ఎమ్బీయస్‌: డా. కోడెల అండ్‌ మిస్టర్‌ హైడ్‌

డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌గారిలో రెండు పార్శ్వాలున్నాయని చెప్పడానికే పై కాప్షన్‌ పెట్టాను. ఆర్‌.ఎల్‌.స్టీవెన్సన్‌ 1886లో రాసిన విశ్వవిఖ్యాత నవల ''డా. జెకిల్‌ అండ్‌ మిస్టర్‌ హైడ్‌'' చాలామందికి పరిచితమే. పరిచయం లేనివారి కోసం కథాంశాన్ని క్లుప్తంగా చెపుతాను.

హెన్రీ జెకిల్‌ అనే డాక్టర్‌ స్వతహాగా పెద్దమనిషి. కానీ చెడుపనులు చేయాలని అంతర్లీనంగా కోరిక ఉంటుంది. రసాయనాలతో ప్రయోగాలు చేసి ఒక మందు కనిపెడతాడు. దాని ద్వారా ఎడ్వర్డ్‌ హైడ్‌ అనే వ్యక్తిగా మారి, వేరే యింట్లో ఉంటూ తన కిష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూంటాడు. తను చేసిన దుర్మార్గాలకు పరిహారం చెల్లించవలసి వచ్చినపుడు జెకిల్‌ పేరు, డబ్బు వాడుతూంటాడు. జెకిల్‌కు స్నేహితుడైన అటర్‌సన్‌ అనే లాయరుకు యిదంతా గందరగోళంగా ఉంటుంది. జెకిల్‌ను హైడ్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడనుకుని, హైడ్‌తో స్నేహం వదులుకుంటే మంచిదని జెకిల్‌కు చెప్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకరే అనే సంగతి ఎవరికీ తెలియదు. జెకిల్‌ రసాయనం తాగి కొన్నాళ్లు హైడ్‌గా జీవిస్తూ మళ్లీ దాని సహాయంతోనే జెకిల్‌గా మారిపోతూ ఉంటాడు. హైడ్‌ అకృత్యాలు ఎక్కువై పోతూండడంతో, అవి వెలుగులోకి వస్తూండడంతో యిక హైడ్‌గా మారకూడదని నిశ్చయించుకుంటాడు. 

కానీ అతని ప్రయత్నం లేకుండానే హైడ్‌గా మారిపోతూ ఉంటాడు. మళ్లీ చచ్చిచెడి జెకిల్‌గా మారాల్సి వస్తూ ఉంటుంది. ఈ మంచి, చెడుల ఘర్షణలో నలిగి జెకిల్‌ మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. చివరకు రసాయనం పని చేయడం కూడా మానేస్తుంది. ఇక తను హైడ్‌గా మారిపోయి, అలాగే మరణించడం తథ్యం అని గ్రహించాక, తన తప్పులు ఒప్పుకుంటూ లాయరు స్నేహితుడి పేర ఉత్తరం రాస్తాడు. అతను భయపడినట్లుగానే హైడ్‌గా తనువు చాలిస్తాడు. ప్రతి మనిషిలోను ద్వంద్వస్వభావం ఉంటుందని, వివేకంతో చెడుని నియంత్రించకపోతే చివరకు విషాదంతో జీవితం ముగుస్తుందని నాటకీయంగా చెప్పిన యీ నవల పాఠకలోకాన్ని మెప్పించింది. ఈ థీమ్‌తో అనేక భాషల్లో అనేక సినిమాలు కూడా వచ్చాయి. కోడెల ఆత్మహత్య వార్త వినగానే నాకు ఛట్టున యీ కథ గుర్తుకు వచ్చింది. ఆయనలో జెకిలూ ఉన్నాడు, హైడూ ఉన్నాడు. దురదృష్టమేమిటంటే చివరకు హైడ్‌ అవతారంలో లోకాన్ని విడిచాడు.

కోడెల స్వతహాగా మంచివాడని, స్నేహశీలి అని అంటారు. గొప్ప వైద్యుడిగా జిల్లా అంతా పేరుంది. పేదలకు రూపాయికే వైద్యం చేసేవాడనే ప్రతీతి ఉంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చాలా సేవలు అందించాడని చెప్తారు. 36వ యేట రాజకీయాల్లో ప్రవేశించి, అదే పార్టీలో కడదాకా కొనసాగారు. 1983-1999 మధ్య నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు నెగ్గి, 2014లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యే అయ్యారు. తన నియోజకవర్గంలో 20 వేల మరుగుదొడ్లు నిర్మించారు. కోటప్పకొండకు ఘాట్‌ రోడ్డు వేయించారు. అనేక శాఖలకు మంత్రిగా చేసి తన సామర్థ్యాన్ని చాటుకున్నారు. నాకు తెలిసి అవినీతి ఆరోపణలు లేవు. బసవతారకం కాన్సర్‌ ఆసుపత్రి స్థాపనలో ముఖ్యభూమిక వహించారు. దానికి తొలి చైర్మన్‌. వ్యక్తిగతంగా చాలామందికి సాయపడ్డారు.

ఇది ఒక కోణమైౖతే, రెండో కోణం పలనాడులో హింసారాజకీయం నడపడం. ఆయన ఇంట్లోనే బాంబులు పేలి, నలుగురు చనిపోయారు. తనకు పలుకుబడి ఉన్న ప్రాంతాల్లో దౌష్ట్యం ప్రదర్శించారని, జులుం చేశారని అందరూ అంటారు. ఇంతటి విద్యాధికుడు అలా ఉండగలరా అని మనమంతా ఆశ్చర్యపడే తీరులో ఆయన రాజకీయ జీవితం గడిచింది. 2004 నుంచి టిడిపి ప్రతిపక్షంలో ఉంది. 2014లో ఓడిపోయి వుంటే కోడెలకు యిలాటి దుర్గతి పట్టి వుండేది కాదు. కానీ గెలిచింది. బాబు కోడెలను స్పీకరుగా చేశారు. గత ఐదేళ్లలో కోడెలలో హైడ్‌ విజృంభించాడు. ఎంతో చెడ్డపేరు మూటగట్టుకున్నారాయన.

బయట హుందాగా వ్యవహరించే కోడెల చేత స్పీకరుగా బాబు అనేక భ్రష్టకృత్యాలు చేయించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో, ప్రతిపక్షాల గొంతు నొక్కే విషయంలో కోడెల తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేశారు. బాబు చెప్పినట్లే ఆడారంటూ బాబుపై తప్పు నెట్టేయలేము. కోడెల వంటి సీనియరు ఒక హద్దుకి మించి, తాను యిలాటివి చేయలేనని సున్నితంగానే తిరస్కరించి ఉండవచ్చు. లేదా అనారోగ్యం సాకు చెప్పి స్పీకరు పదవి నుంచి తప్పుకోవచ్చు. కానీ ఆయన చూసి రమ్మంటే, కాల్చి వచ్చే రకంలా ప్రవర్తించారు. సభ్యసమాజం చేత ఛీకొట్టించుకున్నారు. తను చేసిన పనులకు సంజాయిషీ కూడా చెప్పుకోలేని స్థితిలో పడ్డాడాయన.

స్పీకరు పదవి అనేది హుందాతనంతో కూడుకున్నది. కోడెల దాన్ని మరిచి ఫక్తు టిడిపి రాజకీయనాయకుడిలా పార్టీ కండువా కప్పుకోవడమే కాక, 'రౌడీతనానికి ప్యాంటు, చొక్కా వేస్తే అది జగన్‌లా వుంటుంది' వంటి ప్రకటనలు చేశారు, ఓ పక్క తన నియోజకవర్గంలో తన సంతానం ఎంత రౌడీతనం చేస్తున్నారో తెలిసి కూడా! టిడిపి హయాంలోనే వారిపై ఆరోపణలు వచ్చాయి. ఆయన కొడుకు తనను వేధిస్తున్నాడనీ, కోర్టు తనకు కస్టడీ అప్పగించినా, తమ కొడుకుని బలవంతంగా ఎత్తుకుపోయాడని కోడలు బహిరంగంగా ఆరోపించింది. కోడెల స్పీకరు పదవిని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారని కూడా అంది. కొడుకు, కూతురు తమ దౌర్జన్యాలతో తనకు చెడ్డపేరు తెస్తున్నారని తెలిసి కూడా కోడెల సరిదిద్దుకోలేదు. మాటవరసకి, వాళ్లను అదుపు చేయలేక పోయారని అనుకుందాం. అలాటప్పుడు రాజీనామా చేసి యింట్లో కూర్చుంటే వాళ్లకు పవరు తగ్గిపోయేది కదా! పోనీ ఐదేళ్లు ఎలాగోలా గడిచిపోయాయి. 2019లో మళ్లీ పోటీ చేయను అని ఉన్నా, వాళ్లకు దన్ను పోయేది కదా! 

ఆయన అలా అనకపోగా, పోటీ చేస్తానని పట్టుబట్టారు. స్థానికంగా టిడిపి నాయకులు ఎంతగా వ్యతిరేకిస్తున్నా బాబుపై ఒత్తిడి తెచ్చి టిక్కెట్టు యిప్పించుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలలో అనుచరులు దెబ్బలు తింటూంటారు కానీ, అభ్యర్థులు తినడం చాలా అరుదైన విషయం. అలాటి 'సత్కారం' ఆయనకు జరిగింది. విద్యాధికుడు, మీదు మిక్కిలి నారాయణుడితో సమానమైన వైద్యుడు అయిన కోడెలకు అలాటి స్థితి పట్టడం ఎంతటి దౌర్భాగ్యం! ఇన్నాళ్లూ ప్రతి ఎన్నికలో గెలుస్తూ వచ్చి, గతంలో తన చేతిలో పరాజితుడైన అంబటి రాంబాబు చేతిలో 21 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం బాధించి వుంటుంది. ఇలాటి స్థితి తెచ్చుకున్నందుకు ఆయన మనసు క్షోభ పడివుంటుందనే అనుకోవాలి. టిడిపి పరిస్థితి బాగా లేదని ఏ మాత్రం ఊహించగలిగినా ఆయన హుందాగా తప్పుకుని వుండేవాడు. కనీసం కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయకుండా వుండి వుండేవాడు.

ఫలితాలు వచ్చాయి. అధికారం పోయింది. నియోజకవర్గంలో అప్పటిదాకా అణచి పెట్టి వుంచిన చలిచీమలు ఎదురు తిరిగాయి. ఆయన కొడుకు, కూతురుపై కేసులు పెట్టడం మొదలెట్టాయి. అవి ప్రభుత్వం పెట్టినవి కావు. వాటిని ఎదుర్కోవడం ఎలాగో వాళ్లకు బాగా తెలుసు. ఉద్యోగం యిప్పిస్తానని డబ్బు తీసుకున్నాడు లాటి వాటికి సాక్ష్యాలు దొరకవు. కొడుకుపై గతంలో భార్యే కేసు పెట్టింది. కోడెల కూడా కేసులకు బెదిరే రకం కాదు. ఇన్నేళ్ల రాజకీయజీవితంలో ఎన్నో కేసులు ఎదుర్కున్నారు. ఇంట్లో బాంబులు పేలిన కేసుల కంటె పెద్దవి కావు యివి. వీటిని వేధింపులుగా భావించి, సిగ్గుతో చితికిపోయేటంత సున్నిత మనస్కుడేమీ కాడు. పలనాటి రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న ఘటమది. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకోవలసి వచ్చింది? సూసైడ్‌ నోట్‌ దొరకలేదు కాబట్టి, సెల్‌ఫోన్‌ మాయమైంది కాబట్టి ఎవరికి వారు ఊహించుకోవలసిందే! 

ఒకటి - ఫర్నిచర్‌ కేసులో పోయిన ప్రతిష్ఠ. ఇన్నాళ్లూ యీ విషయమై నోరెత్తని చంద్రబాబు యిప్పుడు చెప్తున్నారు - అదో పెద్ద కేసే కాదని. కోడెల తనంట తానే పట్టుకుపొమ్మనమని ఉత్తరాలు రాశారని, అయినా లక్ష రూపాయల ప్రభుత్వ ఆస్తి పట్టుకుపోయినంత మాత్రాన పెద్ద యాగీ చేయనక్కరలేదనీ! ఈ ముక్క కోర్టులో కోడెల తరఫు న్యాయవాది చెప్పలేకపోతారా? మరి అదో పెద్ద కేసుగా భావించి కోడెల తల్లడిల్లి పోవడం దేనికి? బాబు ఏమైనా మాట్లాడవచ్చు కానీ ప్రభుత్వ ఆస్తి ఐదు రూపాయలు పట్టుకుపోయినా నేరమే. బ్యాంకు ఆఫీసర్లకు యింటికి ఫర్నిచర్‌ యిస్తారు. బదిలీ అయినప్పుడు వాటిని బ్యాంకుకు అప్పగించేయాలి. మా బ్యాంకులో ఒక ఆఫీసరు మూడు ఫ్యాన్లు తిరిగి అప్పగించనందుకు సస్పెండ్‌ చేశారు. అతను సిగ్గుపడి రాజీనామా చేశాడు. రాజకీయ నాయకులకు అలాటి సిగ్గు వుండదు. పదవి పోయినా అధికార నివాసాలను, ఫర్నిచర్‌ను అప్పగించరు. సిబ్బంది రిమైండర్లు పంపిస్తున్నా పట్టించుకోరు. కోడెల కూడా అలాటి బాపతే అనుకుని ఊరుకోవచ్చు.

కానీ కోడెల గతంలో వైసిపి నాయకులను నానా యాతనా పెట్టిన మనిషి. వాళ్లు అధికారంలోకి రాగానే బదులు తీర్చుకునే ప్రమాదం ఉంది. అందుచేత తన వైపు తప్పు లేకుండా చూసుకోవలసింది. మొదట్లోనే అదనంగా ఉన్న ఫర్నిచర్‌ను యింటికి పట్టుకుపోకుండా ఏ ప్రజావేదికలోనే పడేయించాల్సింది. ఒకవేళ ఆయన అసెంబ్లీలో గెలిచినా సాధారణ ఎమ్మెల్యే అవుతాడు కానీ, మళ్లీ స్పీకరు అవుతాడన్న గ్యారంటీ వుందా? స్పీకరు ఫర్నిచరు ఎమ్మెల్యే యింట్లో ఉండకూడదు కదా! ఎన్నికలు ప్రకటించగానే వీటిని పట్టుకుపొమ్మనమని అధికారులకు చెప్పి వుండాల్సింది. కనీసం అధికారం పోగానే తనే రవాణా ఖర్చులు పెట్టుకుని తిప్పి పంపేయాల్సింది. లేఖ రాశా, కానీ దానికి ఎక్నాలెజ్‌మెంట్‌ లేదు అంటే ఒప్పుతుందా? స్పీకరుగా తెగ రూల్సు మాట్లాడిన వ్యక్తికి ఆ మాత్రం తెలియదా? 

ఇవన్నీ సాంకేతిక విషయాలు. అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే ఆ ఫర్నిచరు కోడెల యింట్లో కాకుండా, కొడుకు వ్యాపారస్థలంలో దొరకడం! దాంతో అందరూ ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది. కె-ట్యాక్స్‌ గురించి కర్ణాకర్ణీగా విన్నవారికి కూడా కొడుకు జులుం గురించి ఒక అవగాహన ఏర్పడిపోయింది. మంత్రిగా పనిచేసినా అవినీతి మచ్చ పడకుండా చూసుకున్న వ్యక్తికి, ఎంతో డబ్బు గడించిన వ్యక్తికి 'ఫర్నిచర్‌ కోసం కక్కుర్తి పడ్డాడన్న' మాట రావడం దుస్సహమై ఉంటుంది. కొందరు టిడిపి నాయకులు బహిరంగంగా కోడెల అలా చేసి వుండకూడదు అన్నారు. తక్కినవారందరూ అంతర్గతంగా అనుకుని వుంటారని, ఎట్‌లీస్టు కోడెల భావించి ఉంటారు. తనను యీ స్థితికి నెట్టిన సంతానంపై క్రోధం, దాన్ని అనుమతించిన తనపై తనకు ఉక్రోషం వచ్చి బాధపడి వుండవచ్చు. 

ఈ క్లిష్ట సమయంలో తనకు పార్టీ అండగా నిలవలేదన్న వేదనే ఆయనను కబళించి వుండవచ్చు. ప్రతిపక్ష నాయకులను, పార్టీలను ఆయన మూడు దశాబ్దాలుగా ఎదుర్కుంటూనే ఉన్నాడు. కేసులూ కొత్త కావు. వాటికి చలించిపోయి ఉంటాడనుకోవడం అవివేకం. ఆ మాటకొస్తే కేసులు లేని నాయకులెందరు? శత్రువులు ఎలాగూ శత్రువులే, కానీ ఆత్మీయులు దగా చేసినపుడు మాత్రమే మనిషికి వ్యథ కలుగుతుంది. సొంత యిమేజిని తాకట్టు పెట్టి బాబు చెప్పినట్లా గత ఐదేళ్లు ఆడి పార్టీ కెంతో మేలు చేసినా, యిప్పుడు తన మానాన తనను వదిలేశారన్న వ్యగ్రత తినేసింది.

ఎన్టీయార్‌ విషయంలోనూ అదే జరిగింది. కాంగ్రెసు వాళ్లు ఎన్ని కారుకూతలు కూసినా, గద్దె నించి కూలదోసినా తట్టుకున్నాడాయన. కానీ ఎప్పుడైతే ఆత్మీయులనుకున్నవాళ్లే వెన్నుపోటు పొడిచారో తట్టుకోలేక పోయాడు. అందుకే కోడెల హెచ్చు మోతాదులో నిద్రమాత్రలు మింగి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. సరైన సమయంలో అల్లుడు రక్షించి, బతికించాడు. అప్పుడు కూడా బాబు, యితర టిడిపి సభ్యులు తొంగి చూడలేదు. అది మరింత ఆవేదనకు గురి చేసింది.

నిజమో కాదో తెలియదు కానీ టిడిపి తనను తృణీకరంచిడంతో, బిజెపిలో చేరదామనుకున్నారని యిప్పుడు బిజెపి నాయకులు అంటున్నారు. ఏది ఏమైనా సొంత పార్టీ దగా చేసిందన్న బాధ ఆయనలో ఉంది. దీనికంతా కారణం నువ్వే అని కొడుకుతో ఘర్షణ పడ్డారేమో తెలియదు. చివరగా చేసిన ఫోన్‌కాల్‌ ఎవరికో తెలిసినప్పుడే అది ఊహించవచ్చు. ఇంత బతుకూ బతికి శేషజీవితం యిలా వెళ్లబుచ్చాలా అనే బాధతో ఆయన మళ్లీ ఆత్మహత్యకు పాల్పడ్డారనేది లాజికల్‌ కన్‌క్లూజన్‌. కుటుంబసభ్యులు హత్య చేశారు, చేయించారు అనేది నమ్మలేం. ఆయన్ను చంపుకుంటే వాళ్లకేం వస్తుంది? తండ్రి పలుకుబడితోనే వాళ్లు కేసుల్లోంచి బయటపడాలి. కోడెలపైన కొందరికైనా గౌరవం వుంది కానీ వారిపై ఎవరికీ లేదు.  

ఇక ఆయన పోయాక కాన్సర్‌ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు అనే ప్రశ్నకు సమాధానం కూడా సులభంగానే ఊహించవచ్చు. కోడెల కూతురు విజయలక్ష్మి కూడా డాక్టరే కాబట్టి తండ్రి చనిపోయిన విషయం ఆమె వెంటనే గ్రహించి వుంటారు. కానీ ఆత్మహత్య చేసుకున్నారంటే పరువు పోతుందని భయపడి వుంటారు. ఇటీవలే నిద్రమాత్రలు మింగినప్పుడు గుండెపోటుగా ప్రచారం చేసినట్లు, యీసారి కూడా అలా చేద్దామా అని ఆలోచించి వుంటారు. దానికి ఆసుపత్రి వాళ్ల సహకారం ముఖ్యం. బాలకృష్ణ యింట్లో కాల్పుల విషయంలో కూడా ఆసుపత్రి మద్దతుతోనే ఆయన బయటపడ్డాడు. కాన్సర్‌ ఆసుపత్రి కోడెల యింటి సంస్థ లాటిదే కాబట్టి అక్కడకు తీసుకెళ్లారు. కానీ దీన్ని సహజమరణంగా చూపడం కష్టమని వాళ్లు చెప్పి వుంటారు. అప్పుడే ఉరి వేసుకున్నారని ప్రకటించి వుంటారు.

విజయలక్ష్మి తన సర్వీసులో ఎన్నో మెడికల్‌ లీగల్‌ కేసులు చూసి ఉంటారు కాబట్టి సాక్ష్యాల కున్న విలువ తెలుసు. కానీ పోలీసులు వచ్చేసరికే క్రైమ్‌ సీనులో అన్నీ గల్లంతయ్యాయి. వివేకానంద హత్య కేసులో ఆయన అనుచరులూ యిలాగే చేశారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్‌ చేశారు. నిజానిజాలు ఎప్పటికి బయటకు వస్తాయో తెలియదు. రాకుండా అడ్డుపడడానికి రాజకీయాలు ఎలాగూ ఉన్నాయి.

కోడెల బతికి వుండగా సానుభూతి చూపని బాబు యిప్పుడు చాలా అడావుడి చేస్తున్నారు. బాబు స్థానంలో ఎవరున్నా అప్పుడు సానుభూతి చూపడం కష్టమే. ఎందుకంటే కోడెల తన పరిస్థితిని అంతగా చెడగొట్టుకున్నారు. బాబు వచ్చి బహిరంగంగా అండగా నిలుస్తారని అనుకోవడం ఆయన అవివేకం. కానీ టిడిపి కార్యకర్తలు అలా అనుకోరు కదా, బాబు అండగా నిలిచి వుంటే, కోడెలకు యీ గతి పట్టేది కాదు. బాబు యితరులను వాడుకుని వదిలేసే రకమని మరోసారి రుజువైంది అనుకుంటూండవచ్చు. ఎట్‌లీస్టు అలా అనుకుంటున్నారన్న భయంతో బాబు యిలా ఓవరాక్షన్‌ చేస్తున్నారు. తన క్యాడర్‌ను నిలుపుకోవడానికి యిది ఆయనకు అత్యవసరం, అనివార్యం. సంతాపదినాలు, నిరసన ప్రదర్శనలు, సిబిఐ చేత విచారణ కోరుతూ ర్యాలీలు యిలా ఓ నెల్లాళ్లపాటు కార్యక్రమాలు తప్పవు. లేకపోతే వైసిపి ఏవేవో కేసులు పెడతామని భయపెట్టి టిడిపి క్యాడర్‌ను నిర్వీర్యం చేసేయవచ్చు. కేసులు చుట్టుకుంటే బాబు ఏమీ సాయం చేయరనే భయంతో టిడిపి కార్యకర్తలు దాడులు చేయడం కూడా మానుకోవచ్చు. ఆ పర్యవసానానికి భయపడి బాబు 'ప్రభుత్వం వేధించడం వలననే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు' అనే లైన్‌ తీసుకుని తప్పంతా వైసిపిపైకి నెట్టేస్తున్నారు. 

ఏది ఏమైతేనేం, కోడెల కథ విషాదంగా ముగిసింది. ఆయన హుందాగా సహజమరణం పొంది వుంటే, గౌరవంగా ఉండి వుండేది. కానీ గత ఐదేళ్లలో మిస్టర్‌ హైడ్‌ ఆయనను డామినేట్‌ చేశాడు. అతడి చెరలోంచి డాక్టర్‌ కోడెల బయటపడలేక పోయాడు. చివరకు హైడ్‌ రూపంలోనే, దోషిగా బోనెక్కి, అంతమయ్యారు. ఈయన కథలో రాజకీయ నాయకులందరకూ పాఠాలున్నాయి. తనలోని చెడును హద్దు దాటనీయరాదు, సంతానాన్ని అదుపు చేయకపోతే వాళ్లే మాన, ప్రాణఘాతకులవుతారు. ఎంత మంచి పేరు ఉన్నా చివరకు మట్టికొట్టుకుని పోతుంది. ఏ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినా అది శోచనీయం. కోడెల వంటి ప్రతిభావంతుడికి, విద్యావంతుడికి యిలాటి మరణం సంభవించడం నిజంగా దురదృష్టకరం.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2019)
mbsprasad@gmail.com

Show comments