ఎమ్బీయస్‌: కూల్చివేతపై యింత వ్యథా? - 2/2

అయితే అక్రమ కట్టడాలపై యీ ధోరణి కృష్ణా కరకట్టతో ఆగిపోతుందా, రాష్ట్రమంతా అమలవుతుందా అనేదే వేచి చూడాల్సిన విషయం. ఇప్పటికే కట్టేసిన వాటి విషయంలో న్యాయపరమైన చిక్కులు వస్తాయి, అవి పరిష్కరించడానికి సమయం పడుతుంది. నిజమే. కానీ కొత్తగా కట్టేవాటిలో అక్రమాలు సహించకుండా ఉంటే అదైనా హర్షణీయమే. జగన్‌ ప్రజావేదిక కూల్చేసిన ఓ ఆర్నెల్ల తర్వాత మిగతా వాటి జోలికి వెళ్లకుండా ఉంటే అప్పుడు యిది రాజకీయ దురుద్దేశ పూరిత చర్య అని ఆక్షేపించవచ్చు. ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది.  కానీ టిడిపిలో తొందర ఉంది. జగన్‌ ప్రకటనలు చూసి ప్రజలు అతన్ని ఎక్కడ శభాష్‌ అంటారోనని ఊహూ కంగారు పడిపోతోంది. 

నిజానికి జగన్‌ చెప్పిన పథకాలకు నిధులు ఎక్కణ్నుంచి వస్తాయోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అతను ఖర్చు గురించే మాట్లాడుతున్నాడు తప్ప ఆదాయం గురించి మాట్లాడటం లేదు. ఆర్నెల్లు పోయినా పథకాలు అమలు కాకపోతే నిరాశకు గురైన ప్రజలే తిరగబడతారు. టిడిపి కాస్త ఓర్చుకుంటే అవన్నీ చూడవచ్చు. కానీ ఆ ఓర్పు కనబడటం లేదు. పెట్టుబడులు రావటం లేదు, ఈయన ఉండగా రావు, మాపై దాడులు జరుగుతున్నాయి అంటూ హంగామా చేస్తూంటే వినడానికి తమాషాగా ఉంది. ఇలాటి వాటివలన జగన్‌పై అనవసరంగా మరింత సానుభూతి కలిగే ప్రమాదం ఉందని బాబు గ్రహించాలి. 

మరింత - అని ఎందుకంటున్నానంటే టిడిపి అనుకూల మీడియా వాళ్ల వాదన ప్రకారం ఆంధ్రప్రజలు జగన్‌ 'ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..' అంటూ బతిమాలుకోవడంతో పోనీలే పాపం యిచ్చి చూద్దాం అనే జాలితో ఓట్లేశారు. అలాటి వాళ్లు 'పాపం యిన్నాళ్లూ పాదయాత్ర పేరుతో నడుస్తూనే ఉన్నాడా, కాస్త కుర్చీలో జారబడ్డాడో లేదో, వీళ్లు నస మొదలు పెట్టేశారు' అనుకోగలరు. 

ప్రజావేదిక కూల్చివేత గురించి టిడిపి వాళ్లు లేవనెత్తిన పాయింట్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆ వేదిక తనకిమ్మనమని బాబు అడిగారట. దాంతో కసి కొద్దీ జగన్‌ కూల్చివేశాడట. ఇంకా కొంతమంది 'అది టిడిపిది, ఆయన అలా ఎలా కూల్చేస్తాడు?' అని కూడా అడిగారు. అదేమిటంటే కావాలని బాబు లేఖ రాశాడు కాబట్టి అంటున్నారు. కావాలని రాసినంత మాత్రాన మనదై పోతుందా? రాష్ట్రంలో అక్రమ కట్టడాలన్నీ కూలుస్తాడా? అని ఒకరి సవాలు. అవన్నీ కూల్చేదాకా యిది కూల్చకూడదా? ఇది ఆరంభమో, అంతమో ఓ నెలలో తెలిసిపోతుంది కదా. బాబుకి యిల్లు లేకుండా చేయాలనే కృష్ణా కరకట్టపై నిర్మాణాలు కూల్చేస్తున్నారని మరొక వాదన. అక్కడ తప్ప బాబుకి అద్దె యిల్లు మరెక్కడా యివ్వనన్నారా? మరి లోటస్‌ పాండ్‌ కూడా కూల్చేస్తారా? అని మరో ప్రశ్న. అక్రమమైతే కూల్చేస్తారు. మీరు అడిగారు కదాని కూల్చేయరు కదా. వైయస్‌ తన యింటిని రెగ్యులరైజ్‌ చేయమని అడగలేదా? అని యింకో ప్రశ్న. అలాటి వెసులుబాటు ఉన్నపుడు మీరూ, నేనూ, అందరం అదే చేస్తాం.

కృష్ణా కరకట్టపై కట్టిన కట్టడాలకు డ్రైనేజీ సౌకర్యం కూడా లేకపోవడంతో వాళ్లు వ్యర్థాలన్నీ కృష్ణలోకి వదిలేస్తున్నారు, అనేక రకాలుగా పర్యావరణం నాశనమౌతోంది, అనేక పర్యావరణ చట్టాలను ఉల్లంఘించారు, - యివన్నీ టిడిపి వాళ్లతో సహా అందరికీ తెలుసు. బాబు వచ్చి అక్కడ నివాసముంటానని ప్రకటించేదాకా వాళ్లే యీ అక్రమాలను హైలైట్‌ చేశారు. ఇప్పుడు గ్కు తిప్పుకోలేక, వింత వాదనలను వినిపిస్తున్నారు. గత 15 ఏళ్లగా గత ప్రభుత్వాలేవీ చేయలేదు, యిప్పుడు వైసిపి ప్రభుత్వం మాత్రం ఎందుకు చేయాలని అని ప్రశ్న. 

చంద్రబాబు తన హయాంలో అనేక కట్టడాలను కూల్చి రోడ్లు విస్తరించారు. అదీ తప్పేనందామా? కొందరు టిడిపి మేధావులు పాత చట్టాలను చూపించి అక్రమ నిర్మాణాలనడం సరికాదు, అవసరమైతే ఆ చట్టాలను మార్చాలి అని కూడా వాదిస్తున్నారు. అంటే టిడిపి వారు తప్పు చేస్తే దాన్ని ఒప్పు చేయడానికి చట్టాలే మార్చేయాలా? భేష్‌! అవినీతి జరిగిందని ఆరోపణలున్న కట్టడాలన్నీ కూల్చేస్తారా? అసెంబ్లీ, పోలవరం, పట్టిసీమ... అంటూ ఓ కొక్కిరాయి ప్రశ్న. ఇక్కడ ప్రశ్న చట్టాలను ఉల్లంఘించారా లేదా అని  తప్ప అవినీతి జరిగిందా లేదా అన్నది కాదు. అది వేరే చర్చ. దాని పరిణామాలు వేరే ఉంటాయి. 

ఇంకో వాదన విన్నాను - అక్రమ కట్టడం కాబట్టి కూల్చేస్తాం అని ప్రభుత్వం అనడం సరికాదు, ముందుగా ఒక కమిషన్‌ వేసి అక్రమం జరగడానికి కారణభూతులైన అధికారులను, నాయకులను అందర్నీ విచారించి, శిక్షించి.. అప్పుడు కూల్చాలి అని. ఇవన్నీ కాలయాపన పనులు. చాలా కేసుల్లో నాయకుల నోటి మాటలే ఉంటాయి తప్ప ఫైళ్లపై నోటింగులు ఉంటాయి. సంతకాలు పెట్టిన అధికారులు లబోదిబో మంటారు - పాత ప్రభుత్వం మా చేత బలవంతంగా చేయించిందండి, మాకు యిందులో లాభమేమీ లేదండీ అని. ఈ మీమాంస ఎప్పటికీ తేలదు. 

ప్రజావేదిక విషయంలో కూడా 5 కోట్ల బజెట్‌ అని మొదలు పెట్టి, మౌఖిక ఆదేశాలతో దాన్ని 8.9 కోట్లకు పెంచారట. అది ఎలా జరిగింది, ఎవరలా చెప్పినది అని చర్చ మొదలుపెడితే, రాజకీయ కక్షసాధింపు అని గగ్గోలు పుడుతుంది తప్ప వ్యవహారం ఎప్పటికీ తేలదు. ప్రభుత్వానికే కాదు, యావన్మంది ప్రజలకూ తెలుసు, అది అక్రమమైనదని, యిప్పుడే కొట్టేస్తే నష్టమేమీ లేదు. అక్రమమైనదైనప్పుడు అక్కడే మీటింగు పెట్టి, చూపించి కొట్టడం దేనికి అని మరో ప్రశ్న. అలా చూపించి కొట్టడం వలననే అందరికీ తెలిసివచ్చింది - విత్‌ మోస్ట్‌ టెల్లింగ్‌ ఎఫెక్ట్‌! చడీచప్పుడు కాకుండా కొట్టేసి వుంటే సంకేతం బలంగా వెళ్లేది కాదు.

ఇలా కొట్టేయడం వలన ప్రజాధనం వృథా అవుతోందన్న వాదన ఒకటి వినబడుతోంది. అయిందేదో అయిందని ఊరుకుని, యికపై అక్రమంగా కట్టకూడదనుకుంటే చాలుట. 'ఈసారికి యిలా కానీ' అనే ధోరణి వలననే అన్యాయాలను, అక్రమాలను సహిస్తూ పోవడం చేతనే, అవి పెరుగుతూ పోతున్నాయి. ఇక్కడ ఓ పిట్టకథ చెప్తాను. 1970ల నాటి మాట. పదేళ్ల మా తమ్ముడు రోడ్డు మీద ఆడే ఒక పందెంలో పాల్గొన్నాడు. పది పైసలిచ్చి పందెం కాస్తే తగిలితే రెండు రూపాయల విలువైన దేవుడి ఫోటో వస్తుంది, లేకపోతే పది పైసలు పోతాయి. మా వాడికి ఫోటో తగిలింది. ఆనందంగా యింటికి వచ్చి చూపించాడు. 'ఇలా జూదమాడడం మంచిది కాదు, యిచ్చేసి రా' అన్నాను నేను. ఇంటికి వచ్చిన దేవుణ్ని తిప్పి పంపడం మా అమ్మకు యిష్టం లేదు. 'ఇకపైన ఎప్పుడూ ఆడడులే, యీ సారికి వదిలేయ్‌' అని నాకు నచ్చచెప్పబోయింది. నేను వినలేదు. పటం తిరిగి యిచ్చేస్తూంటే షాపువాడు తెల్లబోయాట్ట. 

నేనీ సంగతి ఎప్పుడో మర్చిపోయాను. 30 ఏళ్ల తర్వాత మా తమ్ముడే ఏదో సందర్భంలో గుర్తు చేసి 'అప్పణ్నుంచి నేను ఏ రకమైన జూదమూ ఆడలేదు' అన్నాడు. పటం తెచ్చినరోజు 'పోనీలే పాపం' అని ఊరుకుని ఉంటే వాడికి అంత బలమైన ముద్ర పడేది కాదేమో! అయినా ప్రభుత్వానికి 9 కోట్లు ఓ పెద్ద ఖర్చా? శంకుస్థాపనలని, ప్రారంభోత్సవాలని ప్రభుత్వం ఎన్నిటికి తగలేస్తూ ఉంటుంది? బాబు తన పుట్టిన రోజున ప్రత్యేక హోదాకై నిరసన దీక్ష అంటూ రోజంతా వేదిక మీద కూర్చుని చేసిన అడావుడికి ఎన్ని కోట్లు ఖర్చయిందో! సింగపూరుకి రైతులు, మంత్రులు, అమరావతి డిజైన్లు.. అంటూ మరెంత తగలేసిందో! జగన్‌ ప్రభుత్వంలో మాత్రం వృథావ్యయం ఉండకుండా పోతుందా? 

అయినా రోడ్డు విస్తరణ, కొత్త ప్రాజెక్టు అంటూ మన స్థలాలు లాక్కుని పరిహారం కింద ప్రభుత్వం కంటితుడుపుగా విదిలించినా, మనం భరిస్తున్నాము. వ్యక్తిగత స్థాయిలో మనమే భరించగా లేనిది, లక్షకోట్ల బజెట్‌ ఉన్న ప్రభుత్వానికి 9 కోట్లు ఒక లెక్కా? ప్రభుత్వాన్ని చూసి మనం జాలి పడనక్కరలేదు. అది తప్పు చేసింది, అనుభవించనీయండి. ప్రభుత్వాధినేత మారవచ్చు కానీ ప్రభుత్వం ఆస్తులు, అప్పులు, తప్పులు అలాగే ఉంటాయిగా. 

ప్రజావేదిక యిక గతమే. వర్తమానం ఏమిటంటే - కృష్ణా కరకట్టపై ఉన్న నిర్మాణాలు. వాటి సంగతి ఏమిటి అనేదే ప్రశ్న. వాటి సొంతదారుల్లో స్వామీజీల నుంచి వ్యాపారస్తుల దాకా అందరూ ఉన్నారు. అందరూ పలుకుబడి, అనుయాయుల బలం ఉన్నవారే. అందరి కంటె ఎక్కువగా ఉన్నది లింగమనేని గెస్ట్‌ హౌస్‌లో అద్దె కుంటున్న బాబుకి. ఆయన అద్దె యింటిని కూలుస్తారా లేదా, కూల్చగలరా లేదా అన్నదే వివాదం. అది కూడా ప్రభుత్వ కట్టడమే కాబట్టి మహరాజులా కూల్చవచ్చు అని కొందరు బాబు ప్రకటనను గుర్తు చేస్తున్నారు. 2016 మార్చిలో బాబు విలేకరులతో అన్నారు - లాండ్‌ పూలింగులో లింగమనేని యీ యింటిని ప్రభుత్వానికి యిచ్చారు కాబట్టి ప్రభుత్వానిదే అని. మర్నాడే లింగమనేని రమేష్‌ కూడా విలేకరులతో అదే నొక్కి వక్కాణించారు. 'ఆ యింటికి నాకూ యిప్పుడు ఎలాటి సంబంధం లేదు' అని. అందువలన ఆ యిల్లు కూల్చేయబోతూంటే లింగమనేని కోర్టుకి వెళ్లలేరు. కాదు, నాదే అని చెపితే అప్పుడు బాబు, లింగమనేని యిద్దరూ ప్రజల్ని బురిడీ కొట్టించినట్లు రుజువౌతుంది.

అసలిలా చెప్పవలసిన అవసరం ఏమొచ్చిందంటే అప్పట్లో బాబుకి గెస్ట్‌హౌస్‌ యిచ్చినందుకు గాను, లింగమనేని నుంచి లాండ్‌పూలింగులో భూములు తీసుకోలేదని, అది క్విడ్‌ ప్రో కో అని అన్నారు. కాదని చెప్పడానికి బాబు పై ప్రకటనలోనే 'లింగమనేని భూములు కూడా యిస్తానన్నారు. కానీ రాజధానికి సరిపడా భూములు అప్పటికే వచ్చేశాయని అక్కరలేదన్నాం. ఈ గెస్ట్‌హౌస్‌ ప్రభుత్వానికి వచ్చేసింది కాబట్టి దాన్ని ఉంచుతాం కానీ కరకట్టకు అవతలివైపు ఉన్న భవనాలన్నీ కూల్చివేస్తాం' అన్నారు. ఇలా బాబు ఎప్పటికప్పుడు కరకట్ట నిర్మాణాలన్నీ అక్రమమే అని చాటి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడీ లింగమనేని గెస్ట్‌హౌస్‌ ప్రభుత్వానిదే అయితే మరి చిక్కే లేదు. ప్రజావేదిక లాగానే దాన్నీ కూల్చివేయవచ్చు. ఎవరూ కిమ్మనడానికి లేదు. అక్రమ కట్టడాలపై జగన్‌ చిత్తశుద్ధి మరో ఆర్నెల్లలో తేలిపోతుంది. అన్నిటిపై ఒకే ధోరణితో స్వపరభేదం లేకుండా వ్యవహరిస్తే రాజకీయపు రంగు ఎవరూ పులమలేరు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2019)
[email protected]

ఎమ్బీయస్‌: కూల్చివేతపై యింత వ్యథా? - 1/2