భూమా కుటుంబానికి అల్లుని స్ర్టోక్‌

ఎవ‌రైనా ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌ని పెద్దలు చెప్పారు. బ‌హుశా ఇంట గెల‌వ‌లేకే ర‌చ్చ కూడా ఆ మంత్రి గెల‌వ‌లేక మాజీగా మిగిలిపోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోర ప‌రాజ‌యం. ఈ ఓట‌మే ఇప్పుడా కుటుంబంలో చీలిక తెస్తోంద‌నే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇదంతా క‌ర్నూలుజిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న భూమా కుటుంబం గురించే. భూమా శోభ‌మ్మ మ‌ర‌ణానంత‌రం వారి ముద్దుల త‌న‌య అఖిల‌ప్రియ రాజ‌కీయ అరంగేట్రం చేశారు. తండ్రి భూమా నాగిరెడ్డి అడుగుజాడ‌ల్లో ఆమె ప్రయాణం చేస్తూ రాజ‌కీయ ఓన‌మాలు దిద్దుకుంటున్న స‌మ‌యంలో... తండ్రి ఆక‌స్మిక మ‌ర‌ణం ఆ కుటుంబానికి తీర‌ని శోకాన్ని మిగిల్చింది.

భూమా నాగిరెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి ఆయ‌న అన్న శేఖ‌ర్‌రెడ్డి కుమారుడు బ్రహ్మానంద‌రెడ్డి ఉప ఎన్నిక‌ల్లో పోటీచేసి విజ‌యం సాధించారు. భూమా నాగిరెడ్డి మృతితో అఖిల‌ప్రియ‌కు మంత్రి ప‌ద‌విని చంద్రబాబు క‌ట్టబెట్టారు. అఖిల‌ప్రియ మంత్రి అయిన త‌ర్వాత ఇటు కుటుంబ స‌భ్యులతోనూ, అటు నాగిరెడ్డి ముఖ్య అనుచ‌రుల‌తోనూ అఖిల‌ప్రియ‌కు స‌ఖ్యత కుద‌ర‌లేదు. ఈ నేప‌థ్యంలో గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో అఖిల‌ప్రియ 37వేల పైచిలుకు ఓట్ల తేడాతో గంగుల కుటుంబానికి చెందిన వైసీపీ అభ్యర్థి చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

ఈ నేప‌థ్యంలో క‌ర్నూలు జిల్లాలో ఒక్కసారి భూమా కుటుంబ రాజ‌కీయ ప్రస్థానాన్ని ప‌రిశీలిద్దాం. క‌ర్నూలు జిల్లా ఆళ్లగ‌డ్డకు చెందిన భూమా సోద‌రులు భూమా శేఖ‌ర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, నాగిరెడ్డి పేర్లు తెలియ‌ని వారు ఉండ‌రు. నంద్యాల పార్లమెంట్ రాజ‌కీయాల‌ను 40 ఏళ్లుగా ఆ కుటుంబం శాసిస్తోంది. ఆళ్లగ‌డ్డ అసెంబ్లీ, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థులుగా భూమా కుటుంబ స‌భ్యులే ఎక్కువకాలం కొన‌సాగుతూ వ‌స్తున్నారు. ఇప్పుడా కుటుంబంలో అఖిల‌ప్రియ భ‌ర్త మ‌ద్దూరి భార్గవ్ కార‌ణంగా స్పర్థలు ఏర్పడ్డాయ‌నే ప్రచారం బ‌లంగా సాగుతోంది.

చినికిచినికి గాలివాన‌గా మారిన‌ట్టు అఖిల‌ప్రియ భ‌ర్తకు భూమా భాస్కర్‌రెడ్డి కుమారుడు, మాజీ ఎంపీపీ కిషోర్‌రెడ్డికి మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయ‌ని స‌మాచారం. అన్నాచెల్లెళ్ల కుటుంబాల మ‌ధ్య తీవ్ర విభేదాల‌ను ప‌సిగ‌ట్టిన బీజేపీ త‌మవైపు కిషోర్‌ను లాక్కోవాల‌నే ప్రయ‌త్నాల‌ను తీవ్రత‌రం చేసింద‌ని స‌మాచారం. 1989లో భూమా శేఖ‌ర్‌రెడ్డి మొట్టమొద‌టి సారిగా ఆళ్లగ‌డ్డ నుంచి ప్రాతినిథ్యం వ‌హించారు. ఆ త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు 25 ఏళ్ల పాటు భూమా కుటుంబ స‌భ్యులే ఆళ్లగ‌డ్డ నుంచి గెలుపొందుతూ ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌మ కంచుకోట‌గా మార్చుకున్నారు.

అయితే మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో అఖిల‌ప్రియ భారీ మెజార్టీతో ఓడిపోయారు. దీనివెనుక కుటుంబ స‌భ్యుల స‌హాయ నిరాక‌ర‌ణ ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ముఖ్యంగా అఖిల‌ప్రియ భ‌ర్త భూమా అనుచ‌రుల‌తో పాటు బంధువుల‌ను కూడా దూరం పెట్టార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. భూమా వార‌సుడిగా భార్గవ్ ప్రచారం చేసుకుంటుండ‌టం నాగిరెడ్డి అనుచరుల‌కు, బంధువుల‌కు ఏమాత్రం మింగుడుప‌డ‌టం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. అఖిల‌ప్రియ భ‌ర్త పెత్తనాన్ని తాము స‌హించేది లేద‌ని భూమా అనుచ‌రులు, బంధువులు తెగేసి చెప్పార‌ని స‌మాచారం.

భూమా అనుచరులు, బంధువుల్లో నెల‌కున్న ఈ అసంతృప్తి, అస‌హ‌నం ఎంత తీవ్రస్థాయిలో ఉందో అఖిల‌ప్రియ ఓట‌మిని తెలియ‌జేస్తోంద‌ని ఆళ్లగ‌డ్డ టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అంతేకాకుండా భూమా నాగిరెడ్డి కుమారుడు జ‌గ‌త్‌ విఖ్యాత్‌రెడ్డి 2024లో పోటీ చేసేందుకు త‌గిన వ‌య‌స్సు లేక‌పోవ‌డం కూడా భార్గవ్ దూకుడుకు కార‌ణ‌మ‌ని వారు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో భూమా నాగిరెడ్డి రెండో అన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు కిషోర్‌రెడ్డిని త‌మ వార‌సుడిగా అనుచ‌రులు భావిస్తున్నార‌ని బంధువులు అంటున్నారు.

అందువ‌ల్లే అత‌న్ని ఆళ్లగ‌డ్డ రాజ‌కీయాల్లో నేరుగా దింపేందుకు అనుచ‌రులు, బంధువులు స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. దీంతో కిషోర్‌రెడ్డిపై బీజేపీ దృష్టిప‌డింది. కిషోర్‌రెడ్డితో బీజేపీ అగ్రశ్రేణి నాయ‌కులు చ‌ర్చలు జ‌రిపిన‌ట్టు స‌మాచారం. బీజేపీలో చేరి ఆళ్లగ‌డ్డ నుంచి పోటీకి ఇప్పటి నుంచే స‌మాయ‌త్తం అయ్యేందుకు కిషోర్‌రెడ్డి సిద్ధమైన‌ట్టు తెలిసింది. ఏది ఏమైనా పార్టీ ఏదైనా భూమా కుటుంబానికి పూర్వ వైభ‌వం తేవాలంటే అఖిల‌ప్రియ‌తో విభేదించ‌డం త‌ప్పద‌ని కిషోర్‌రెడ్డి స‌న్నిహితుల‌తో చెబుతున్నార‌ని స‌మాచారం. అన్నాచెల్లెళ్ల మ‌ధ్య విభేదాలు చివ‌రికి ఎక్కడికి దారి తీస్తాయోన‌ని క‌ర్నూలు జిల్లా ప్రజ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..