సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రకరకాల రూమర్లు ప్రచారంలో ఉంటాయి. ప్రత్యేకించి హీరోయిన్లను సినిమా ఛాన్సుల విషయంలో అయితే ఈ రూమర్లకు హద్దు ఉండదు. చదువుకున్న వాళ్లు, చదుకోని వాళ్లతో సంబంధం లేకుండా.. ఇలాంటి వ్యవహారాలపై బోలెడంత ఆసక్తి. ఎవరికి తెలిసిన విషయాలనూ, ఎవరు విన్న విషయాలను వారు చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి అంశాలు ప్రజల మధ్య చర్చల్లో ఉన్నవే!
ఇలాంటి రూమర్ల విషయంలో వినిపించే మాట కొన్ని సినిమాల రూపకర్తలు హీరోయిన్లతో రకరకాల అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకుంటారనేది! ఈ అగ్రిమెంట్లకు రకరకాల అర్థాలు వినిపిస్తూ ఉంటాయి కూడా! అసలు అలాంటి కమిట్మెంట్లు సాధ్యమా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అయితే ఇవి వినడానికి, చెప్పుకోవడానికి రసవత్తరంగా ఉంటాయి కాబట్టి, జనాలు కూడా వీటి విషయంలో లాజిక్ లను వెదకరు.
ఆ సంగతలా ఉంటే.. బాలీవుడ్ సినిమాల విషయంలో ప్రచారంలో ఉన్న మరో అంశం నో డేటింగ్ క్లాజ్. కొత్తమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలను ఇచ్చే బడా ఫిల్మ్ మేకర్లు ఆ హీరోయిన్లతో నో డేటింగ్ క్లాజ్ తో సంతకాలు పెట్టించుకుంటారట. దాని అర్థం ఏమిటంటే.. తమ సినిమాకు పని చేస్తున్నంత వరకూ వేరే వాళ్లతో డేటింగ్ చేస్తూ వార్తల్లోకి రాకూడదు! సినిమాకు సైన్ చేసేటప్పుడే అమ్మాయిల నుంచి ఈ మేరకు వారు సంతకాలు పెట్టించుకుంటారనే మాట వినిపిస్తూ ఉంటుంది.
నిధీ అగర్వాల్ కూడా ఇలాంటి సంతకం పెట్టిన హీరోయినే అనేది ఆసక్తిదాయకమైన అంశం. ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్న నిధీ .. ఐదేళ్ల కిందట బాలీవుడ్ సినిమా మున్నా మైఖేల్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఆ సినిమా సమయంలో నిధి నో డేటింగ్ క్లాజ్ మీద సంతకం పెట్టిందట.
ఈ విషయం గురించి ఆమెను అడిగితే, తను పెట్టే ఉండవచ్చని అంటోంది. ఆ సమయంలో తను హీరోయిన్ అయిపోతున్న ఆనందంలో ఉన్నట్టుగా, దాని కోసం అగ్రిమెంట్లపై సంతకాలు పెట్టినప్పుడు అందులో ఏమున్నది కూడా చదుకోవడం కూడా తనకు ఆసక్తి లేని అంశమని నిధి అంటోంది.
అప్పటికే టైగర్ ష్రాఫ్ గుర్తింపు కలిగిన బాలీవుడ్ యంగ్ హీరో. నిధికి ఆ అవకాశం గొప్పదిగా అనిపించి ఉండవచ్చు. అందుకే తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అంశాలపై కూడా ఈ మేరకు సంతకం పెట్టిందేమో! ఆమె సంతకం పెట్టడం ఎలా ఉన్నా.. బాలీవుడ్ లో ఉన్న సినిమాల అగ్రిమెంట్ల వెనుక ఉండే షరతుల అంశం చర్చలో నిలుస్తోంది.