'గ్రేట్‌ ఎస్కేప్‌' వెనుక రహస్యం?

దేశమంతా ఆసక్తి కలిగించిన, కొత్త పొత్తుకు శ్రీకారం చుట్టిన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముగిసిపోయాయి. ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పే, 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కారు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు మొదట్నుంచీ ఉత్కంఠభరితంగానే సాగాయి. ఇంతటి ఉత్కంఠభరితంలోనే మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఇది ఆసక్తికరమే కాదు జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. ఏమిటది? కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ఎందుకు ఎన్నికల ప్రచారం చేయలేదు? ఎందుకు మౌనంగా  ఉండిపోయారు? ఎన్నికల ప్రచారం చేయకూడదని తనకు తానై నిర్ణయించుకున్నారా? ఎవరైనా సలహా ఇచ్చారా? ఆమె బయటకు రాకపోవడం వెనక రహస్యం ఏమిటి?...ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాల్సివుంది. జనాల సంగతి పక్కకు పెడదాం. అసలు కాంగ్రెసు శ్రేణులకైనా తెలుసా? అనేది సందేహం. పెద్ద తలకాయలకు తెలిస్తే తెలిసివుండొచ్చేమో...! 

ప్రియాంక గొప్ప రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అయివుండొచ్చు. ఆమె అసలు తెర మీదికి రాకపోయుంటే ఇప్పుడిన్ని ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉండకపోయేది. కాని ప్రియాంక ప్రచారం చేసే విషయమై భారీ 'ప్రచారం' జరిగింది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని రాహుల్‌ గాంధీతోపాటు పార్టీని నడిపిస్తారని నాయకులు అదే పనిగా చెప్పారు. తల్లి అనారోగ్యం పాలయ్యారు కాబట్టి సోదరుడికి అండగా ఉండేందుకు ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారు. యూపీ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి మీడియాలో ఆమె గురించి కథనాలు రాని రోజుల లేదంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాది రాజకీయాలపై బాగా ఫోకస్‌ చేసే ఆంగ్ల పత్రికలు ప్రియాంక ఎన్నికల ప్రచారంపై అదే పనిగా భిన్న కోణాల్లో కథనాలు వెలువరించాయి. ఫలానా తేదీ నుంచి ప్రచారం మొదలుపెట్టబోతున్నారంటూ తేదీలు, ముహూర్తాలు నిర్ణయించారు. ఒకసారి నాయనమ్మ ఇందిరా గాంధీ జన్మదినం రోజు ప్రచారం ప్రారంభిస్తారన్నారు. మరొకసారి తల్లి సోనియా గాంధీ జన్మదినం నాడు రంగంలోకి దిగుతారని చెప్పారు. ఆమె ఎక్కడెక్కడ పర్యటిస్తారో, ఎన్నెన్ని సభల్లో ప్రసంగిస్తారో రోడ్‌ మ్యాప్‌ తయారుచేశారు. భారీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారీ రోడ్‌ షోలకు ఏర్పాట్లు చేశారు. ప్రియాంకలో నాయనమ్మ ఇందిరా గాంధీ పోలికలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆమె ప్రచారం చేస్తే కాంగ్రెసుకు ప్రయోజనం కలుగుతుందనుకున్నారు. 

అసలు చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే అన్ని పార్టీల కంటే ముందుగా, తన విధానానికి వ్యతిరేకంగా యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను ప్రకటించి ప్రచారం కూడా ప్రారంభించింది కాంగ్రెసు పార్టీ. షీలాకు ఇష్టం లేకపోయినా ఆమెను ఒప్పించడంలో కీలకపాత్ర పోషించింది ప్రియాంక గాంధీయే. ఇంతేకాకుండా కొందరు అభ్యర్థులను కూడా ఆమే నిర్ణయించారు. కాని కాలక్రమంలో జరిగిన అనేక పరిణామాల ఫలితంగా ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెసు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తు వెనక వ్యూహకర్త ప్రియాంకేనని కాంగ్రెసు నాయకులు చెప్పారు. అప్పటినుంచి పార్టీలో ఆమె ప్రాధాన్యం పెరిగిపోయింది. పార్టీలో ఆమె కీలక పాత్ర పోషించకపోతే పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందనే అభిప్రాయం బలపడిపోయింది. ఎస్‌పీ-కాంగ్రెసుల మధ్య పొత్తు కుదిరిన తరువాత కూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేస్తారని అనుకున్నారు. అఖిలేష్‌ భార్య డింపుల్‌, ప్రియాంక బొమ్మలతో ఫెక్సీలు ఏర్పాటయ్యాయి. అంటే వారిద్దరూ కలిసికట్టుగా ప్రచారం చేస్తారని అర్థం. కాని జరగలేదు. ఓ పక్క ప్రియాంక కీలక పాత్ర గురించి కథనాలు వస్తున్న సమయంలోనే ఆమె గందరగోళం సృష్టించిన, అనిశ్చితంగా వ్యవహరించిన తీరు మీదా కథనాలు వెలువడ్డాయి. పియాంక గురించి  ఏ విషయమూ నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

ఫలాన సమయంలో ఆమె ప్రచారం ప్రారంభిస్తారని అనేకసార్లు ప్రకటించినా  ఏమీ కాలేదు. సెప్టెంబరులో రంగంలోకి దిగుతారని చెప్పారు. కాలేదు. అక్టోబరులో అన్నారు. కాలేదు.  నవంబరులో పక్కా అన్నారు. ఆమె నాయనమ్మ ఇందిరా గాంధీ పుట్టిన రోజైన నవంబరు 19న అహ్మదాబాద్‌ నుంచి ప్రచారం ప్రారంభిస్తారని వార్తలొచ్చాయి.  డిసెంబరులో రంగంలోకి దిగుతారని చెప్పారు. మరికొందరు నాయకులు ఇంకా ముందుకెళ్లి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అంటే 2017 ఫిబ్రవరిలో ప్రచారపర్వంలోకి ఎంటరవుతారని అన్నారు. 'ఆమె రావడం పక్కా. అయితే ఎప్పుడనేది తెలియదు'..అన్నాడు ఓ నాయకుడు.  రాహుల్‌ 'విఫల నాయకుడు' అనే అభిప్రాయం ఏర్పడటం, సోనియా గాంధీ ఆరోగ్యం దెబ్బ తినడంతో ప్రియాంక పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి  రావాలనే డిమాండ్‌ పెరిగింది. కాంగ్రెసు సముద్రాన్ని ఈదడం రాహుల్‌ ఒక్కడివల్ల కాదని సోనియాకూ తెలుసు.   యుద్ధంలో ప్రియాంకను ముందు వరుసలో నిలపడం 

తప్ప మరో మార్గం లేదనుకున్నారు. రాహుల్‌ గాంధీ గతంలో కంటే మెరుగుపడినప్పటికీ ప్రియాంక గాంధీ 'గ్లామర్‌' పార్టీ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని కాంగ్రెసు నేతలు భావించారు.  ఆమె రాజకీయాల్లోకి వస్తే పార్టీకి ప్రయోజనం కలుగుతుందని సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కూడా అన్నారు. ఉత్తర భారతంలోని గ్రామీణ ప్రాంతాల కాంగ్రెసు కార్యకర్తలు సైతం ప్రియాంకను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కాని అనుకున్నది కాలేదు. చివరకు 45 ఏళ్ల ప్రియాంక గాంధీ ఒకే ఒక్క సభలో కొద్దిసేపు ప్రసంగించి మెరుపులా మెరిసిపోయారు. అది కూడా తన తల్లి పార్లమెంటరీ నియోజకవర్గమైన రాయబరేలీలో. ఇక్కడ కూడా ఆమె ఎందుకు మాట్లాడారు? కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 'ప్రియాంక ఎన్నికల ప్రచారం నుంచి తప్పించుకున్నారు' అని విమర్శించడంతో ఒక్క సభలోనైనా ప్రసంగించారు.         

అసలు ప్రియాంక విస్తృతంగా కూటమి తరపున ప్రచారం చేస్తారని, ప్రధాని మోదీని కడిగిపారేస్తారని నాయకులు ఆశించారు. కాని ప్రసంగించిన ఒక్క సభలోనూ మోదీ బయటి వ్యక్తి (ఔట్‌ సైడర్‌) కాబట్టి ఆయనకు ఓట్లేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రియాంక ప్రచారం పర్వం చివరకు కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్లయింది. ఎస్‌పీ-కాంగ్రెసు కూటమి తరపున ఆమె ఎందుకు ప్రచారం చేయలేదు? ..ఈ ప్రశ్నకు జవాబు ఎవ్వరికీ తెలియదు. తెలిసినవారు నోరు విప్పకపోవచ్చు. ఎక్కువమంది అనుకునేది ఏమిటంటే ప్రియాంకకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే, అందలమెక్కిస్తే కాంగ్రెసు పార్టీకి కాబోయే అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వెలవెలబోతారని. ఏది ఏమైనా ప్రియాంక గాంధీ 'గ్రేట్‌ ఎస్కేప్‌' వెనక ఏం జరిగిందనేది బ్రహ్మరహస్యమే...!

-నాగ్‌ మేడేపల్లి

Show comments