నా కెరీర్ లో అతి చెత్త సినిమాలివే

సింపుల్ గా ఉండడం, ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం నాగచైతన్యకు అలవాటు. ఈసారి కూడా అలానే మాట్లాడాడు. బయటకు చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ చాలా విషయాల్ని బయటపెట్టాడు. ఎలాంటి భేషజాలు లేకుండా ఉండే ఈ హీరో తన కెరీర్ లో అతిచెత్త సినిమాలు, తన మనసుకు నచ్చిన సినిమాల గురించి ప్రస్తావించాడు.

"నా కెరీర్ లో నాకు బాగా ఆనందాన్నిచ్చిన సినిమా ప్రేమమ్. నా మనసుకు బాగా నచ్చిన సినిమా ఇది. ఆ సినిమా చేయొద్దని చాలామంది చెప్పారు. అది వర్కవుట్ కాదన్నారు. కానీ ఎందుకో అది నాకు నచ్చింది. ఎంతమంది వద్దన్నా ఆ సినిమా చేయాలనిపించింది. అందుకే చేశాను. అది నాకు బాగా తృప్తినిచ్చింది. ప్రేమమ్ తర్వాత మనం సినిమా నచ్చింది."

ఇక నచ్చని సినిమాల విషయానికొస్తే దడ, బెజవాడ సినిమాలు ది బెస్ట్ చెత్త సినిమాలన్నాడు చైతూ. ఎలాంటి సినిమాలు చేయకూడదో వాటిని చూసి నేర్చుకున్నానని తెలిపాడు.

"నా కెరీర్ లో నాకు నచ్చని సినిమాలు దడ, బెజవాడ. నాకు అవి చేదు జ్ఞాపకాలు. అలా అని ఈ సినిమాల విషయంలో నేను ఎవర్నీ వేలెత్తిచూపడం లేదు. నా జడ్జిమెంట్ లోపాలు కూడా ఉన్నాయి కదా. కెరీర్ లో ఏం చేయకూడదో ఆ సినిమాల నుంచి నేర్చుకున్నాను." 

ఇక స్టోరీ సెలక్షన్ విషయానికొస్తే ఒకప్పట్లా తన తండ్రి నాగార్జునపై ఆధారపడడం మానేశానని అంటున్నాడు చైతూ. కేవలం నాగ్ ను ఎడిట్ రూమ్ కే పరిమితం చేసినట్టు స్పష్టంచేశాడు. అప్పుడప్పుడు సమంత సలహాలు మాత్రం తీసుకుంటానని చెప్పాడు.

"స్టోరీ సెలక్షన్ లో నాన్న మీద డిపెండ్ అవ్వడంలేదు. ఇప్పుడు నా స్టోరీలు నేనే వింటున్నాను. నా కెరీర్ స్టార్టింగ్ లో నా కథలు ఆయన వినేవారు. కానీ గడిచిన 4-5 సినిమాల నుంచి అన్నీ నా నిర్ణయాలే. ఎడిటింగ్ టైమ్ కు మాత్రం నాన్నను తీసుకొస్తున్నాను. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకర్ని నమ్మాలి కదా.

అవుట్ పుట్ పై అభిప్రాయం చెప్పడానికి బయట వ్యక్తి అయితే బెటర్. ఈ విషయంలో నేను నాన్నను నమ్ముతాను. నిజాయితీగా అభిప్రాయం చెబుతారు. నాన్న తర్వాత జడ్జిమెంట్ విషయంలో నేను సమంతను ఎక్కువగా నమ్ముతాను." 

చెత్త సినిమాలే కాదు, చెత్త ట్రోలింగ్స్ కు సంబంధించి కూడా అంతే సూటిగా రియాక్ట్ అయ్యాడు చైతూ. సోషల్ మీడియాలో తన అభిమానులే తనని ట్రోల్ చేస్తుంటారని, వాళ్లు ఏం చెప్పినా అది తన మంచి కోసమే చెబుతారని, వాళ్లు తిట్టినా అందులో ప్రేమ ఉంటుందని అంటున్నాడు. అందుకే నెగెటివ్ కామెంట్స్ కూడా చదివి తనను తాను మార్చుకుంటానని అంటున్నాడు.

నాగచైతన్య ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి 

RELATED చంద్ర పోటు: నొప్పి తెలిసిందా పవన్‌.?