'అన్వేషణ' ముచ్చట్లు.. వంశీ అందంగా!

కేవలం తీతగాడే కాదు.. అందమైన రాతగాడు కూడా.. దర్శకుడు వంశీ గురించి సినీ అభిమానులకు ఈ విషయం గురించి చెప్పనక్కర్లేదు. తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ కలిగిన ఈ దర్శకుడు రాత విషయంలోనూ అంతకంటే ప్రత్యకమైన స్టైల్ కలిగిన వ్యక్తి. అలా తను అందంగా తీసిన సినిమాల గురించి.. ఆయనే అందంగా రాస్తే.. మరింత అందంగా ఉంటుంది. అందుకు తన ఫేస్ బుక్ పేజీని వేదికగా వాడుకొంటూ ఉంటారు వంశీ. అప్పుడప్పుడు తన సినీ అనుభవాలను ఫాలోయర్లకు వివరిస్తూ ఉంటారాయన.

ఆ పరంపరలో తాజాగా తన ‘అన్వేషణ’ సినిమా నాటి అనుభవాలను కొన్నింటిని వివరించారు. అందుకు సంబంధించిన పోస్ట్ ఇది. ఒకవేళ వంశీ ‘సితారా’, ‘అన్వేషణ’ల తర్వాత కామెడీ బాటకు రాకుండా.. అలాగే సీరియస్ రూటున సాగి ఉంటే, తెలుగు సినిమాకు మరిన్ని సినీమణిమాణిక్యాలు దక్కేవేమో. ఆ సంగతలా ఉంటే.. వంశీ ఫేస్ బుక్ పోస్టు ఇలా ఉంది.

'మద్రాస్ సెంట్రల్ స్టేషన్ ఐదో నెంబర్ ప్లాట్ ఫారం మీదున్న మధురై వెళ్లే రైలు, మేమెక్కిన కాసేపటికి నెమ్మదిగా కదిలి స్పీడందుకుంది.
అలా ఆ రైలు ఔటర్ సిగ్నల్ దాటేకా వాళ్లింట్లోంచి తెచ్చిన ఇడ్లీ పొట్లాల్లో ఒకటి నాకిచ్చి, ఇంకో పొట్లం తను విప్పుకున్నారు.
అన్వేషణ సినిమా మ్యూజిక్ కంపోజింగ్ కని మధురై వెళ్తున్నాం మేం.

స్పీడందుకున్న ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి సుళ్లు తిరుగుతా వస్తుంది చలిగాలి. ఆ గాలి వస్తున్న వేపే ఒకానొక తన్మయత్వంతో చూస్తున్న ఇళయరాజా చాలాసేపయ్యేకా తల తిప్పి నన్ను చూస్తా, ‘‘నీదంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ తయారుచేసుకోవడమే జరిగితే ఈ క్రియేటివ్ వరల్డ్ లో ఒకస్థానం నువ్వు సంపాదించుకున్నట్టే,’’ అన్నారు.

నిజమే... చెమ్మీన్ తీసిన రామూ కరియత్ కి వో స్టైలుంది. బాలూ మహేంద్రకి స్టైలుంది.వీళ్ళు సరే మన తెలుగులో వాళ్ళదంటూ వాళ్ళకో స్లైలున్న మహానుభావు లెంత మంది లేరూ...... 
ఆయన మ్యూజిక్ ఆరుబార్లు వింటే ఇది ఇళయరాజాది అని చంటి కుర్రోడు కూడా చెప్పేసేంత అద్భుతమైన స్టైలు ఇళయరాజా కుంది.

రాగాన్ని రమ్యంగా మెలికలు తిప్పడం, రిథమ్ పేట్రన్ని అద్భుతంగా చెయ్యడం లోనూ (ఉదాహరణకి, అమ్మ నీ తియ్యనీ దెబ్బ పాటకి చేసిన రిథమ్) వీణ, ఫ్లూటు, వయొలిన్ల స్కోర్ రాయడంలోనూ, ఎరేంజ్ మెంట్స్ లోనూ ఆయనదంటూ తిరుగులేని స్టైలు, ఎన్నేళ్ళనించో ఎంతోమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఆయన్ని కాపీకొడతా వస్తున్న అమోఘమైన స్టైలు తయారుచేసిన ఇళయరాజా అలా మాటాడ్తున్నారు.
ఆయన్లా ఒక ప్రత్యేకమైన స్టైలు తయారుచెయ్యడం నా జన్మకి కుదురుతుందా... కుదరడమే జరిగితే నేనో అద్బుతం చేసినట్టే గదా!!!
కిటికీలోంచి బయటికి చూస్తున్న ఆ కారణజన్ముడ్నే చూస్తా ఆలోచిస్తున్నాను.

ఆయన తన సంగీత సాధన బ్రహ్మమూర్తంలో ఎలా ప్రారంభించి ఎలా చేసేవారో ఇంకోసారి రాస్తాను, 
చిన్నప్పుడు వాళ్ల పణ్ణయపురంలో జరిగిన చాలా సంగతులు కాశీమజిలీ కథల్లా చెపుతుంటే చాలా రాత్రయిపోయింది.
తెల్లవారింది.

బెర్త్ మీంచి లేచి చూస్తే పక్కనే వున్న బెర్త్ మీద పడుకున్నాయన ఎప్పుడు లేచేరో రాత్రిలానే కిటికీలోంచి చూస్తున్నారు.
దూరంగా కనిపిస్తున్న కూలిపోయిన కోటగోడల్ని చూస్తున్నాయన ఏమను కుంటారో అని కూడా అనుకోకుండా, ‘‘ఏదన్నా కంపోజ్ చెయ్యొచ్చు కదా ఇప్పుడు ?’’ అన్నాను.
‘‘నా బెర్త్ కిందున్న హార్మోనియం పెట్టి బయటికి తియ్యి,’’ అన్నారు.
తీసి ఆయన ముందు పెట్టి అయిదు నిమిషాల్లో ఒక ట్యూన్ చేసి. "దీనికి ఇలాంటి సౌండొచ్చే వర్డ్స్ రాయించు కవిగారితో "అంటా తమిళంలో కొన్ని డూప్ వర్డ్స్ చెప్పేరు.

"అలాగే" అని తర్వాత మద్రాసొచ్చేకా ఇళయరాజా చెప్పిన సౌండొచ్చే పదాలే చెపితే మహానుభావుడు వేటూరిగారు,
ఏకాంత వేళా... కౌగిట్లో
ఏకాంత సేవ... ముచ్చట్లో
పడుచమ్మ దక్కే... దుప్పట్లో
దిండల్లే ఉండూ... నిద్దట్లో
కవ్వింతగా ఒళ్లు తుళ్లింతగా
మల్లెపూవుల్లొ తావల్లె కన్నుల్లొ వెన్నెల్లై
అన్న పల్లవి,తర్వాత చరణాలూ రాసేసి రికార్డింగప్పుడు ఉండటానికి టైమ్ లేక, విజయా గార్డెన్ నించి చక్రవర్తి గారు ఫోన్ చేస్తే బయల్దేరెళ్ళి పోయేరు.
సరే.... వెనక్కొస్తున్నాను.

మధురైలో "హోటల్ తమిళ్నాడు" అనే తమిళ్నాడుటూరిజం వాళ్ళ హోటల్లో దిగేం. సెంటిమెంటంట ఆ హోటల్లో క్వీన్ సూట్ లో దిగినాయన .గంట తర్వాత ఇన్ ఛార్జ్ కళ్యాణంతో నన్ను రమ్మని కబురు చేసేరు.
ఆయన ముందు కూర్చుని నా నోటికొచ్చిన సిట్యుయేషనేదో చెపితే ఒక కొత్తరకం పాట కంపోజ్ చేసేరు.
తర్వాత మద్రాసొచ్చేకా రికార్డింగ్ అయిన," ఎదలో లయ... ఎగసే లయ... "అన్న ఆ పాట విన్న ప్రొడ్యూసర్ కోవైతంబి గారు అచ్చం అలాంటి పాటే రాజాగారితో చేయించుకుని అచ్చం అలాగే పిక్చరైజ్ చెయ్యాలని గొడవ చేసేడు వాళ్ల డైరెక్టరయిన మణిరత్నంగారితో. మళ్లీ వెనక్కొస్తున్నాను.

ఆయనో గంట దొరికితే చాలు అనుకొనే ఆ బిజీ రోజుల్లో నా అన్వేషణ సినిమా మ్యూజిక్ కంపోజింగ్ కి రాజాగారి ఇన్ ఛార్జ్ కళ్యాణంతో గొడవపడి మూడు రోజులు సంపాదించేను.
కానీ, ఈయన మొదలెట్టిన మూడు గంటల్లో మొత్తం పాటల కంపోజింగ్ అయిపోయింది.

‘మిగిలిపోయిన టైంలో ఏం చెయ్యాలీ?’ అనుకుంటుండగా, "నాతో పాటు రా" అంటా ఆ మధురై చుట్టుపక్కల వూళ్లల్లో ఉన్న గుళ్లకి తిరగడం మొదలెడ్తే ఆయనవెనకాల నేను.
లంచ్ టైములో, ‘‘నల్లముత్తు పిళ్లై రోడ్ కెళ్లే దారిలో ఒక హోటలుంటుంది. తిరునల్వేలి హల్వా అక్కడ బాగుంటుంది, కృష్ణపాళయం సెకండ్ స్ట్రీట్ మలుపులో ఒక బిల్డింగ్ బేస్ మెంట్లో వుండే నాన్ వెజ్ హోటల్లో బిర్యానీ బాగుంటుంది, వెళ్లి తిను,’’ అంటా తనకి కొట్టిన పిండైన మధురై నగరంలో ఎక్కడ ఏమేం దొరుకుతాయో, తను అన్నీ తినే రోజుల్లో ఎక్కడ ఏమేం తిన్నారో చెప్తుంటే వింటా వుండిపోయేను.
మర్నాడు పొద్దుట మీనాక్షి గుళ్లోకెళ్తే ఫారినర్స్ కి తిప్పి చూపిస్తా గైడ్లు. గుడి మొత్తం తీరిగ్గా తిరిగి చూడాలంటే మినిమమ్ మూడురోజులు పడ్తుందటా ఆ విదేశీయులకి చెప్తున్నారు.

దర్శనం తర్వాత ఇళయరాజాగారి ఊరు పణ్ణయపురం బయల్దేరేం.
కొండ అంచునున్న చిన్న గ్రామం ఆ పణ్ణయపురం. ఆ కొండకి అటుపక్కకి దిగితే కేరళ.
రోడ్డు పక్కనే చిన్న చర్చి. దానిపక్కనే చిన్న ఇల్లు. అది రాజాగారికి పిల్లనిచ్చిన అక్కయ్యగారిది.

ఊళ్లోకెళ్లాం. గోపీచందనం రంగేసి ఖాళీగా వున్న ఆ చిన్న డాబా యింటిని చూపిస్తా, ఒకప్పుడిది చిన్ని పెంకుటిల్లు. నేను మ్యూజిక్ డైరెక్టరయ్యేకా అది పడగొట్టి ఈ డాబా కట్టారు మావాళ్లు,’’ అన్నారు.
ఐతే ఇంత గొప్ప ఇళయరాజాగారు పుట్టిన ఊరా ఇది, చదివిన స్కూలా ఇది, కలతిరిగిన వీధులా ఇవీ అనుకుంటా కలతిరగబోతున్న నన్నాపి, ‘‘కారెక్కు,’’ అన్నారు.

అక్కడ్నించి రకరకాల పల్లెటూళ్లు దాటుకుంటా వెళ్తుంటే కంకర రోడ్డు పక్కనే పెద్ద నిద్రగన్నేరు చెట్టు, దాని పక్కనే చిన్న బ్రిడ్జి. కారు ఆపమని దిగి, ఆ బ్రిడ్జి దగ్గర కెళ్తా, ‘‘ఈ బ్రిడ్జిమీద కూర్చునే నేనూ మీ గురువు భారతీరాజా సాయంత్రాలప్పుడు చాలా కబుర్లు చెప్పుకునే వాళ్లం,’’ అంటా ఆనాటి సంగతుల్ని నెమరేసుకుంటున్నారు.

అచ్చమైన స్వచ్ఛమైన చిన్ని చిన్ని ఆ తమిళనాడు గ్రామాలు అందమైన తమిళం మాటాడుకుంటున్న జనం మధ్యలో వెళ్తుంటే ఇళయరాజాగారు చెప్తున్నారు.
వాళ్లు మొత్తం నలుగురు అన్నదమ్ములు. పెద్దాయన పేరు పావలర్ వరద రాజన్, రెండో ఆయన భాస్కర్, మూడు తను, నాలుగు అమర్ సింగ్ అనే ఇప్పటి గంగై అమరన్.

కమ్యూనిస్ట్ అయిన అన్న పావలర్ గారు మిగతా ముగ్గురు తమ్ముళ్లతో ఊళ్లు తిరుగుతా సినిమా పాటలకి కమ్యూనిస్ట్ సాహిత్యం చేర్చి పాడుకుంటా కచేరీలు ఇస్తున్న ఆ టైములో అక్కడే వున్న అల్లినగరం అనే పల్లటూరి మనిషైన భారతీరాజా పరిచయమయ్యేరు.

భారతీరాజాగారు డైరెక్ట్ చేసే నాటకాలకి ఇళయరాజాగారు మ్యూజిక్ చేసేవారు. ఆయనలా చెప్పుకుంటా పోతున్నారు... కారు కంకరబాటలూ మట్టిబాటలూ దాటుకుంటా పోతుంటే శీతాకాలం సూర్యుడు అస్తమిస్తున్నాడు. చలిగాలి, బాగా చల్లగా వీస్తుంది. చీకటి చిక్కగా మూసుకుంటుంది.

అసలాయన మద్రాసు ఎలా వెళ్లాడు? ఆరంభంలో అక్కడ ఎలాంటి అవస్థలు పడ్డాడు? తండ్రి రాజయ్య అని పెట్టిన పేరు ఇళయరాజా ఎలా అయ్యిందీ? ఆయనకి మొట్టమొదటి మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఎలా వచ్చిందీ? ఒక సాదాసీదా ఇళయరాజా ఇంత గొప్పోడవడానికి వెనకాల రహస్యమేంటీ? ఇలా నాలో నేను ప్రశ్నలేసుకుంటా పోతున్నాను.
ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే ఇపుడో ఎపుడో ఆయన్నే అడగాలనుకుంటుండగా. ఆ చీకట్లో నూటయాభై కిలోమీటర్లు ప్రయాణం చేసిన మా కారు మేం స్టే చేసిన "హోటల్ తమిళ్నాడు" ముందాగింది.

* * *
ఈ సినిమా కధ ఔట్ లైన్ దశలోనే ఉండగా పాటలు చేయించుకోడం జరిగింది.ఒక రకంగా పాటలు పక్కన పెట్టుకుని కధ అల్లుకోవాల్సిన సంక్లిష్టమైన పరిస్థితి నాది.అది ఏర్పడ్డానికి దాని వెనకాలో గమ్మత్తయిన కధ.
చాలా మంది రైటర్లు ఈరకం కధ మా వల్లగాదని వెళ్ళి పోయేరు.దాంతో నేనొక్కడ్నే ప్రొడక్షవానాఫీసులో కూర్చుని రాత్రీపగలనక అవస్థలు పడ్తున్నాను.
షూటింగ్ డేస్ దగ్గర పడ్డంతో టెన్షన్ పెరిగి పోతున్న నిర్మాతలు నా దగ్గర కొచ్చి నన్ను చూసి మాటాడలేకపోతున్నారు.

ఇంతలో ఇందిరాగాంధీ చని పోవడం ,షూటింగులన్నీ ఆగిపోడం .నాకో ఎడ్వాంటేజయ్యింది.
రాత్రీపగలూ అవస్థపడతా వెనకటికొచ్చిన వెండితెరనవల లాగ రాసిన కధచెప్పమన్న వాళ్ళకి నవలిచ్చేసి చదూకోమంటన్నాను.
* * *
తలకోన అడవుల్లో షూటింగ్.
షూటింగ్ డేస్ నలభై రోజుల పైనే.
అయ్యాకా రాయపేటలో ఉన్న మద్రాస్ సినీలేబ్ లో ఎడిటింగ్,ఎగ్మూర్ మ్యూజియం ఎదురు గుండా ఉన్న బాలాజీ దియేటర్ లో డబ్బింగ్.

* * *
రీరికార్డింగ్ కి రెడీ అయిన డబుల్ పాజిటివ్ ని ఆయన పద్దతి ప్రకారం చూసిన ఇళయరాజా గారు"మొత్తమంతా మ్యూజిక్కే ....ఇంగ్లీష్ సినిమాలాగుంది.అనేటప్పటికి ఆనందంతో నిద్రపట్టలేదారాత్రి.
ప్రసాద్ డీలక్స్ లో రీరికార్డింగ్ జరుగుతున్న టైములో ఒక ఫారినర్ వచ్చి ఒక రీల్ కి చేస్తున్న రీరికార్డింగ్ మొత్తం చూసేడు.అతనేదో ఇంగ్లీషు మేగజైన్ కి సంబంధించినోడను కుంటాను.ఇళయరాజాగారు పనిచేసే స్టైలు చూస్తా ఫొటోలు తీసుకుంటా తెగ రాసేసుకుంటున్నాడు.
రీల్ చూడ్డానికి పది నిమిషాలు.

ఓ పక్కనించి నోట్సు రాసుకుటానే,మ్యూజిషియన్స్ కి డిక్టేట్ చెయ్యడానికి గంట.
ఆ మ్యూజీషియన్స్ రిహార్సల్స్ చేసేక రీల్ రన్నింగ్ టైమ్ లోనే మోనిటర్ చూస్తా కరక్షన్స్ చెప్పడానికి పదిహేను నిమిషాలు.
ఫుల్ రీల్ టేక్ చెయ్యడానికి దాని రన్నింగ్ టైమే పది నిమిషాలు.
అటుగా ఇటుగా మొత్తంగా చూసుకుంటే మొత్తం గంటన్నరలో మొత్తం రీల్ మ్యూజిక్ చేసిన ఇళయరాజాని 
చూసి షాక్.....ఇంత తక్కువ టైములో ఇంత హెవీవర్కు??? ప్రతీ బార్లోనూ ఇంత క్రియేటివిటీ!!!

షాకయి పోతా అతనలా అంటుంటే విన్న వయొలినిస్ట్ నరసింహన్ గారు"ఈ రీల్స్ లో మ్యూజిక్ ఫుల్ గా వుంది గాబట్టి ఇంత
టైము.లేకపోతే ఒక రీలు మ్యూజిక్ కి ఆయన తీసుకునే టైము కేవలం నలభై అయిదు నిమిషాలే"అనేటప్పటికి మూర్చొచ్చి పడి పోయేడా
ఫారినర్.

ఇంతకీ ఎవరా మనిషి ? అని ఎంక్వైరీ చెస్తే...... ది గ్రేట్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ మేగజైన్ సౌండ్ అండ్ సైట్ తాలూకు 
రిపోర్టరంట. ఏసినిమా అయినా సరే నాలుగు సెవెన్ టూ నైన్ కాల్ షీట్స్ లో రీరికార్గింగ్ ఫినిష్ చేసే రాజాగారు,ఈసినిమాకి సెవెన్ సెవెన్ టూ నైన్ లు పని చేసినా టైటిల్స్ మిగిలి పోయినియ్యి.

* * *
సిన్మా ఫస్ట్ కాపీ అదే ఫైనల్ ప్రోడక్ట్ బయటి కొచ్చింది. దాన్ని చూసిన రామోజీరావు గారు నచ్చలేదని ,ఎందుకు నచ్చలేదో రీజన్స్ చెప్పేరు.చాలా సబబుగా చెప్పేరాయన అనిపిచింది. నీ టెక్నిక్ తో మాయ చేసేవు తప్ప సినిమాలో ఏం లేదన్నారు వేమూరి సత్యనారాయణగారు. ఏడిద నాగేశ్వర్రావుగారింట్లో ఎవరికీ నచ్చలేదు.నా మీద నిత్యం వాత్సల్యం కురిపించే నాగేశ్వర్రావుగారి భార్య జయగారు "సితార తీసిన నువ్వేనా ఈ పిచ్చి
సినేమా తీసిందీ..." అంటా మందలించేరు.

బోరు కొట్టిందన్నారు కొంత మంది.

అర్ధం కాలేదన్నారు కొంత మంది.

అండర్ ప్రొడక్షన్ లోనే మొత్తం సినిమా కొన్న బయ్యర్లైతే ఏం చెయ్యాలా అని అటూ ఇటూ వూగు తున్నారు.

మొత్తానికి రిలీజైన అన్వేషణ సినిమా హిట్టైంది.హైదరాబాద్ దేవి దియేటర్లో వందరోజులాడింది.

అప్పటికింకా సినిమా ఫీల్డుకి రాని రామ్ గోపాల్ వర్మ,తన రూమ్మేట్ సుబ్రమణ్యంతో కలిసి ఇరవై రెండు సార్లు చూసేరం. ఆయన సినిమాని మెచ్చుకున్నందుకు ఆనందపడ్డా,కొంత మంది ప్రముఖులకి ఎందుకు నచ్చలేదో అన్న ఆలోచనలో పడ్డాను.'

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

Show comments