టాలీవుడ్‌ అంకెల గారడీ..!

అతివేగంగా యాభైకోట్లకు పైగా గ్రాస్‌ సాధించింది కాటమరాయుడు. 28కోట్ల మేరకు తొలిరోజు కలెక్షన్లు కాటమరాయుడుకు. ఇదీ అభిమానుల మాట. వాట్సప్‌, ఫేస్‌ బుక్‌, ట్విట్టర్లలో మోత. కానీ అసలు తెలుగు సినిమాలు తొలిరోజు వసూళ్లు మర్మం ఏమిటి? వాటి వైనం ఏమిటి? దాదాపు పెద్ద సినిమాలు అన్నింటికీ తొలిరోజు ఇదే హడావుడి వుంటుంది. కానీ తరువాత తరువాత డిజా స్టర్లుగా ఎందుకు మిగిలిపోతున్నాయి.

కాటమరాయుడు వ్యవహారమే తీసుకుందాం. తొలిరోజు 28కోట్ల వరకు షేర్‌ వచ్చేసింది అంటున్నారు. థియేటర్ల రైట్స్‌ అమ్మకాలు ఏపీ తెలంగాణల్లో 65కోట్ల మేరకు సాగించారు. తొలిరోజు వసూళ్లు ఏపీ తెలంగాణల్లో 23కోట్ల మేరకు వచ్చాయంటున్నారు. శని, ఆదివారం ముఫై నాలుగుకోట్లు వచ్చాయంటున్నారు. మరి కొంతమంది మరో అడుగు ముందుకు వేసి వందకోట్ల గ్రాస్‌ వచ్చేసిందని ట్వీట్‌లు చేస్తున్నారు. అంటే సగానికి సగం మూడురోజుల్లో వచ్చేసినట్లేనా?

ఏ సినిమా అయినా సరే, తొలిరోజు ఫిగర్‌కు, మలిరోజు ఫిగర్‌కు దోమకు, ఏనుగుకు వున్నంత తేడా వుంటుంది. ఎందుకు? అక్కడే వుంది అసలు కిటుకు. మన హీరోల అభిమానులైతేనేం, సినిమాను ప్రమోట్‌ చేయాల నుకున్నవారయితేనేం, నిర్మాతలయితేనేం, తొలిరోజు కలెక్షన్లు మసిపూసి మారేడుకాయ చేయడం అన్నది ఏనాడో ప్రారంభించేసారు. తొలిరోజు కలెక్షన్లలో, సినిమా హైప్‌ చూపించి, జిల్లాల వారీ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల వాళ్ల దగ్గర నుంచి సంపాదించిన ఫిక్స్‌డ్‌ హైర్‌లు, అడ్వాన్స్‌లు, లేదా రిటర్న్‌ బుల్‌ హైర్‌లు కూడా వుంటాయి. అంతేకాదు, లోకల్‌గా థియేటర్ల వారీ, ఊళ్ల వారీ జరిపిన అమ్మకాలు కూడా తొలిరోజు ఫిగర్‌లోనే వుంటాయి. అంటే తొలిరోజు చూసిన జనాలు ఇచ్చిన టికెట్‌ల కలెక్షన్‌ మాత్రమే ఇదికాదు. చాలా చాలా కలిపి. ఇది కాటమ రాయుడుకే కాదు. అన్ని సినిమాలకు ఇంతే.

అన్నీ కలిపితేనే..

ఉదాహరణకి ఈస్ట్‌ గోదావరి తొలిరోజు కాటమరాయుడుకి 3.56కోట్లు వచ్చిందని, ఇది రికార్డు అని చెబుతున్నారు. ఇందులో ఫిక్స్‌డ్‌ హైర్‌లు, అడ్వాన్స్‌లు, లోకల్‌ అమ్మకాలు పక్కకు తీస్తే, మిగిలినదే తొలిరోజు కలెక్షన్‌. పోనీ టోటల్‌గా సినిమా ఆడుతుంది. అప్పుడయినా ఇవన్నీ కలపాలి కదా? టోటల్‌ ఫిగర్‌లోకి ఇవన్నీ చేరేవే కదా అని అనుకుందాం. అయితే కాటమరాయుడు ఇదే జిల్లాకు అయిదుకోట్లకు దగ్గరలో కొన్నారు. అంటే ఫస్ట్‌ డేనే 3.56 వచ్చిందంటే, రెండో రోజుకే బయ్యర్‌ లాభాల బాట పట్టేయాలి. కానీ బయ్యర్‌ను అలా చెప్పమంటే ఎలా చెబుతారు? చెప్పరు. ఎందుకంటే ఇందులో థియేటర్‌ అడ్వాన్స్‌లు అనేవి బయ్యర్‌కు అప్పేకానీ, వచ్చిపడిపోయిన ఆదాయంకాదు. సినిమా హిట్‌ అయి తీసుకున్న అడ్వాన్స్‌ల మేరకు ఆడితే అప్పుడు ఆ అప్పు కాస్తా, ఆదాయంగా మారుతుంది. లేదూ అంటే వెనక్కు ఇచ్చుకోవాల్సిందే. ఫిక్స్‌డ్‌ హైర్‌లు అయితే వెనక్కు ఇవ్వనక్కరలేదు. అడ్వాన్స్‌గా చెప్పి తీసుకున్నవి ఇవ్వాల్సిందే.

ఈ లెక్కలు చూడండి. ఉదాహరణకు విన్నర్‌ ఏపీ తెలంగాణ ఫస్ట్‌ డే 5.60 కోట్లు - విన్నర్‌ ఏపీ తెలంగాణ ఫస్ట్‌ వీకెండ్‌ 9.96కోట్లు - విన్నర్‌ ఏపీ తెలంగాణ ఫస్ట్‌ వీక్‌ 11.73కోట్లు - విన్నర్‌ ఏపీ తెలంగాణ టోటల్‌ కలెక్షన్లు 14.35కోట్లు -అభిమానులు ఏమంటారు. ఫస్ట్‌డే ఏకంగా 5.60కోట్లు వచ్చేసింది అంటారు. కానీ అసలు టోటల్‌ రన్‌ చూస్తే 14.35కోట్లు. అంటే ఫస్ట్‌ డే తీసేస్తే, మిగిలింది ఎంత 8కోట్ల చిల్లర. సినిమా రెండు వారాలు ఆడింది అనుకంటే, 13రోజులకు వచ్చింది అది అన్నమాట. తొలిరోజు వచ్చిన 5.60కోట్లలో వున్న అడ్వాన్స్‌లు, అవీ బయ్యర్‌ కావచ్చు, నేరుగా విడుదల చేసు కుంటే నిర్మాత కావచ్చు వెనక్కు ఇవ్వాల్సిందే. వారికి వారికి వున్న ఒప్పందాల ప్రకారం.

మరి ఆ ఒప్పందాలు అన్నీ చెక్‌ చేసి సినిమా ఫైనల్‌ ఫిగర్‌ వచ్చిన తరువాత అప్పుడు కదా అసలు ఫస్ట్‌డే ఎంత అన్నది తేలేది? లేదా ఫస్ట్‌డే కేవలం టికెట్‌ల సేల ద్వారా వచ్చిన మొత్తం ఎంత అన్నది చెప్పాలి. అది ఎవరూ చెప్ప రు. దాంతో ఇలాంటి లెక్కలు చలామణీలోకి వచ్చేస్తుం టాయి.

హిట్‌ కాకపోతే..

హిట్‌ సినిమా అయితే మంచిదే. కానీ సినిమా డిజాస్టర్‌ అయితే, సినిమా నాలుగు వారాలు ఆడుతుందని, హాలునిండితే వచ్చే కలెక్షన్‌ ప్రకారం వన్‌ వీక్‌కు ఇంత, ఆ తరువాత మూడు వారాలకు ఇంత అని అందాజ్‌గా లెక్క వేసి, థియేటర్ల నుంచి బయ్యర్‌ అడ్వాన్స్‌లు లాగుతారు. అలా లాగినవి అన్నీ కలిపి, తనవంతు వేసి నిర్మాతకు చెల్లిస్తారు. సినిమా ఫ్లాప్‌ అయి వారంలో తీసేయాల్సి వస్తే, బయ్యర్‌కు నిర్మాత ఇచ్చినా ఇవ్వకున్నా, థియేటర్‌ వాళ్లకు బయ్యర్‌ వెనక్కు ఇవ్వాల్సిందే. థియేటర్‌ జనాలు వ్యాపారానికి పోయి సినిమాను కొనుక్కున్నా, లేదా ఎవరన్నా లోకల్‌గా కొనుక్కున్నా వేరే సంగతి కానీ, కేవలం బయ్యర్‌ థియేటర్లను తీసుకుని రెంట్లకు ఆడిస్తే కనుక, ఆ మేరకు అడ్వాన్స్‌ లు ఇప్పుడు కాకున్నా, రేపు మరో సినిమా కలెక్షన్ల నుంచి అయినా వెనక్కు చెల్లిం చాల్సిందే.

మరి అలాంటపుడు వెనక్కు ఇచ్చే మొత్తాలను ఇప్పటి సినిమా కలెక్షన్ల రికార్డుల్లోకి ఎలా చేరుస్తారు? నిజానికి కలెక్షన్ల రికార్డులు అంటే డీసీఆర్‌లు. డైలీ కలెక్షన్ల రికార్డులు. ఓ జిల్లాలోని అన్ని థియేటర్ల నుంచి బయ్యర్‌కు ఏ రోజుకు ఆరోజు వస్తాయి. వాటిని టోటల్‌ చేస్తే, ఫస్ట్‌డే ఇంత, సెకెండ్‌ డే ఇంత అంటూ తెలుస్తోంది. సెకెండ్‌ డే నుంచి మామూలుగా చెబుతారు. కానీ ఫస్ట్‌డే మాత్రం ఇలా నానా రకాలు కలిపి, రికార్డులు సృష్టిస్తున్నారు.

ఎవరికి లాభం ఈ రికార్డులు?

షేర్‌ అనేది అన్ని చోట్లా ఒకలా వుండదు. నిర్మాతకు, బయ్యర్‌కు కుదిరిన అవగాహనను బట్టి వుంటుంది. ప్రతి సినిమా ఓ పద్దతిలో విడుదల కాదు. నిర్మాతే పంపిణీ దారు కూడా అయితే మరోలా వుంటుంది. నిర్మాతే నేరుగా విడుదల చేసుకుంటే ఇంకోలా వుంటుంది. ఒకరు కొనుక్కుని, మరొకరి ద్వారా విడుదల చేసుకుంటే అదోలా వుంటుంది. కమీషన్‌పై విడుదల అంటే వేరు. అవుట్‌ రేట్‌ అంటే వేరు. ఇలా రకరకాల లెక్కలు వుంటాయి.

కానీ ఫస్ట్‌డే యాభై వచ్చింది. పాతిక షేర్‌ అని చకచకా ఎవరు పడితే వారు లెక్కలు కట్టేస్తున్నారు. నిర్మాత, బయ్యర్లు మాట్లాడరు. ఈ లెక్కలు ఎక్కడికి దారితీస్తున్నాయంటే, హీరోలు దర్శకులు తమ తమ రేట్లు పెంచేయ డానికి మాత్రం పనికి వస్తున్నాయి. టాప్‌ హీరోలు మహేష్‌ బాబు, పవన్‌కళ్యాణ్‌, టాప్‌ డైరక్టర్లు త్రివిక్రమ్‌, ముర గదాస్‌ లాంటి వాళ్లు ఇరవ్వయ్యేసి కోట్లు పారితోషికాలు తీసుకుంటున్నారంటే, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ లాంటివాళ్లు 15 కోట్లు తీసుకుంటున్నారంటే ఇలాంటి రికార్డులు చూపించే.

ఎవరి సొమ్ము ఇదంతా

నిజానికి హీరోలను దర్శకులను కోట్లకు కోట్లు ఇచ్చి పోషిస్తున్న సొమ్ము అంతా ఎవరిది? అతి కింది స్థాయిలో సినిమా బజ్‌ను నమ్మి కొనే అతి చిన్న లోకల్‌ బయ్యర్లు, లక్ష, రెండులక్షల రేంజ్‌లో థియేటర్ల వారీ, ఊళ్ల వారీ కొనుగోళ్లు చేసి, నష్టపోయే వాళ్లవి. బ్రహ్మూత్సవం, సర్దార్‌ ఇలాంటి సినిమాలకు బయ్యర్లు లాస్‌ అయిపోయారంటారు. నిజానికి అసలు లాస్‌ బయ్యర్లది కాదు. సినిమా ఇన్‌సైడ్‌ టాక్‌ ఎప్పటికప్పుడు బయ్యర్లు తెలుసుకుంటూ వుంటారు. టాక్‌ సరిగ్గాలేదు అని తెలియగానే, లోకల్‌గా అమ్మకాలు సైలెంట్‌గా జరిపేస్తారు. చాలా వరకు అక్కడ రికవరీ అయిపోతారు. కానీ అలా లోకల్‌గా కొన్నవాళ్లు గుల్లయిపోతారు. అందుకే పెద్ద సినిమాలకు లాస్‌ అయినా బయ్యర్లు పెద్దగా గోలపెట్టరు. ఎందుకంటే లాస్‌ అనేది కోట్ల నుంచి లక్షల్లోకి, వేలల్లోకి మారి కింద స్థాయిలోకి పంపిణీ అయిపోతుంది. కానీ అలా లాస్‌ అయినా కూడా, తొలిరోజు ఇలా ఫిక్స్‌ డ్‌ హయ్యర్లు, థియేటర్‌ అడ్వాన్స్‌లు, ఓపెనింగ్‌ కలెక్షన్ల కలిపి, పెద్ద మొత్తం చూపించి రికార్డులు సృష్టించస్తుంటారు. ఇవి చూపించి హీరోలు తమ రెమ్యూనిరేషన్‌ పెంచుకుంటూ పోతుంటారు.

ఎప్పుడయ్యా అసలుగోల మొదలవుతుందీ అంటే సిని మా తోలి మూడురోజుల తరువాత మండే నుంచి వసూలు చేసే కలెక్షన్లు, అలాగే టోటల్‌గా కొన్న మేరకు వసూళ్లు రాకపోయిన దగ్గర నుంచి. నవ్వుకుంటున్న ఇండ స్ట్రీ ఇండస్ట్రీ జనాలు సినిమా విడుదల మర్నాడు వచ్చే కాకుల లెక్కలు చూసి నవ్వుకుంటూ వుంటుంది. ఎందుకంటే అసలు లెక్కలు వారికి తెలుసు. కానీ వారిలో వారే తప్ప ఎవరూ ఎవరినీ కామెంట్‌ చేయరు. ఎందుకంటే ఇక్కడ అందరికీ అందరితో పని వుంటుంది. అందుకే ఈ ఆత్మవంచన లెక్కలు అలా చలామణీ అవుతూనే వుంటాయి.

నిర్మాతలను గుల్ల చేసేస్తున్నారు

పెద్ద డైరక్టర్లు, హీరోలు కలిసి నిర్మాతలను గుల్ల చేసేస్తున్నారు. కలెక్షన్లు పెరుగుతున్నాయి. వసూళ్లు పెరుగుతున్నాయి. కానీ నిర్మాతలకు ఆనందంలేదు. అవి చూపించి హీరోలు భారీగా లాగేస్తున్నారు. డైరక్టర్లు భారీగా ఖర్చు చేయించేస్తున్నారు. మురుగదాస్‌ - మహేష్‌ సినిమాకు వందకోట్లకు పైగా ఖర్చు. త్రివిక్రమ్‌-పవన్‌ సినిమాకు వందకోట్లకు పైగా ఖర్చు. అవసరమా? త్రివిక్రమ్‌-పవన్‌ సినిమాకు బాలీవుడ్‌ సినిటోగ్రాఫర్‌. అతనికి అతని టీమ్‌కే మూడున్నర కోట్ల ఖర్చు. ఆ సినిమాటోగ్రాఫర్‌కు కావాల్సిన ఎక్విప్‌మెంట్‌ ఇండియాలో ఒక్క దగ్గరే వుంటుందట. దాన్ని భారీ ఖర్చు చేసి తెప్పించాలి. ఇదేమైనా బాహుబలినా? అంత ఖరీదైన సినిమాటోగ్రాఫర్‌, అంత ఖర్చు ఎక్విప్‌మెంట్‌? ఏం, మన సినిమాటో గ్రాఫర్లు సరిపోరా? మన దగ్గర మన సౌత్‌ సినిమాటోగ్రాఫర్లే అద్భుతాలు చూపించలేదా? బాలు మహేంద్ర, విఎస్‌ఆర్‌ స్వామి, గోపాలకృష్ణ, ఇలా ఎన్ని పేర్లు? మొన్నటితరంలో. అలాగే నిన్నటి తరంలో, ఈ తరంలో కూడా తక్కువలో మంచి అవుట్‌ పుట్‌ ఇచ్చేవాళ్లు ఎంతమంది లేరు.

పనిమనిషి క్యారెక్టర్‌కు కూడా రోజుకు యాభైవేలు తీసుకునే ఏక్టర్‌ కావాలి. సింగిల్‌ డైలాగ్‌ లేకపోయినా? మరి ఎందుకు ఈ మెహర్బానీ. అదేదో రీజనబుల్‌గా తీసి, నిర్మాతకు ఓ రూపాయి మిగల్చవచ్చు కదా? తివ్రిక్రమ్‌-పవన్‌ సినిమాకు రెమ్యూనిరేషన్లే 60కోట్లు. ముందుగా భారీగా హీరోకు డైరక్టర్‌కు అడ్వాన్స్‌లు ఇస్తారు కాబట్టి, (బన్నీ,రామ్‌ చరణ్‌ లాంటి వాళ్లు మినహాయింపు) వడ్డీ లకు కోట్లకు కోట్లు. నిర్మాణానికి. వెరసి వందకోట్లు. వసూళ్లు 110కోట్లు వుంటే మాత్రం ఎవరికి లాభం. ఇంత టెన్షన్‌ పడిన నిర్మాతకు పట్టుమని పదికోట్లు మిగలవు. డైరక్టర్‌, హీరోలు మాత్రం 20కోట్లు వంతున జేబులో వేసుకుంటారు. పైగా సినిమా ఫ్లాప్‌ అయితే వాళ్లకు ఏ సమస్య లేదు. నిర్మాతకు మాత్రం ఇక నానా బాధలు. అంత పెద్దహిట్‌ అయిన బాహుబలికి ఫస్ట్‌ పార్ట్‌కు నిర్మాతకు నష్టమే మిగిలింది అంటే నమ్ముతారా?

టాలీవుడ్‌ ఈ విషవలయం నుంచి ఎప్పటికి బయటపడుతుందో?

-ఆర్వీ

ఇదో బ్లాక్‌ దందా

పెద్ద సినిమాలు విడుదలయినపుడు జరిగే ఓ స్కామ్‌ గురించి ఓ ఎగ్జిబిటర్‌ ఇలా వెల్లడించారు. పెద్ద సినిమాను కొన్న బయ్యర్‌ తన సినిమాను థియేటర్లకు ఇచ్చేటపుడే ఓ అగ్రిమెంట్‌ చేసుకుంటాడు. అదేమిటంటే, మొదటి మూడురోజులు, అన్ని ఆటలకు ఇన్ని టికెట్‌ల వంతున తనకు ముందే ఇచ్చేయాలని. కనీసం ఓ ఆటకు రెండు వందల టికెట్‌లు ఇవ్వాలని ఇప్పుడు ముందే చెప్పేస్తున్నారు. ఆ మేరకు తీసుకుంటున్నారు. అంటే నాలుగు ఆటలకు ఎనిమిది వందలు, మూడు రోజులకు 2400 టికెట్‌లు. వంద రూపాయల టికెట్‌ను డిస్ట్రిబ్యూటర్‌ గంపగుత్తగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేస్తాడు. కొన్నిచోట్ల ఇందుకోసం వేలంపాట కూడా నడుస్తోందట. టికెట్‌ మీద వందకు వంద, రెండువందల వంతున లాగేస్తారు. బ్లాక్‌ వాళ్లు అయిదు వందలకు అమ్ముకుంటారు. ఈ ఆదాయం అంతా లెక్కల్లోకి రాదు. బయ్యర్‌కు చేరిపోతుంది. కానీ బ్లాక్‌ మార్కెట్‌ పాపం మాత్రం థియేటర్‌ వాడు చేసాడు అంటూ గోల చేస్తారు. ఎగ్జిబిటర్ల బాధలు ఇన్నీ అన్నీకావు. కొత్త సినిమా వస్తే ఆ ఏరియా పోలీస్‌కు, టాస్క్‌ఫోర్స్‌కు, కమర్షియల్‌ టాక్స్‌కు, రెవెన్యూకు. పది లేదా ఇరవై టికెట్‌ల వంతున ఇవ్వాల్సిందే. మిగిలినవే అమ్మాలి.

డిస్ట్రిబ్యూటర్‌లు మాయమవుతున్నారు

లాస్ట్‌ టూ ఇయర్స్‌లో జనవరి టూ ఏప్రిల్‌ వరకు చూడండి. ఈ సోకాల్డ్‌ పెద్ద హీరోల సినిమాలు ఎంత పెట్టి తీసారు. ఎంత వచ్చింది. ఎంతలాభం, ఎంతనష్టం. ఇప్పుడు ఇండస్ట్రీకి ఫీడ్‌ చేస్తున్నది మీడియం హీరోలే. నాని, శర్వానంద్‌, నిఖిల్‌ ఇలా వీళ్లే. పెద్ద హీరోలది కేవలం టర్నోవర్‌ మాత్రమే. డిస్ట్రిబ్యూటర్‌లు, థియేటర్ల జనాలు ఎవ్వరూ హ్యాపీగా లేరు. అసలు వందరూపాయిల టికెట్‌లో పన్నులు అన్నీ తీసేస్తే నలభైరూపాయిల దగ్గర మిగుల్తుంది అదీ షేర్‌. కానీ రాను రాను కేవలం టాక్స్‌ మాత్రం తీసేసి అదే షేర్‌ అంటున్నారు. ఇంకా ముందుకు వెళ్లి గ్రాస్‌ లెక్కలు చెబుతున్నారు. కామన్‌ ఆడియన్స్‌కు ఇవేవీ తెలియదు. ఇలా పరిస్థితి వున్నా కొందరు బయ్యర్లు తమకు లిస్ట్‌లో ఓ పెద్ద సినిమా వుండాలని, హీరోల పట్ల ఫ్యాషన్‌తో కొంటారు తప్ప. లాభాల కోసం కాదు. 20కోట్ల సినిమా 26కోట్లు చేస్తే సేఫ్‌. కానీ రిస్క్‌ 15కోట్లు వుంటుంది. ఆ రిస్క్‌ లేకపోతే చాలనుకునే పరిస్థితి వచ్చేసింది.

నైజాంలో నలభైమంది బయ్యర్లు వుండేవారు. ఇప్పుడు సునీల్‌, దిల్‌రాజు, నేను ముగ్గురం మిగిలాం. సురేష్‌, గీతాకొనరు. ఆంధ్రలో కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందేమో? ముఫ్పైకోట్లతో ఒక పెద్ద సినిమా తీసేకన్నా, నాలుగు సినిమాలు తీసుకుంటే బెటర్‌. నిఖిల్‌ సినిమా పూర్తిచేసా, బాబు బాగా బిజీ ఫినిష్‌ చేసాం. టేబుల్‌ ప్రాఫిట్‌తో హ్యాపీగా వున్నాం. అదే వందకోట్ల సినిమా చేస్తే లాభం వుంటుందో వుండదో గ్యారంటీ లేదు. అంకెలు చెప్పుకోవడం అభిమానుల వరకు ఓకే. కానీ అవే అంకెలు చూపించి అమ్మకాలు, కొనుగోళ్లు జరిపితే మాత్రం కష్టమే. పైగా ఇప్పుడు అవుట్‌ రేట్‌ అంటున్నారు. పోతే పోవడమే. అయితే ఇక్కడ నలభై ఏళ్లుగా ఇదే వ్యాపారంలో వున్నవాళ్లకు మరొకటి చేతకాదు. అందుకే ఇక్కడే ఇలా ఏదో ఒకటి చేస్తూ, నష్టాలు మూటకట్టుకోవాల్సి వస్తోంది. పరిస్థితి అయితే ఏమీ బాగాలేదు.

-అభిషేక్‌ నామా, నిర్మాత, పంపిణీదారుడు

ఎమ్‌జీలు ఎందుకు ఇస్తారు?

అసలు థియేటర్‌ ఓనర్‌ అడ్వాన్స్‌లు, ఎంజీలు ఎందుకు ఇస్తారు బయ్యర్లు లేదా డిస్ట్రిబ్యూటర్లకు? తమ థియేటర్లో కాస్త మంచి సినిమా పడకుంటే క్యాంటీన్‌కు, సైకిల్‌ స్టాండ్‌కు ఆదాయంరాదు అందుకని. సెంటర్‌లో వున్న థియేటర్‌ అడ్వాన్స్‌లు ఇచ్చి ఊరుకుంటుంది. కానీ అదే కాస్త సెంటర్‌లో లేని, పాపులర్‌ కాని థియేటర్‌ అయితే ఎంజీలు అంటే మినిమమ్‌ గ్యారంటీలు ఇస్తుంది. సినిమా ఫ్లాప్‌ అయితే ఈ ఎంజీరాదు. కానీ థియేటర్‌ నుంచి కట్టాల్సిందే. పోనీ ఎంజీలు కట్టకుండా సినిమా తెచ్చుకుందాం అంటే మంచి సినిమా పడదు. దాంతో క్యాంటీన్‌ లీజుకు తీసుకున్నవాళ్లు, సైకిల్‌ స్టాండ్‌ లీజుకు తీసుకున్నవాళ్లు గోల పెడతారు. ఇది పడలేక, సినిమాల కోసం జూదం ఆడాల్సి వస్తుంది.

అభిమానుల ఆనందమే లక్ష్యంగా మారుతోంది

ఈ అంకెలు అన్నీ అభిమానులను అలరించడానికి తప్ప వేరుకాదు. అసలు లక్ష్యం నుంచి మన సినిమా పక్కకు వెళ్లిపోతోంది. వంద రూపాయిలు పెట్టి సినిమా కొన్న ఆడియన్స్‌ను అలరించాల్సిన సినిమా అభిమానులను మాత్రం అలరించాలని చూస్తోంది. హార్ట్‌ టచ్చింగ్‌గా సినిమా తీయాల్సింది పోయి, నోట్లుటచ్‌ చేసుకుంటూ మురిసిపోతున్నారు. ఈ అంకెలు, గ్రాస్‌లు, షేర్‌లు అబద్దాలని మీకూ తెలుసు, నాకూ తెలుసు, ఇండస్ట్రీ జనాలకు తెలుసు. ఏదో అభిమానులు చెప్పుకోవడం కోసం, పోటీ హీరోల కన్నా తాము పైన వున్నాం అని చెప్పుకోవడం కోసం తప్ప మరెందుకు కాదు. ఇవ్వాళ బయ్యర్లు కూడా ఇవి చూసి కొంతవరకు, ఇలాంటి సినిమాల కోసం పరుగెత్తుకు వచ్చే అభిమానులను చూసి కొంతవరకు అలవికాని రేట్లు పెట్టి కొంటున్నారు. అయితే ఎవరికి అందిన చోట వాళ్లు లాభాలు చేసుకుంటున్నారు. చేసుకోలేని వాళ్లు మునిగిపోతున్నారు.

-తేజ, డైరెక్టర్‌, నిర్మాత, ఎగ్జిబిటర్‌


లీజుదారుల  దందా

ఇవ్వాళ థియేటర్‌ లీజుకు ఇవ్వకుండా స్వంతగా నడిపేసుకుందాం అనుకున్నా వీలుకాని పరిస్థితి వుంది. నిర్మాతలు సిండికేట్‌ అయి లీజుదారులుగా మారుతున్నారు. గీతా, యూవీ, దిల్‌రాజు, సురేష్‌ మూవీస్‌ వీళ్లంతా థియేటర్లు లీజుకు తీసుకునేవారే. ఎవరయినా తమ థియేటర్‌ను లీజుకు ఇవ్వకపోతే, ఆ థియేటర్‌కు చుక్కలు చూపించేస్తారట. పెద్ద సినిమాలు మరీ తప్పకపోతే తప్ప ఆ థియేటర్‌కు ఇవ్వరు. తప్పక ఇచ్చినా తమ లీజు థియేటర్‌ ఖాళీ అయితే ఈ థియేటర్‌ నుంచి ఆ థియేటర్‌కు మార్చేస్తారు. దీని వల్ల సినిమా కిల్‌ అయినా ఫరవాలేదు. అంతే కానీ తమ లీజు థియేటర్ల ఇన్‌కమ్‌ పోకూడదు. తమకు లీజుకు ఇవ్వని థియేటర్లు బాగుపడకూడదు. ఇదేవాళ్ల థియరీ అని ఓ ఎగ్జిబిటర్‌ వాపోయారు.

Show comments