అబ్బే...మాగుంట‌ విచార‌ణ‌పై వైసీపీలో హ‌డావుడి నిల్‌!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో మంగ‌ళ‌వారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి ఈడీ విచార‌ణ ఎదుర్కోనున్నారు. సొంత పార్టీకి చెందిన ఎంపీ ఈడీ విచార‌ణ‌పై వైసీపీలో ఎలాంటి హ‌డావుడి క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే మాగుంట కుమారుడు రాఘ‌వ‌రెడ్డి ఇదే కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఒంగోలు ఎంపీ వంతు వ‌చ్చింది. మ‌రోవైపు తెలంగాణ‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఈడీ విచార‌ణ ఎదుర్కోవ‌డంపై ర‌చ్చ సాగుతోంది.

ఇవాళ మూడో సారి ఈడీ విచార‌ణ‌కు క‌విత హాజ‌రుకానున్నారు. ఈడీ విచారణ‌పై తెలంగాణ అధికార పార్టీ భ‌గ్గుమంటోంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ రాజ‌కీయ వేధింపుల్లో భాగంగానే సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌ను ఇరికిస్తున్న‌ట్టు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. విచార‌ణ‌పై భాగంగా ఈడీపైనే క‌విత ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్టు బీఆర్ఎస్ ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో త‌మ పార్టీ ఎంపీని ఈడీ విచార‌ణ‌కు పిల‌వ‌డంపై వైసీపీ స్టాండ్ ఏంటో తెలియ‌డం లేదు. ఇటీవ‌ల మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి విచార‌ణ ఎదుర్కొంటున్న మాగుంట ఇంటికెళ్లి ప‌రామ‌ర్శిం చారు. మాగుంట కుటుంబానికి వైసీపీ అండ‌గా వుంటుంద‌ని ప్ర‌క‌టించారు. కేవ‌లం క‌విత కోసం తమ ఎంపీ కుటుంబాన్ని కేసులో ఇరికించార‌ని ఆయ‌న ప‌రోక్షంగా ఆరోపించారు. అంత‌కు మించి ఏ ఒక్క‌రూ మాగుంట విష‌య‌మై మాట్లాడ‌లేదు. 

ఇదే వివేకా హ‌త్య కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డికి మాత్రం వైసీపీ గ‌ట్టి మ‌ద్ద‌తు ఇస్తోంది. అవినాష్‌రెడ్డిని విచారించే సంద‌ర్భంలో హైద‌రాబాద్‌లోని సీబీఐ కార్యాలయం వ‌ద్ద‌కు భారీగా వైసీపీ శ్రేణులు త‌ర‌లివెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 18న హాజ‌రు కావాల్సిన ఒంగోలు ఎంపీ మాగుంట‌, ఆ రోజు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈడీ విచార‌ణ‌కు వెళ్ల‌లేదు. ఈడీ సూచ‌న‌తో మ‌ళ్లీ ఇవాళ వెళుతున్నారు. మ‌రి ఆయ‌న్ను అరెస్ట్ చేస్తారా? లేక విచార‌ణ‌తో స‌రిపెడ‌తారా? అనేది తెలియాల్సి వుంది.

Show comments