మాజీ మంత్రి నారాయణ మిస్సింగ్

ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అంతా తానే అన్నట్లు వ్యవహరించారు మాజీమంత్రి నారాయణ. ఫలితాలొచ్చిన తర్వాత అసలు కంటికి కనిపించకుండా మాయమైపోయారు. తాజాగా జరిగిన నెల్లూరుజిల్లా పార్టీ సమావేశానికి ఓడిపోయిన నేతలంతా వచ్చారు ఒక్క నారాయణ తప్ప. అక్కడే నారాయణ గురించి చర్చ మొదలైంది.

ఎవ్వరికీ ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే విషయంపై హాట్ డిస్కషన్ జరిగింది. చివరిగా చంద్రాబాబుకి కూడా నారాయణ అందుబాటులో లేరని నిర్థారించుకుని, అధికారంలో ఉన్నన్నాళ్లు మాపై పెత్తనం చలాయించి, ఇప్పుడు ఏమీ పట్టనట్టు మాయమైపోతారా అంటూ విమర్శిస్తున్నారు జిల్లా నేతలు.

ఓటమి తర్వాత మాజీమంత్రి నారాయణ పూర్తిగా టీడీపీ నేతల్ని దూరంపెట్టారు. తన పక్కనే ఉంటూ తనకిందే గోతులు తీశారన్న అనుమానం ఓవైపు, మంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన భారం మరోవైపు.. నారాయణకు దిక్కుతోచకుండా చేశాయి. దీంతో ఆయన దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకుంటారని అనుకున్నారంతా. అయితే పదవిలో ఉండగా చేసిన అక్రమాలు ఆయన్ని వదిలేలా లేవు. తన పేరు అడ్డం పెట్టుకుని చంద్రబాబు, లోకేష్ సాగించిన అవినీతి కూడా తనకే అంటుకుందని నారాయణకు అర్థమైంది.

తొలుత బీజేపీ వైపు చూసినా, చివరకు వైసీపీలోకే వెళ్లాలని ఆయన అనుకుంటున్నట్టు సన్నిహితుల సమాచారం. విద్యాసంస్థలున్నాయి కాబట్టి.. స్మూత్ గా ఈ వ్యవహారాన్ని డీల్ చేయాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఎమ్మెల్యే పదవి కూడా లేదు కాబట్టి.. జగన్ కండిషన్ ప్రకారం రాజీనామాల్లాంటి ప్రహసనాలేవీ లేకుండా నేరుగా గోడ దూకేయొచ్చు.

అయితే నారాయణ ప్రయత్నాలకు మంత్రి అనిల్ మోకాలడ్డుతున్నట్టు తెలుస్తోంది. ఫలితాల తర్వాత కనీసం టీడీపీ కార్పొరేటర్లని కూడా తన దగ్గరకు రాకుండా కట్టడి చేసిన అనిల్, ఇప్పుడు నారాయణ చేరికను కూడా అలాగే అడ్డుకుంటున్నారు. తనపై పోటీ చేశారన్న విషయం ఒక్కటే కాదు, నారాయణను పార్టీలో చేర్చుకుంటే స్థానికంగా ఉన్న కేడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు మంత్రి అనిల్.

ఇప్పటివరకైతే నారాయణ తెరవెనక ఉండే మంత్రాంగం నడుపుతున్నారు. అస్సలు తన ఉనికి ఎక్కడుందో ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అన్ని లెక్కలు కుదిరితే.. వైసీపీ కండువాతో నేరుగా మీడియా ముందుకొచ్చేస్తారు. అనీల్ అడ్డుకుంటున్న సంగతి పక్కనపెడితే, స్వయంగా జగన్ కు కూడా నారాయణను చేర్చుకోవడం ఇష్టంలేనట్టుగా తెలుస్తోంది.

తన ప్రజాసంకల్పయాత్రలో నారాయణ విద్యాసంస్థలపై విమర్శలు, ఆరోపణలు గుప్పించిన జగన్, ఇప్పుడు అదే విద్యాసంస్థల చైర్మన్ ను తన పార్టీలోకి ఆహ్వానిస్తారని ఎవరూ అనుకోరు. సో.. నారాయణ ఇంకొన్నాళ్లు ఇలా అజ్ఞాతంలో గడపాల్సిందే.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

Show comments