అనుకున్నదే! కానీ, త్వరగా ముగించారు..!!

దిశ కేసు నిందితులు ఎన్ కౌంటర్ అయ్యారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో.. పోలీసులు వారిని కాల్చి చంపినట్లు వార్తలు వచ్చాయి. ఇది అనూహ్యమైన సంగతి ఎంతమాత్రమూ కాదు!

అత్యంత పాశవికమైన రీతిలో నేరాలకు పాల్పడిన వారి పట్ల గతంలోనూ కొన్ని సందర్భాల్లో పోలీసులు ఇలాగే వ్యవహరించారు. దిశ హత్య కేసులోనూ నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో... పోలీసులు ఆ లాంఛనాన్ని పూర్తి చేశారు. కానీ.. ఆ పనిని చాలా త్వరగానే ముగించారు.

అమ్మాయిలపై అత్యాచారాలు జరగడం ఇటీవలి కాలంలో శృతిమించుతోంది. పాత రోజుల్లో లాగా కాకుండా... తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకుంటూ.. విద్యా ఉద్యోగావకాశాలను మహిళలు కూడా గరిష్టంగా దక్కించుకుంటున్న ఈ రోజుల్లో.. వారి మీద అత్యాచారాలు కూడా పెరుగుతూన్నాయి.

ప్రేమ పేరిట అమ్మాయిలమీద దుర్మార్గానికి తెగబడే వారు కొందరైతే... ఒంటరిగా, దుర్బలమైన, నిస్సహాయమైన పరిస్థితుల్లో అమ్మాయి కనిపిస్తే చాలు.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టే వారు మరికొందరు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడేవారు చట్టం పట్ల భయం కూడా లేకుండా చెలరేగుతుండడం గమనార్హం.

ఢిల్లీలో నిర్భయ వ్యవహారం దేశాన్ని కుదిపేసిన తర్వాత.. కొత్త చట్టాలు వచ్చాయి. నిర్భయ చట్టం వచ్చింది. కఠినమైన శిక్షలు అందులో పెట్టారు. అయినా సరే.. ఆ చట్టం తీర్పులో రూపంలో రావడానికి జరిగే జాప్యం, విచారణల ప్రహసనం ఇవన్నీ.. దుర్మార్గాలకు పాల్పడేవారికి భయం లేకుండా చేసేస్తున్నాయి. దిశ హత్య కేసు నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేయాలని, ఉరి తీయాలని అనేకవర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. పోలీసులు మాత్రం మౌనంగా తమ పని తాము చేసుకుపోయారు.

క్లూస్ టీం సహాయంతో పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరించారు. లారీపై ఉన్న రక్తపు మరకలు, నిందితుల వద్ద సెల్ ఫోను, తగలబెట్టిన చోట ఆమె దుస్తుల ఆనవాళ్లు అన్నీ సేకరించారు. నిందితులు తాము చేసిన నేరం ఒప్పుకున్నప్పటికీ.. పోలీసులు ఇంత పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నప్పుడే కొందరికి ఎన్ కౌంటర్ అనుమానం కలిగింది. ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత.. నిందితులతో పోలీసులు బలవంతంగా ఒప్పించారని.. వారికి సంబంధం లేదని ఎవరూ మాటమాత్రంగానైనా అనే అవకాశం లేకుండా... ఆధారాలను సంపాదించి.. ప్రజలకు తెలియజెప్పారు.

దోషులను అంతమొందించినా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత రాకుండా చేశారు. ఆ వెంటనే ఎన్‌కౌంటర్ చేసినట్లుగా తెలుస్తోంది. నిందితులు పారిపోయే ప్రయత్నంలో ఉండగా.. ఎన్ కౌంటర్ చేసినట్లు అధికారులు చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఎన్ కౌంటర్లు అమ్మాయిలపై అత్యాచారాలకు ఒడిగట్టే వారికి వెన్నులో భయం పుట్టిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Show comments