''చారిత్రక తప్పిదం''.. అనగానే వెంటనే గుర్తుకు వచ్చే రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు). క్లుప్తంగా చెప్పుకోవాలంటే సీపీ(ఐ)ఎం. సాధారణంగా అందరూ సీపీఎం అంటారు. పశ్చిమ బెంగాల్లో రాజ్యసభ ఎన్నికలు ముగిసిపోయూయి. మొత్తం ఆరు స్థానాలుండగా అధికార తృణమూల్ కాంగ్రెసు ఐదు, ప్రతిపక్ష కాంగ్రెసు ఒకటి గెలుచుకున్నాయి. అన్నీ ఏకగ్రీవమే. కాంగ్రెసు తృణమూల్ కాంగ్రెసు (టీఎంసీ) మద్దతు కారణంగానే గెలిచింది. సీపీఎం బరిలో లేకపోవడంతో అన్ని సీట్లు ఏకగ్రీవమయ్యాయి. చివరకు 'ఎర్ర' పార్టీ ఊసే లేకుండా పోయింది. సీపీఎం అభ్యర్థి బికాస్ భట్టాచార్య నామినేషన్ చెల్లకుండాపోవడమే ఇందుకు కారణం. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఎన్నికలు చూశాక వామపక్షాల అభిమానులు, లౌకిక పార్టీల నేతలు చెబుతున్నది ఒకేమాట. ఏమిటది? 'మరో చారిత్రక తప్పిదం జరిగింది' అని.
ఏమిటది? భట్టాచార్య నామినేషన్ చెల్లకుండా పోవడమా? అదికాదు. ప్రభుత్వాన్ని నిలదీసే బలమైన గొంతుక, ప్రతిపక్షాల, ప్రధానంగా వామపక్షాల వాణిని గట్టిగా వినిపించే గొంతుక బలైందని అభిప్రాయపడుతున్నారు. ఆ గొంతుక పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరిది. ఆయన మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం వచ్చినా పార్టీ నిబంధనలు, సిద్ధాంతం పేరుతో పార్టీ కేంద్ర కమిటీ ససేమిరా అంటూ తిరస్కరించింది. పార్టీ పశ్చిమ బెంగాల్ యూనిట్ ఏచూరికి పూర్తి మద్దతు పలికినా వ్యతిరేక వర్గం బలంగా ఉండటంతో పని జరగలేదు. ఇప్పటికే రెండు టర్మ్‌లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఏచూరిని తాము మద్దతు ఇచ్చి రాజ్యసభకు పంపుతామని కాంగ్రెసు ప్రతిపాదించింది. పార్టీ నిబంధనావళి ప్రకారం ఏ సభ్యుడైనా రెండుసార్లకు మించి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు వీలులేదు. సీపీఎం ఏచూరిని నిలబెడితే మాత్రమే తాము మద్దతు ఇస్తామని, మరో సభ్యుడెవరైనా ఇవ్వబోమని కాంగ్రెసు స్పష్టం చేసింది. ఇందుకు సీపీఎం బెంగాల్ యూనిట్ అంగీకరించింది.
కాని ఏచూరి-మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ వర్గాల మధ్య ఉన్న విభేదాల కారణంగా సీపీఎం మంచి అవకాశం కోల్పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ నిబంధనావళి ప్రకారం చూస్తే ఏచూరిని మూడోసారి అభ్యర్థిగా ఎంపిక చేయకూడదు. కరెక్టే. అలాగే సిద్ధాంతపరంగా చూస్తే రాజకీయంగా శత్రువైన కాంగ్రెసు మద్దతు తీసుకోకూడదు. ఈ రెండు అంశాల మీద కరత్ వర్గం పట్టుబట్టిందట. కేంద్రకమిటీలో బెంగాల్ యూనిట్ ప్రతిపాదన 50-30 తేడాతో వీగిపోయింది. కాని బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ఓడించేందుకు కాంగ్రెసు, సీపీఎం పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. అప్పుడు మర్చిపోయిన సైద్ధాంతిక వైరం ఇప్పుడు గుర్తుకు వచ్చింది. నిబంధనావళి ప్రకారం ఏచూరిని రాజ్యసభకు పంపే అవకాశం లేనిమాట వాస్తవమే అయినా రాజ్యసభలో ఆయన మాదిరిగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనే నాయకుడు, వాదనా పటిమ గల నేత సీపీఎంలో లేరనేది ఎక్కువమంది అభిప్రాయం.
అందుకే నిబంధనావళిని పక్కకు పెడితే తప్పేమిటని పార్టీలోని కొందరు నాయకులు ప్రశ్నించారు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలన్నారు. సీపీఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా)కి అనుకూలంగా ఉండే ఓ పత్రికలో వచ్చిన విశ్లేషణ 'మరో చారిత్రక తప్పిదం జరిగింది' అని అభిప్రాయపడింది. జులై నెలలోనే పెద్ద తప్పులు అంటే చారిత్రక తప్పిదాలు చేయడం సీపీఎంకు అలవాటుగా మారిందని విశ్లేషకురాలు పేర్కొంది. బెంగాల్‌కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సీపీఎం దిగ్గజం జ్యోతిబసుకు ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కాని 1996 జులైలో ఆ ప్రతిపాదనను కేంద్ర కమిటీ తిరస్కరించింది. అప్పట్లో చారిత్రక తప్పిదం జరిగిందని మేధావులు సైతం అభిప్రాయపడ్డారు.
సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాని అయినంత మాత్రాన ప్రయోజనం లేదని కేంద్ర కమిటీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. భారత్-అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ-1 ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించుకుంది. ఇది 2008 జులైలో జరిగింది. ఈ మద్దతు ఉపసంహరణ తరువాతనే యూపీఏ సర్కారు (మన్మోహన్ ప్రధాని) అనేక అనుచిత నిర్ణయాలు తీసుకుంది. ఇదో తప్పిదంగా రాజకీయ పండితులు భావించారు. ఏచూరిని రాజ్యసభకు పంపకపోవడం మూడోది. ఈ నిర్ణయం కూడా గత నెలలో (జులై) తీసుకున్నదే. ఏది ఏమైనా రెండు టర్మ్‌లలో సీతారాం ఏచూరి రాజ్యసభలో సమర్థవంతమైన పాత్ర పోషించారు.