ఈ 'పెద్దోళ్లకే' బయోపిక్ పట్టలేదు

ఎన్టీఆర్.. టాలీవుడ్ రెండు కళ్లలో ఒకరు. తెలుగుజాతికి గర్వకారణం. తెలుగుజాతి వెలుగు అని కీర్తింపబడే నాయకుడు. అలాంటి కథానాయకుడి బయోపిక్ వచ్చింది. దాదాపు టాలీవుడ్ లోని చాలామంది ఈ సినిమాలో తళక్కున మెరిసారు. మహానటి సావిత్రి బయోపిక్ వచ్చిన తరువాత వచ్చే ఎన్టీఆర్ బయోపిక్ మీద చాలామంది చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇది ఓ రేంజ్ లో వుంటుందనుకున్నారు.

కానీ దర్శకుడు క్రిష్ మాత్రం పక్కాగా మహానటిని యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయారు. పైగా వీలయినంత తక్కువలో చుట్టేసారని విమర్శలు వినిపించాయి. ఏ తెలుగుజాతి.. తెలుగుజాతి అని ఊదరగొట్టారో? ఆ తెలుగు జాతి ఆ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. సింపుల్ గా తీసి పక్కన పెట్టింది.

తెలుగుజాతి సంగతి పక్కన పెడితే, ఇండస్ట్రీలో పెద్దలు కూడా ఈ సినిమాను అంతగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. మహేష్ బాబు, కృష్ణ, మంచు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ సినిమా గురించి కాస్త ప్రశంసించారు.

తన తాత సినిమా, తన తండ్రి పాత్రను తన సోదరుడు కళ్యాణ్ రామ్ పోషించిన సినిమా, తన బాబాయ్ కీలకపాత్రలో నటించిన సినిమా అని తెలిసి కూడా జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఓ ట్వీట్ లేదు. మాట లేదు. సినిమా చూసాననో, చూస్తాననో, బాగుందనో, మరోటో.. ఏదీ లేదు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ తల్లికి అస్వస్థతగా వుందని, ఆమెను ఆసుపత్రిలో వుంచారని, అందుకే ఆయన సినిమా గురించి ఏమాటా చెప్పలేదని ఓ కారణం అయితే వినిపిస్తోంది. అయితే సంక్రాంతి శుభాకాంక్షలు మాత్రం ఎన్టీఆర్ ట్విట్టర్ లో వుంచారు.

ఇక హీరో నాగార్జున వున్నారు. ఆయన మేనల్లుడు సుమంత్ నే ఈ బయోపిక్ లో తన తండ్రి ఏఎన్నార్ పాత్రను పోషించారు. అయినా నాగ్ ఈ సినిమా గురించి కనీసం ఎక్కడా ప్రస్తావించలేదు. దర్శకుడు రాజమౌళి సంగతి కూడా డిటో. ఆయన సోదరుడు కీరవాణినే బయోపిక్ కు సంగీత దర్శకుడు.

మామూలుగా అయితే రాజమౌళి తన స్నేహితుడు సాయి కొర్రపాటి సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు. ఆ విధంగా కానీ, ఎన్టీఆర్ బయోపిక్ అని కానీ ఈ సినిమా గురించి ఓ ట్వీట్ లేదు. గతంలో శాతకర్ణి సినిమా విషయంలో క్రిష్ కు లేఖ రాయడం వంటి వ్యవహారాలు కొన్ని జరిగాయి. మరి ఈసారి ఏమయిందో తెలియదు.

ఇంకా చాలామంది ఇండస్ట్రీ జనాలు వున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పెద్ద పెద్ద దర్శకులు, పైగా సోషల్ నెట్ వర్క్ లో యాక్టివ్ గా వుండేవారు బోలెడు మంది వున్నారు. కానీ ఎవరికీ బయోపిక్ గురించి పట్టలేదు. మరి ఎన్టీఆర్ పుట్టి, ఎదిగి, రాజకీయంలోకి రావడానికి పునాది వేసిన టాలీవుడ్ లో జనాలకే ఆ సినిమా అంతగా పట్టకపోతే, మామూలు జనాలకు ఏం పడుతుంది?

వాళ్లు చూడలేదు, ఆదరించలేదు అని అనుకోవడం అనవసరమేమో?

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

బాబు, జగన్ తేల్చాలేకపోతున్నారా..!

Show comments