సినిమా రివ్యూ: దొరసాని

సమీక్ష: దొరసాని
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ మరియు మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు బిగ్‌ బెన్‌ సినిమాస్‌
తారాగణం: ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌, వినయ్‌ వర్మ, శరణ్య, కిషోర్‌, బైరెడ్డి వంశీకృష్ణారెడ్డి తదితరులు
కూర్పు: నవీన్‌ నూలి
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి
ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి
నిర్మాతలు: మధుర శ్రీధర్‌రెడ్డి, యాష్‌ రంగినేని
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: కె.వి.ఆర్‌. మహేంద్ర
విడుదల తేదీ: జులై 12, 2019

దొరల పాలన నుంచి స్మార్ట్‌ఫోన్‌ల కాలం వరకు ప్రేమికుల పట్ల పెద్దల వైఖరి మారలేదనేది చెప్పడం దర్శకుడు మహేంద్ర ఉద్దేశం కావచ్చు. ఈ పాయింట్‌ని చెప్పడానికి సమకాలీన 'ప్రణయ' కథనే ఏదైనా తీసుకుని సినిమా తీసి వుండవచ్చు. అయితే ఈ రొటీన్‌ కథకి కాస్త డిఫరెంట్‌ లుక్‌ అండ్‌ ఫీల్‌ ఇవ్వడానికా అన్నట్టు 'దొరల పాలన'లోని తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఆ కాలంలో దొరలుండేవారు... నక్సలైట్లుండేవారు... అలాగే అంతస్తుల అంతరం ఎరుగని, కులాల కల్మషం తెలియని ప్రేమికులు వుండేవారు. మ్మ్‌... బాగుంది. తర్వాతేంటి? అంతే... అంతకుమించి ఈ దొరసాని కథ ఆసక్తికరంగా చెప్పడానికి కావాల్సిన మెటీరియల్‌ లేదు. మరేంటి? రోమియో జూలియట్‌ (ఆంగ్లము) నుంచి... సీతాకోకచిలుక (ఆంధ్రము) మీదుగా కాదల్‌ (తమిళం) నుంచి నిన్న మొన్నటి సైరాట్‌ (మరాఠీ) వరకు ఎన్నోసార్లు రకరకాలుగా తెరకెక్కిన ఈ కథకి కొత్తగా అద్దబోయే రంగేంటి?

దొరల కాలం నాటి తెలంగాణ నేపథ్యం కానీ, పోటెత్తుతున్న నక్సలిజమ్‌ అంశం కానీ 'దొరసాని'కి కొత్త రంగులేం అద్దలేదు. కాకపోతే విజయ్‌ దేవరకొండ తమ్ముడు, రాజశేఖర్‌ చిన్న కూతురు జంటగా నటిస్తే 'దొరసాని'కి మెప్పించే రంగొస్తుందనుకున్నారు. ఎవరు నటించారనేది సదరు సినిమాకేసి జనం దృష్టిని తిప్పుతుందేమో కానీ ఏమి చూపించారనేదే జనం డబ్బుని టిక్కెట్లుగా మారుస్తుంది. ఈ జంట ఎలాగుంది అని చూసేందుకు వచ్చే వారికంటే ఈ సినిమాలో ఏముంది అనేదే ఎక్కువ సేల్‌ అవుతుంది. మీడియా మైలేజ్‌కి హెల్ప్‌ అయ్యే లీడ్‌ పెయిర్‌ వుంది, మిగతా సినిమాల మధ్య కొత్తగా అనిపించే బ్యాక్‌డ్రాప్‌ వుంది... ఇప్పటికీ న్యూస్‌ అవుతోన్న 'ప్రేమకథ' వుంది... ఇంతకంటే కావాల్సినదేమిటి అన్నట్టుగా వుంది 'దొరసాని'.

నేపథ్యం ఏదైనా, ఎన్నిసార్లు చూపించిన కథ అయినా ఇంకోసారి చూసేట్టు చేయడంలోనే నేర్పు దాగి వుంటుంది. లేదంటే 'సైరాట్‌' అంతగా సక్సెస్‌ అవదు. బాలీవుడ్‌లోకి రీమేక్‌ అయి శ్రీదేవి కూతురి తొలి సినిమా అయ్యేది కాదు. రెగ్యులర్‌ కథనే ఎంత ఆసక్తికరంగా, ఇంకెంత హృద్యంగా చెప్పారనేదే ప్రేక్షకులని మెప్పిస్తుంది. మళ్లీ మళ్లీ థియేటర్లకి రప్పిస్తుంది. 'దొరసాని'లో ఒక కూలివాడి కొడుకు 'గడి'లోని చిన్న దొరసానితో ప్రేమలో పడతాడు. ఆమెని మొదటిసారి చూసి అతను ప్రేమిస్తాడు. అతడినో మూడు, నాలుగుసార్లు 'చూసి' ఆమె ప్రేమిస్తుంది. ఒకర్నొకరు చూసుకోవడానికి ఆమె ఇంటి కిటికీ దగ్గర చేరతారు. అలా చూసుకుంటూ గడిపేస్తూ మధ్యమధ్యలో కవితలు కూడా రాసుకుంటారు.

ఒక్కసారి కలిసారో లేదో ఆ ప్రేమకథ గుట్టు రట్టవుతుంది. దొర కంట పడిన తర్వాత ఈ ప్రేమ ఎటు దారి తీస్తుంది? ఈ కథకి ముగింపు అనూహ్యమేం కాదు. ఇప్పుడు ఇలాంటి ముగింపు మామూలవుతున్నాయి. కనీసం ఆ ముగింపుని ఆకట్టుకునేలా తెరకెక్కించి వుండాల్సింది. అవసరానికి మించిన బిల్డప్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఏమి జరగనుందో హింట్‌ ఇచ్చేస్తుంది. కంటతడి పెట్టించడం, కదిలించడం మాట అటుంచి 'అయ్యో' అనుకునేంత కనక్ట్‌ అయినా ఆ జంటపై పుట్టించలేకపోవడం, ఆ ప్రేమతో రిలేట్‌ చేసుకునేలా లేదా ఆ ప్రేమని ప్రేమించేట్టు చేసేలా చేయడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు.

నక్సలిజమ్‌ని అసలు కథకి సమాంతరంగా చూపిస్తూ వుంటే కథలో ఏదైనా కీలక ఘట్టానికి అది కారణమవుతుందా లేక కథని ఊహించని మలుపు తిప్పుతుందా అనే భావన కలుగుతుంది కానీ చివరకు 'ఆ టైమ్‌లో ఇదీ వుంది' అని చెప్పడానికి మినహా మరెందుకూ అది పనికి రాకుండా పోయింది. ఒకటీ అరా నామ్‌ కే సన్నివేశాలు తప్ప దొరల పాలనలోని అకృత్యాలు, బీభత్సాల జోలికి కూడా పోయింది లేదు. ప్రేమకథపైనే ఫోకస్‌ పెట్టారులెమ్మని సరిపెట్టుకోవడానికి ఆ లవ్‌స్టోరీలోను డెప్త్‌ లేదు. ఎప్పుడయితే 'గడి'లో అమ్మాయి బందీగా చూపించారో ఈ లవ్‌స్టోరీని డెవలప్‌ చేయడానికి అక్కడే ముందరి కాళ్లకి బంధం వేసుకున్నారు. ఇద్దరి ప్రేమనే కాదు వారు పడుతోన్న కష్టాలని కూడా ప్రభావవంతంగా చూపించలేదు. ఈ కారణాల వల్ల పతాక సన్నివేశం కూడా తేలిపోయిందే తప్ప ఎలాంటి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయలేదు.

ఇక ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతారని భావించిన జంట విషయానికి వస్తే... శివాత్మికది ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌. ఈ పాత్రకి ఆమె బాగా సూటయింది. ఈ చిత్రానికి ఒకింత ప్లస్‌ కూడా అయింది. కానీ ఆనంద్‌ దేవరకొండ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. చేసిన పాత్రకి కాస్త నప్పాడేమో కానీ నటుడిగా మెప్పించలేకపోయాడు. దొరగా వినయ్‌ వర్మ బాగానే చేసాడు. కిషోర్‌, శరణ్య సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌ విహారి సంగీతం బోనస్‌ అయింది.

పాట వచ్చినపుడల్లా... పాటలు మాత్రమే వుంటే బాగుండనిపించేంత వీనుల విందుగా వుంది. కనీసం పాటలు ఎక్కువ పెట్టుకున్నా ప్రయోజనం వుండేది. ఛాయాగ్రాహకుడు కూడా పరిమిత వనరులతో ఇచ్చిన అవుట్‌పుట్‌ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్‌ డిజైన్‌కి కూడా మార్కులు పడతాయి. సంభాషణల్లో తేట తెలంగాణ నేపథ్యానికి బలం చేకూర్చింది. దర్శకుడు నేపథ్యానికి న్యాయం చేయడంలో సఫలీకృతుడైనా కానీ హృద్యమైన, స్వఛ్ఛమైన ప్రేమకథని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో మాత్రం విఫలమయ్యాడు. భావుకత చూపించడంలో సక్సెస్‌ అయినా కానీ భావోద్వేగాలు పలికించడంలో ఫెయిలయ్యాడు.

రెగ్యులర్‌ సినిమాల నడుమ ప్రత్యేకం అనిపించుకోవాల్సిన చిత్రం కాస్తా... ఎందుకు తీసారోనని కారణం వెతుక్కునేట్టు చేయడం బాధాకరం.

బాటమ్‌ లైన్‌: కష్టమే దొర్సానీ!
- గణేష్‌ రావూరి