దేవదాస్ మీద నాగ్ చేయి?

తన సినిమాల మీద, తన పిల్లల సినిమాల మీద ఓ కన్నేసి వుంచడం, అవసరం అయితే కత్తెర పట్టుకుని, ఎడాపెడా కోయించడం, రీషూట్ లు చేయించడం అన్నది హీరో నాగార్జున గత రెండు మూడేళ్లుగా చేస్తున్న పని. ఏ సినిమాను వదలడం లేదు. ఏ సినిమాకు మినహాయింపు లేదు. అలా తప్పించుకుని, బాక్సాఫీస్ దగ్గర కనిపించకుండా పోయిన సినిమా ఒక్క ఆర్జీవీ ఆఫీసర్ మాత్రమే.

కళ్యాణ్ కృష్ణ తో చేసిన రెండు సినిమాలకు నాగ్ కనుసన్నలలోనే కూడికలు తీసివేతలు జరిగాయి. లేటెస్ట్ గా చైతన్య  శైలజారెడ్డి అల్లుడు సినిమాకు కూడా నాగ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎడిటర్లుగా, బ్యాక్ సీట్ డైరక్టర్లుగా వ్యవహరించారని గ్యాసిప్ లు వినిపించాయి.

ఇప్పుడు నాగ్ లేటెస్ట్ మిషన్ 'దేవదాస్' అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరక్టర్ శ్రీరామ్ సినిమాను ఫినిష్ చేసేసాడు. గతంలో టాక్ పరంగా, కమర్షియల్ గా రెండు, యావరేజ్ సినిమాలు అందించాడు శ్రీరామ్. అందుకే నాగ్ సినిమా విషయంలో కేర్ తీసుకోవడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రఫ్ వెర్షన్ ఓసారి చూసాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మరి నాగ్ ఏం చెప్పాడో, ఏం చేయబోతున్నాడో తెలియాల్సి వుంది. కానీ ఒకటి పక్కా నాగ్ ఏదో ఒకటి చెబుతాడు. చేస్తాడు. ఆ విషయంలో అనుమానం మాత్రం అక్కరలేదు.