ఈ ‘కన్వీనియంట్’ స్నేహం కథేంటి పవన్‌.!

'కన్వీనియంట్‌ ఫ్రెండ్స్‌'.. అంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తిరిగి ఆ పార్టీకే గట్టిగా తగులుతున్నాయి. చంద్రబాబు - నరేంద్రమోడీ 'కన్వీనియంట్‌' ఫ్రెండ్స్‌ అట. చంద్రబాబు - వైఎస్‌ జగన్‌ 'కన్వీనియంట్‌' ఫ్రెండ్స్‌ అట. ఇదీ పవన్‌కళ్యాణ్‌ తీరు. మరి, పవన్‌కళ్యాణ్‌ మాటేమిటి.?

2014 ఎన్నికల్లో కుడిచేత్తో నరేంద్రమోడీకి, ఎడమ చేత్తో చంద్రబాబుకీ జైకొట్టారు పవన్‌కళ్యాణ్‌. సొంత పార్టీ జనసేన జెండా పట్టుకోవడం మానేసి, బీజేపీ జెండా - టీడీపీ జెండా తన రెండు చేతులతోనూ పైకెత్తిన ఘనుడు జనసేనాని. నాలుగేళ్ళ 'హనీమూన్‌' ముగిశాక, ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ 'సుద్దులు' చెబుతోంటే, అదీ చంద్రబాబు - జగన్‌ 'కన్వీనియంట్‌' స్నేహమని చెబుతోంటే.. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఈ గందరగోళం జనసేన కార్యకర్తలనబడే పవన్‌కళ్యాణ్‌ అభిమానుల్లోనూ వుందండోయ్‌.

చంద్రబాబు 'అనుభవం' చూసి ఆయనకు మద్దతిచ్చారట పవన్‌కళ్యాణ్‌. దేశం నుంచి కాంగ్రెస్‌ని పారద్రోలేందుకోసం నరేంద్రమోడీకి మద్దతిచ్చారట. ఇప్పుడు మాత్రం పరిస్థితులు భిన్నంగా మారాయట. చంద్రబాబుని గట్టిగా విమర్శిస్తున్నారు సరే, నరేంద్రమోడీని గట్టిగా విమర్శించేందుకు పవన్‌కళ్యాణ్‌ సాహసించడంలేదెందుకో ఆ పార్టీ నేతలకే తెలియాలి.

టీడీపీని, వైఎస్సార్సీపీనీ ఒక్కగాటన కట్టేస్తే, రాజకీయంగా తనకు లాభం కలుగుతుందని పవన్‌కళ్యాణ్‌ భావిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌తో చాటుమాటు స్నేహం నడుపుతున్నారన్న విమర్శలకు ముందుగా పవన్‌కళ్యాణ్‌ సమాధానం చెప్పాల్సి వుంటుంది.

ఢిల్లీ వీధుల్లో ప్రత్యేకహోదా కోసం జనసేన గర్జిస్తుందన్న పవన్‌కళ్యాణ్‌ ఒకప్పటి మాటలు ఏమయిపోయాయో ఏమో.!

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments