరలించి, స్థానిక నాయకులకు ప్రాధాన్యత యిచ్చినప్పుడే బిజెపికి సీట్లు తగ్గుతాయి. అంతేకాదు, బిజెపికి ఉన్న కిల్లర్‌ యిన్‌స్టిక్‌న్ట్‌ కాంగ్రెసుకు లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా కాడి పారేసే రకం. నిన్న గుజరాత్‌, ఇవాళ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో చూడండి, మూడు టెర్మ్‌లు అయిపోయింది కాబట్టి యాంటీ-యిన్‌కంబెన్సీ తారాస్థాయిలో ఉంటుంది అనుకుని బిజెపి వూరుకోలేదు. కడదాకా పోరాడుతూనే ఉండేది. అదే కాంగ్రెసు అయితే ఎలాగూ రాము అనుకుని నాయకులందరూ బద్ధకించేవారు. పైగా తాము శ్రమ పడినా అంతిమంగా వేరేవాడు ముఖ్యమంత్రి అవుతాడేమో, ఆ కాడికి మనమెందుకు ఒళ్లు విరుచుకోవడం అనుకుంటారు.

ఈ ధోరణితోనే అది అనేక అసెంబ్లీలను పోగొట్టుకుంది. పార్లమెంటు నాటికి స్వభావం మార్చుకుంటుంది అనుకోవడానికి లేదు. అందువలన బిజెపికి ఆటోమెటిక్‌గా సీట్లు తగ్గిపోతాయని చెప్పలేం, దాని ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా అర్థం చేసుకుని, ఎట్టి పరిస్థితుల్లో వీళ్లని మాత్రం గెలిపించకూడదు అని గట్టిగా అనుకుంటే తప్ప!

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2018)
mbsprasad@gmail.com

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments