ఎర్రబెల్లి ఉద్వేగం: 'విధేయత'కి దక్కిన గౌరవం.!

ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత. పార్టీకి తెలంగాణ ఇన్‌ఛార్జి కూడా. చంద్రబాబు అంటే దేవుడని నినదించిన వ్యక్తి. కానీ, ఏం లాభం.? టీడీపీలో వుంటే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని భావించారు.. టైమ్‌ చూసి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి దూకేశారు. తనతోపాటు పలువురు టీడీపీ ముఖ్యనేతల్ని టీఆర్‌ఎస్‌లోకి తీసుకెళ్ళిన ఎర్రబెల్లి, అందుకుగాను అప్పట్లోనే మంత్రిపదవి దక్కించుకోవాల్సి వుంది. కానీ, కుదరలేదప్పుడు.

ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 'దయ'తలిచారు ఎర్రబెల్లి దయాకర్‌రావు మీద. తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీయడంలో తన వ్యూహాలకు అనుగుణంగా నడుచుకున్నందున ఎర్రబెల్లి దయాకర్‌రావుకి 'విధేయత' కోటాలో ఇన్నాళ్ళకు మంత్రిపదవి ఇచ్చారు కేసీఆర్‌. మంత్రిపదవి కోసం తానెంత ఆశపడిందీ, ఎర్రబెల్లి తన మాటలతోనే పరోక్షంగా చెప్పేశారు.

ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ హయాంలో లక్ష్మీపార్వతి అడ్డుపడ్డారనీ.. ఆ తర్వాత చంద్రబాబు నమ్మించి మోసం చేశారనీ ఎర్రబెల్లి వాపోయారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ సంగతి పక్కనపెడితే, చంద్రబాబు మాత్రం ఎర్రబెల్లిని ఓ రేంజ్‌లో వాడుకుని వదిలేశారన్నది నిర్వివాదాంశం. ఎర్రబెల్లితో నాగం జనార్ధన్‌రెడ్డికి గొడవపెట్టి, ఆ తర్వాత ఎర్రబెల్లి మీదకు రేవంత్‌ రెడ్డిని ఉసిగొలిపి.. చంద్రబాబు చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. అందుకాయన 'ఫలితం' అనుభవించారనుకోండి.. అది వేరే విషయం.

కేసీఆర్‌, మాట నిలబెట్టుకున్నారనీ.. తన మీద కేసీఆర్‌ వుంచిన నమ్మకాన్ని వమ్ముచేయబోననీ.. మంత్రిగా కష్టపడి పనిచేస్తాననీ ఎర్రబెల్లి దయాకర్‌రావు అంటున్నారు. విధేయత, సామాజికవర్గ సమీకరణాలు సహా అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఎర్రబెల్లికి మంత్రిపదవి కట్టబెట్టడం ద్వారా పార్టీ శ్రేణులకి, ఇతర పార్టీల్లోంచి టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నవారికీ స్పష్టమైన సంకేతాలు పంపారని అనుకోవచ్చేమో.!

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

Show comments