విడాకులకు గడువు ఎప్పుడు?

రాజ్యసభలో ప్రత్యేక హోదా నాటకం ముగిసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనూ సామాన్య  ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో, మీడియాలో ఒకే ప్రశ్న మెదులుతోంది. ఏమిటది? బీజేపీ-టీడీపీ బంధం ఎప్పుడు తెగిపోతుంది? విడాకులకు గడువు ఎప్పుడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంపై, బీజేపీపైనా నిప్పులు చెరుగుతున్నారని, బంధం తెంచుకునే దిశగా సంకేతాలు ఇస్తున్నారన వార్తలు వస్తుండటంతో ఆ పని ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. మరోలా చెప్పాలంటే రాజకీయ పార్టీలకు, మీడియాకు ఉత్కంఠగా ఉంది. 

ఆ రెండు పార్టీల బంధం తెగిపోతే అది కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, జాతీయ రాజకీయాలనే ప్రభావితం చేస్తుందనడంలో అతిశయోక్తిలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, కేంద్రం అరకొర సాయం చేస్తున్నా చంద్రబాబు కేంద్రానికి ఇంకా లొంగి ఉన్నప్పటికీ, విడిపోయాక మాత్రం ఆ ప్రభావం రాష్ట్ర, దేశ రాజకీయాల మీద పడుతుంది. చంద్రబాబు కేంద్రానికి భయపడుతున్నాడని విమర్శలు వస్తున్నప్పటికీ రాజకీయంగా టీడీపీ బలమైందనడంలో సందేహం లేదు. కాబట్టి రెండు పార్టీలు విడిపోవడమంటూ జరిగితే మోదీకి వ్యతిరేకంగా రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిసామర్థ్యాలు బాబుకు ఉన్నాయి. 

ఇప్పటికే బాబుకు 'పిరికివాడు' అనే పేరు వచ్చేసింది. దాన్ని నిజం చేస్తాడని అనుకోలేం. రాజ్యసభలో చర్చ తరువాత ఏపీలోని దాదాపు అన్ని ప్రతిపక్షాలు 'బంధం తెంచుకో' అని బాబును కోరుతున్నాయి. అవి అలా కోరుకోవడంలో వాటి రాజకీయ ప్రయోజనాలు వాటికున్నాయి. రాజ్యసభ నాటకం తరువాత బీజేపీతో బంధం తెంపుకున్నట్లు చంద్రబాబు ప్రకటిస్తారని ఆశించామని, కాని ఆయన ఎన్‌డీఏలోనే కొనసాగుతానని అంటున్నారని వైకాపా అధినేత జగన్‌ అన్నారు. చర్చ ముగిసిన తెల్లవారే బంధం తెంపుకోవాలని బాబు ప్రకటన చేయాలనుకోవడం సమంజసం కాదు. బాబు స్థానంలో జగన్‌ ఉన్నా అలాంటి ప్రకటన చేయడు. 

చంద్రబాబు మూర్ఖుడు కాదు. రాజకీయ చతురుడు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాని నిర్ణయించుకుంటే అందుకు సమయం, సందర్భం ఉంటాయి. అన్ని కోణాల్లో ఆలోచించుకోవాలి. రాజ్యసభలో చర్చ తరువాత మీడియాలో వచ్చిన వార్తా కథనాలను పరిశీలిస్తే బీజేపీతో విడిపోకపోతే చంద్రబాబుకు ప్రమాదమని విశ్లేషకులు హెచ్చరించారు. ఇప్పుడు ఇందుకు సమయం వచ్చిందని ప్రతిపక్ష నాయకులు సలహా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు గమనించాక బాబు ఓ నిర్ణయానికి రావొచ్చని ఓ పత్రిక రాసింది. 'అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేలుపు, మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయుగదరా సుమతీ' అనే పద్యం బాబుకు బాగా తెలుసు. 

బీజేపీ కారణంగా తాను మునిగిపోయే పరిస్థితి వస్తుందని తెలిస్తే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయడు. గతంలో ఆయన కమ్యూనిస్టులతో, కాషాయదళంతో స్నేహం కలుపుకొని సమయానుకూలంగా వదిలేసిన సందర్భాలున్నాయి. హోదాపై ఇంత రచ్చ జరిగాక వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసే పోటీ చేయాలని, స్నేహం కొనసాగించాలని బాబు అనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా, టీడీపీతో కలిసి బరిలోకి దిగినా దానికి భవిష్యత్తు లేదనే అభిప్రాయం బలంగా వినబడుతోంది. 

టీడీపీతో బంధం తెంపుకొని ఒంటరిగా పోటీ చేస్తే అది కాంగ్రెసు మాదిరిగానే అడ్రసు లేకుండా పోతుంది. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే కాషాయంతో కలిసి 'పచ్చ' పార్టీ కూడా మునిగిపోయే ప్రమాదముంది. బీజేపీతో విడిపోయే అవకాశం ఉన్నట్లు చంద్రబాబు ఈ ఏడాది మే నెలలో ఓ సందర్భంలో సంకేతాలిచ్చారు. మేలో ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశమైనప్పుడు చంద్రబాబు తాడోపేడో తేల్చుకోబోతున్నారని, హోదా అంశం ఫైనల్స్‌కు వచ్చిందని పచ్చ పార్టీ అనుకూల పత్రిక రాసింది. కేంద్రంలో చాలా హాట్‌హాట్‌గా చర్చలు జరిగాయని, ప్రత్యేక హోదాను తప్ప మరే ప్రత్యామ్నాయం తాను అంగీకరించనని బాబు చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. 

దీంతో ఏపీ బీజేపీ నేతలు టీడీపీపై విరుచుకుపడ్డారు. కాషాయ నాయకుడు సోము వీర్రాజు రెచ్చిపోయి కేంద్రానికి అమరావతి అయినా అనకాపల్లి అయినా ఒక్కటేనని, భారీగా నిధులిచ్చే ప్రసక్తే లేదని అన్నారు. అప్పట్లో వాతావరణం వేడెక్కినప్పటికీ ఆ తరువాత చల్లారిపోయింది. ఇప్పుడు కేవీపీ ప్రయివేటు మెంబర్‌ బిల్లు కారణంగా మళ్లీ వేడెక్కింది. ఈ వేడి కారణంగా మిత్రత్వం మటాష్‌ అవుతుందా? చల్లారిపోతుందా? అనేది తేలిపోవడానికి ఎక్కువకాలం పట్టకపోవచ్చు. 

Show comments