ఈ మాటతో ఓట్లు కొల్లగట్టమనే భ్రమ

ఒక్క బిస్కెట్ వేస్తే చాలు... పనైపోతుందని అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. సినిమా, రాజకీయాలు, వ్యాపారం.. అంతెందుకు వ్యక్తిగత అనుబంధాల విషయంలో కూడా ఒక్క బిస్కట్ వేస్తే చాలు పనైపోతుందని అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. ఇప్పుడు రాహుల్ కూడా అదే జాబితాలో చేరినట్లుగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ‘ప్రత్యేకహోదా’ అనే ఒకే ఒక బిస్కట్ వేస్తే చాలు.. ఇక తమ పార్టీకి అధికారం కట్టబెట్టేస్తారని ఆయన ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేకహోదాను రాజ్యసభలో ప్రకటించినప్పటికీ.. దాన్ని చట్టంలో పొందుపరచకుండా.. ఇవాళ జరుగుతున్న పోరాటాలకు ఒక చట్టబద్ధ పోరాటం అనే విలువ లేకుండా చేసిన మోసపూరిత పార్టీ కాంగ్రెసే. వారి పుణ్యమే ఇవాళ ఇన్ని రాద్ధాంతాలు ప్రత్యేకహోదా కోసం చేయాల్సి వస్తోంది.

తాము చేసిన తప్పులను ప్రజలెవ్వరూ గుర్తించరులే అని అనుకుంటున్నట్లుగా.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ తెరమీదకు వచ్చి.. సభలో చెప్పిన మాటలకు చట్టబద్ధత ఉన్నట్లే.. వాటన్నింటినీ అమలు చేసి తీరాల్సిందే... ఇప్పుడు మమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తే తప్పక హోదా ఇచ్చేస్తాం అని రాహుల్ అనడం చాలా వంచనా పూర్వకంగా కనిపిస్తోంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ సర్వభ్రష్టత్వం చెందిపోయింది. ఇప్పట్లో తిరిగి కోలుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అలాంటప్పుడు.. పార్టీకి కొత్త జవసత్వాలు కూర్చడమే తన లక్ష్యం అన్నట్లుగా రాహుల్ కర్నూలులో ఓ సభ పెట్టుకున్నారు. మమ్మల్ని గెలిపించండి.. ప్రత్యేకహోదా ఇచ్చేస్తాం అని అవాకులు చెవాకులు పేర్చి చెప్పేశారు.

కానీ ప్రజలు రాహుల్ ను ఎందుకు నమ్మాలి? తమ పార్టీ ప్రధాని సభలో చెప్పిన మాటకు అంత విలువ ఉందని వారు అనుకుంటే.. గత నాలుగున్నరేళ్లుగా వాళ్లు ఏం చేస్తున్నారు? ఇన్నాళ్లూ మౌనంగా ఉండి.. ఇప్పుడు ఎన్నికల్లో గెలిపిస్తే ఇస్తాం అంటూ బేరం పెడుతున్నారంటే వారు ఆవిధంగా ఎవరిని మోసం చేయదలచుకుంటున్నారు అని తెలుగు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

Show comments