ఈ తీర్పు ఎటువైపు?

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా?
తెలంగాణ ఎన్నికల్లో కీలక అంకం ముగిసింది. పోలింగ్‌ తంతు పూర్తిఅయ్యింది. ఎవరు గెలుస్తారు? అనేది ప్రశ్న. అయితే అది మాత్రమేకాదు.. ఎవరు గెలిస్తే.. భవిష్యత్‌ రాజకీయ పరిణామాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది అంతకన్నా ఆసక్తిదాయకమైన ప్రశ్న! తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలనే వచ్చే సంవత్సరం జరగబోయే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా పేర్కొంటూ వచ్చింది మీడియా. అయితే మీడియా ప్రధానంగా రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ల ఫలితాలనే సెమీస్‌గా పరిగణించింది. ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌లు అమీతుమీ తలపడటం.. ఆ రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా నిలవడంతో.. ఆ రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీల్లో ఏది జెండా పాతితే అదే సెమిస్‌లో విజేత అన్నట్టుగా జాతీయ మీడియా పేర్కొంటూ వచ్చింది.

ఒకవేళ ఆ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌పార్టీ జెండాపాతితే అప్పుడు బీజేపీకి అది గట్టిపోటీ ఇచ్చినట్టు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో గట్టి ప్రత్యర్థి రెడీగా ఉన్నట్టే. అలాకాకుండా కేవలం రాజస్థాన్‌లో మాత్రమే కాంగ్రెస్‌ గెలిచినా.. లేక రాజస్థాన్‌లోనూ ఆ పార్టీ ఓడినా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తిరుగులేనట్టే! కాంగ్రెస్‌పార్టీ వచ్చేసారి కొద్దోగొప్పో సీట్లు పెంచుకోవచ్చు కానీ.. మళ్లీ వచ్చేది మోడీ రాజ్యమే అని ఆ మూడు రాష్ట్రాల ఫలితాలను బట్టి చెప్పవచ్చు. జాతీయస్థాయి పరిశీలకుల దృష్టి అంతా అలా ఆ మూడు రాష్ట్రాల మీదే ఉంది!

తెలంగాణ ఎన్నికల ప్రభావం మాత్రం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఏమీఉండదు అని మొదట అంతా అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్‌ ప్రధాన పార్టీనే కానీ.. అది టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇస్తుందని ఎవరూ అనుకోలేదు, అలాగే టీఆర్‌ఎస్‌, బీజేపీలూ రేపు పొత్తుతో వెళ్లే అవకాశాలు లేవు. ఎన్నికల తర్వాతి సంగతి ఎలా ఉన్నా.. రేపటి లోక్‌సభ ఎన్నికల ముందు కూడా పొత్తు ఉండదనే చెప్పాలి. కాబట్టి తెలంగాణ ఎన్నికల ఫలితం తెలంగాణ ఎన్నికలకే పరిమితం అవుతుందని మొదట అంతా అనుకున్నారు.

అయితే.. ఆ తర్వాత లెక్కలు మారాయి, సమీకరణాలు వేరయ్యాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపేశాడో, మహాకూటమి అంటూ తెలంగాణలోకి ఎంటరయ్యాడో ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల సమీకరణాలు మారాయి, ఈ ఎన్నికల ప్రభావమూ పెరిగింది! దానికి అనేక కారణాలు. కాంగ్రెస్‌పార్టీ, చంద్రబాబులు చేతులు కలపడం అనేది.. తెలంగాణలో వీళ్లను గెలిపిస్తుందా, ఓడిస్తుందా దానికి ఇంకా రకరకాల సమాధానాలు, విశ్లేషణలు వినిపిస్తాయి.

చంద్రబాబుపై వ్యతిరేకతను కలిగి, కాంగ్రెస్‌ మీద కొద్దోగొప్పో అభిమానం ఉన్నవాళ్లు.. వీరి పొత్తు లేకపోయుంటే కాంగ్రెస్‌కు తిరుగు ఉండేది కాదని అంటారు. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో పొత్తే ప్రధానం అనుకున్నాడు. సొంతంగా వెళితే తెలుగుదేశం చిత్తు అవుతుందని బాబుకు స్పష్టంగా అర్థం అయ్యింది. అందుకే ఎవరు ఏమైనా అనుకోని పొత్తుకు ఫిక్సయ్యాడు.

తెలంగాణలో కూటమి గెలిస్తే..?
గెలుస్తుందా లేదా అనేదికాదు. గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే.. చంద్రబాబు నాయుడును పట్టడానికి ఉండదు. తెలంగాణలో చంద్రబాబును చూసే కూటమిని గెలిపించారు అని ఏపీ తెలుగుదేశం పార్టీ ఒకరేంజ్‌లో ప్రచారం చేస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా అదేమాటే చెప్పుకుంటాడు. తననుచూసే తెలంగాణ ప్రజలు మహాకూటమిని గెలిపించారని బాబు చెప్పుకుంటాడు. అదేనిజం అని నిరూపించడానికి చంద్రబాబు అనుకూల మీడియా తన వాయిద్యాలన్నీ ఉపయోగిస్తుంది. ఓవరాల్‌గా పన్నెండు స్థానాల్లో పోటీచేసిన పార్టీ తెలుగుదేశం. ఆ పన్నెండు చోట్లలో సగంచోట్ల చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడు.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌లో పెరిగిన నియంతృ త్వ పోకడలపై కోపం వచ్చి కూటమికి ఓటు వేసి ఉన్నా, కాంగ్రెస్‌పార్టీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచింది. అప్పుడు ఛాన్స్‌ ఇవ్వలేదు, ఇప్పుడు ఇద్ధాం అని అనుకుని హస్తం గుర్తుకు ఓటు వేసి ఉన్నా.. మహాకూటమి తరఫున పోటీచేసిన తెలుగుదేశం గెలిచేది మూడు నాలుగు స్థానాల్లో అయినా.. కూటమికంటూ అధికారం దక్కితే అది తన క్రెడిటే అని చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్పుకుంటాడు. అదే నిజం అనిపిస్తారు మీడియాతో కలిసి!

ఏపీలోనూ అదే ఢంకా కొడతారు!
తెలంగాణలో కూటమి నెగ్గితే.. ఏపీలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ల పొత్తు ఖరారు అయినట్టే. కాంగ్రెస్‌ పార్టీకి పదిపదిహేను సీట్లు ఇచ్చి పొత్తుకు ఓకే చెప్పించేస్తారు. తెలంగాణలో విజయాన్ని చూపుతూ ఏపీని ప్రభావితం చేసేందుకు చంద్రబాబు నాయుడు వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తెలంగాణ ప్రజలే తనను ఎన్నుకున్నారని.. ఇక ఏపీ ప్రజలు ఎన్నుకుని తీరాలని చంద్రబాబు నాయుడు వాళ్ల బ్రెయిన్‌ వాష్‌ మొదలుపెడతాడు. ఎలాగూ మీడియా సహకారం ఉండనే ఉంటుంది! ఇదీ తెలంగాణలో కూటమి విజయం సాధించినప్పుడు ఉండే పరిస్థితి. ఇదీ చంద్రబాబు నాయుడు వినిపించే వాదన!

మహాకూటమి ఓడితే!
కూటమి ఓడితే తెలుగుదేశం వర్గాలు చెప్పే మొదటిమాట.. కాంగ్రెస్‌తో జతకట్టడం తప్పు అయిపోయింది అని. ఓటమిలో చంద్రబాబు నాయుడుకు ఎలాంటి బాధ్యతాలేదు అని.. చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిందే అరడజను నియోజకవర్గాల్లో అని.. ఇలా రకరకాల మాటలుచెప్పి కవర్‌ చేస్తారు. కాంగ్రెస్‌ నేతలు పొరపాట్లు చేశారని, ఎవరెవరు ఓడిపోతారో చంద్రబాబు ముందే చెప్పారని, అయినా కాంగ్రెస్‌వాళ్లు అభ్యర్థులను మార్చలేదని.. పోల్‌ మేనేజ్‌మెంట్‌ సరిగాలేదని, సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు సరిగాలేదని.. ఇలా ఓవరాల్‌గా ఓటమి నెపాన్ని కాంగ్రెస్‌పార్టీ మీద నెట్టేసి.. తెలుగుదేశం పార్టీ కవర్‌ చేసుకుంటుంది.

తెలంగాణలో ఎన్నికలే జరగలేదు, ఎన్నికలు జరిగినా తెలుగుదేశం అందులో పోటీ చేయలేదు, పోటీచేసినా చంద్రబాబు అక్కడ ప్రచారం చేయలేదు.. అన్నట్టుగా తెలుగుదేశం నేతలు మాట్లాడతారు. తెలంగాణలో ఓడితే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ప్రశ్నార్థకమే! పొత్తు అవకాశాలు చాలావరకూ తగ్గిపోతాయి. ఎలాగోలా మళ్లీ పవన్‌ కల్యాణ్‌ను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం కావొచ్చు. అడిగినన్ని సీట్లు ఇస్తామని, భారీ ప్యాకేజీతో పవన్‌ కల్యాణ్‌ను మళ్లీ తనవైపుకు తిప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలను ముమ్మరం చేయడం ఖాయం!

నిజంగానే తెలంగాణ ప్రభావం ఏపీపై ఉంటుందా..?
ఒక్కమాటలో చెప్పాలంటే ఉండదు. ఒకవేళ తెలంగాణలో కూటమి గెలిచినా ఆ ప్రభావం ఏపీ మీద ఉండదు. అలాగని మహాకూటమి తెలంగాణలో ఓడిపోయినా ఏపీపై ఆ ప్రభావం ఉండదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి రేపటి లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో నిర్ధారించడమే కష్టం. కేవలం తెలంగాణ అనేకాదు.. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గడ్‌లలో వచ్చే ఫలితాలను బట్టి కూడా రేపటి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఎవరికి ఎన్ని దక్కుతాయనేది చెప్పలేం.

ఆ రాష్ట్రాల్లోని ప్రజలు ముఖ్యమంత్రి ఎవరు కావాలనేదాన్ని బట్టి ఇప్పుడు ఓటేశారు, ప్రధానమంత్రి ఎవరు కావాలి అనేదాని కోసం వచ్చే ఏడాది ఓటేస్తారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేవలం సూఛాయగా మాత్రమే తీసుకోవాలి. అలాంటిది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ ఎన్నికలను ప్రభావితం చేస్తాయనేది భ్రమ మాత్రమే.

గమనించాల్సిన పాయింట్లు కొన్ని ఉన్నాయ్‌ సుమా!
-తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా కనీసం మూడునెలల వ్యవధి ఉంది. గరిష్టంగా ఐదునెలలు కూడా పట్టవచ్చు. ప్రజలు డైవర్ట్‌ కావడానికి ఎక్కువ సయమం పట్టదు. వార్తల్లో బాగా నానిన ఏ విషయాన్ని అయినా కూడా ప్రజలు అతి త్వరలోనే మర్చిపోతారు. కాబట్టి.. తెలంగాణ ఎవరు ఎలాంటి ల్యాండ్‌స్లైడ్‌ విక్టరీ సాధించినా దాని ప్రభావం మూడు నాలుగు నెలలు ఉండి, మరో రాష్ట్రంలో ఎన్నికలను ప్రభావితం చేసేంత సీన్‌ ఉండదు.

-అయితే తెలంగాణలో ఓడితే చంద్రబాబు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఇప్పటివరకూ ఆయన వేసిన లెక్కలు రాంగ్‌ అని నిరూపితం అవుతుంది. కాంగ్రెస్‌తో చేతులు కలపడం, రేపు కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కూటమి అధికారంలోకి వస్తుంది అని ఇక ప్రజలను నమ్మించడం కష్టం అవుతుంది. ఒకవేళ రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లలో కూడా కాంగ్రెస్‌ అనుకూల ఫలితాలు వస్తే చంద్రబాబుకు కొంత ఊరట దక్కవచ్చు.

-తెలంగాణలో కూటమి గెలిస్తే.. అది చంద్రబాబు విజయం అని తెలుగుదేశం ఏ విధంగా ప్రచారం చేసుకుంటుందో, తెలంగాణలో కూటమి ఓడితే.. బాబును ప్రజలు తిరస్కరించేశారు అని వైరిపక్షాలు  కూడా గట్టిగా ప్రచారం చేస్తాయి.

-తెలంగాణలో కూటమి గెలిస్తే.. పవన్‌ కల్యాణ్‌ నెమ్మదిగా చంద్రబాబు వద్దకు చేరిపోవచ్చు. వీలైనన్ని సీట్లను తీసుకుని పొత్తుకు రెడీ అయిపోవచ్చు. అదేకూటమి ఓడితే పవన్‌ కల్యాణ్‌ అవసరం చంద్రబాబుకు పెరుగుతుంది. అప్పుడు తన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పవన్‌ ఎక్కువ సీట్లకు బేరం పెట్టవచ్చు.

-తెలంగాణలో కేసీఆర్‌ ఓడితే చంద్రబాబు హ్యాపీ అయితే కావొచ్చు. కానీ... అది మరోరకంగా బాబుకు డేంజర్‌ బెల్‌. పాలన విషయంలో చంద్రబాబు కన్నా కేసీఆర్‌ చాలా ముందున్నాడు. సంక్షేమ పథకాలను అమలు పరచడంలో అయినా, మిగులు బడ్జెట్‌తో వ్యవహారాలు నెరిపి ఉండటం, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, రైతుబంధు పథకం.. వంటివన్నీ అమలు చేసిన కేసీఆర్‌ విజయం పట్ల చాలా విశ్వాసంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు. ఈ పథకాల లబ్ధిదారులు కూడా తెలంగాణలో ఉన్నారనేది నిజం. మరి అంత జేసినా కేసీఆర్‌ ఓడితే, ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏమిటి?

-రైతుల రుణమాఫీ సరిగా చేయలేదు, డ్వాక్వా రుణమాఫీని పూర్తిగా ఎగనామం పెట్టాడు. ఇక రైతుబంధు పథకం వంటి ఊసేలేదు. కేసీఆర్‌ పాలనతో పోలిస్తే చంద్రబాబు పాలనలో అవినీతి తీవ్రం, ప్రత్యేకించి ఏపీలో ఒక కులంవాళ్లు బాబు పాలనతో తమకు కొమ్ములు వచ్చాయన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. జన్మభూమి కమిటీలతో మొదలుపెడితే బాబుపై వ్యతిరేకత పెంచే అంశాలు బోలెడు. అమరావతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. అంతా బాగుందనుకున్న కేసీఆర్‌ చిత్తు అయితే, అసలేం బాగోలేదని తేలిపోతున్న చంద్రబాబు నాయుడు రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏమవుతాడో!

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

Show comments