మారుతీ రావు మర్డర్ స్కెచ్ వెనక 'దృశ్యం'

వెంకటేష్ హీరోగా ఆమధ్య వచ్చిన దృశ్యం సినిమా సన్నివేశాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన  ప్రణయ్ హత్య కుట్ర కోణంలో బైటపడ్డాయి. ఓ తండ్రి తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎలా రియాక్ట్ అయ్యాడు, సాక్ష్యాల్ని ఎలా తారుమారు చేశాడనే అంశంపై దృశ్యం సినిమా వచ్చింది. ప్రణయ్ హత్యకు కుట్రపన్నిన అతని మామ మారుతీరావు కూడా ఇలానే చేయాలనుకున్నాడు. హత్య జరిగే సమయంలో తను వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నట్టు నమ్మించాలని ప్రయత్నించాడు.

కోట్లు సంపాదించాడు, కూతురు తనకి నచ్చకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అల్లుడిని అడ్డు తప్పించుకోవాలనుకున్న మారుతీరావు పోలీసులకు దొరక్కుండా మర్డర్ ప్లాన్ గీశాడు. తన చేతికి మట్టి అంటకుండా పనిజరిగేలా అంతర్ రాష్ట్ర హంతకులకు సుపారీ ఇచ్చాడు. సరిగ్గా హత్య జరిగే సమయంలో బ్రహ్మాండమైన నాటకాన్ని ప్లే చేశాడు. జిల్లాలోనే ప్రముఖ బిల్డర్ కావడంతో తనకున్న పేరుని, జిల్లాస్థాయి అధికారులతో ఉన్న పరిచయాలను వాడుకున్నాడు.

ఈనెల 14న మిర్యాలగూడలో ఓ ఆస్పత్రి వద్ద మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రణయ్ హత్యకు గురయ్యాడు. సరిగ్గా ఆ సమయానికి కాస్త అటు ఇటుగా మారుతీరావు పేరున్న అధికారులను కలిసి, ఆ సాక్ష్యాలను వాడుకుని తాను తప్పించుకోవాలని అనుకున్నాడు. హత్య జరగడానికి రెండు గంటల ముందు మిర్యాలగూడ నుంచి నల్గొండ బయలుదేరిన మారుతీరావు మధ్యలో వేములపల్లి వద్ద అవసరం లేకపోయినా స్థానిక ఆర్డీవో, డీఎస్పీలను పలకరించి కాసేపు వారి వద్ద ఉండి వెళ్లాడు. 

నల్గొండ కలెక్టరేట్ కు వెళ్లి జేసీని లేదా కలెక్టర్ ని కలవాలనుకున్నాడు కానీ అది జరగలేదు. అయితే హత్య జరిగిన సమయంలో మాత్రం ఆయన కలెక్టరేట్ లోనే ఉన్నాడు. దీనికీ సాక్ష్యాలున్నాయి. హత్య జరిగినట్టు ఫోన్ రాగానే నల్గొండలో తన కారుని వదిలేసి మరో కారులో హైదరాబాద్ కు పారిపోయాడు. చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం తేలినా.. హత్య జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో తాను లేనట్టు నిరూపించుకోవడం మారుతీరావుకి పెద్ద పనేం కాదు. 

కాకపోతే ఫోన్ కాల్ డేటా, ప్రధాన హంతకుడితో సహా ప్లాన్ లో ఉన్న మిగతావారు కూడా పోలీసులకు దొరికిపోవడంతో మారుతిరావు పథకం పారలేదు. దృశ్యం సినిమా ఎఫెక్ట్ పనిచేయలేదు. 

Show comments