ఎమ్బీయస్‌: కూల్చివేతపై యింత వ్యథా? - 1/2

ఆంధ్రలో ప్రజావేదిక కూల్చివేతపై యింకా చర్చ జరుగుతూండడం ఆశ్చర్యకరంగా ఉంది. అనేక సార్లు అక్రమ కట్టడాలంటూ ప్రభుత్వం యిళ్లను, బిజినెస్‌ కాంప్లెక్సులను కూల్చివేస్తూనే ఉంటుంది. జిల్లా ఎడిషన్‌లో తప్ప వేరెక్కడా దాని గురించి వార్తలు రావు. కోర్టు సెలవులు చూసుకుని ప్రభుత్వాధికారులు ఏ శుక్రవారం రాత్రో కూల్చివేత మొదలుపెడతారు. రాత్రికి రాత్రి కూల్చేశారని భవన యజమానులు ఫిర్యాదు చేస్తారు. అనేక నోటీసులు యిచ్చామని, కోర్టు ఆర్డరు వేసినా వీళ్లు ఖాళీ చేయలేదని, అధికారులు అంటారు. సగం కూలాక కోర్టు కెళతారు, వాళ్లు స్టే యిస్తారు. కొన్నాళ్లకు చూస్తే మళ్లీ కట్టేస్తూ ఉంటారు - యీ సారి కూడా అనుమతులు లేకుండానే! ఇలా కూల్చేవి కూలుస్తూనే ఉంటే, కట్టేవి కట్టేస్తూనే ఉంటారు. అందువలన భవనాల కూల్చివేత గురించి ప్రజలు పట్టించుకోవడం మానేశారు. 

ఈ విషయంలో ఉన్న తేడా అల్లా భవన యజమాని తనంతట తనే అక్రమ కట్టడాన్ని కూల్చేసుకోవడం. పౌరులెవ్వరూ ఆ పని చెయ్యరు. అక్రమంగా కట్టడమే కాక, కూల్చివేతను నిలవరించడానికి శతథా ప్రయత్నిస్తారు. ఈ యజమాని ప్రభుత్వం కావడంతో కూల్చడానికి సిద్ధపడింది. ప్రభుత్వానికి చెందిన ఒక పురాతన భవనం శిథిలమై ప్రజా సంక్షేమానికి ప్రమాదకరంగా ఉన్నా దానిలో అద్దెకున్న వారు ఖాళీ చేయరు. నోటీసులిచ్చి, కొంతకాలం వేచి చూసి చివరకు ప్రభుత్వమే కూల్చివేస్తుంది. మా యిళ్లు పోయాయి అంటూ అలజడి చేస్తే 'ఇప్పుడు యిళ్లు పోయాయి, కొన్నాళ్లుంటే ప్రాణాలే పోయేవి' అని ప్రభుత్వం నచ్చచెపుతుంది. ప్రజోపయోగం కోసం రోడ్డు విస్తరిద్దామనుకున్నారు. ప్రభుత్వభవనం అడ్డు వచ్చింది. కొట్టేయరా? ప్రభుత్వధనం వృథా అవుతుందంటూ ఉంచేస్తారా?

ఈ భవనమూ అంతే. నదీపరివాహక ప్రాంతంలో కట్టారు. వరదలు వస్తే ముంపు ప్రమాదం ఉంది. మునిగినప్పుడు దానిలో ఉన్న ఫర్నిచరు, రికార్డులే కాదు, మనుష్యులు కూడా చనిపోతారు. అందుకని కొట్టేశాం అని ప్రభుత్వం అంటే యిటీవలి కాలంలో కృష్ణకు వరదలు రాలేదు కదా అని వాదించడం అర్థరహితం. నీటి చుక్కకోసం అలమటింటే చెన్నయ్‌లో కూడా వరదలు వచ్చాయి. కృష్ణకూ వరదలు రావచ్చు, అప్పుడు వీళ్లంతా వెళ్లి చేతులు అడ్డుపెట్టి ఆపేస్తారా? పర్యావరణం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. మనం చెరువులు కబ్జా చేసేసి, నీటివాలు ఉన్నచోట భవంతులు కట్టేసి, ప్రకృతితో ఆటలాడుకుంటూ ఉంటే ప్రభుత్వం సహిస్తుందా? తీసి పారేయండి అంటుంది. పర్మిషన్లు ఎక్కడ అని హుంకరిస్తుంది. పంచాయితీ లే ఔట్‌ పర్మిషనుంది, ఇన్నాళ్లూ ఇంటి పన్ను కట్టించుకుని, నీళ్లు, విద్యుత్‌ సరఫరా చేసి యిప్పుడేమిటి యిలా అంటారు అంటే 'అదేమీ కుదరదు, ఇది అక్రమ కట్టడం, కొట్టి పారేయాల్సిందే' అని కూల్చి పారేస్తుంది. 

మరి అలాటి ప్రభుత్వం మీకో రూలు, నాకో రూలు అంటే ఒప్పుతుందా? నేను అక్రమ నిర్మాణాలు చేస్తూ పోతాను, వాతావరణ విధ్వంసం చేస్తాను, నదులకు హాని కలిగిస్తాను, మీరు మాత్రం సెట్‌బ్యాక్‌ యిచ్చి యిళ్లు కట్టుకోవాలి, చెట్లు నాటాలి, సోలార్‌ ప్లాంటు పెట్టుకోవాలి, యింకుడు గుంతలు తవ్వుకోవాలి, లేకపోతే భవనంలో చేరడానికి ఒప్పుకోం అంటే నప్పుతుందా? అలా అంటే అది ప్రభుత్వమా? లేక వీధి రౌడీయా? నావలో సురక్షితంగా తీసుకెళ్లవలసిన నావికుడే పడవను ముంచేస్తే ఎలా? వైద్యుడే ప్రాణాంతకుడైతే ఎలా? ప్రభుత్వం తప్పులు చేయకపోవడమే కాదు, తప్పులు చేసినట్లు అనిపించను కూడా అనిపించకూడదు. అప్పుడే ప్రభుత్వమంటే పౌరులకు భయభక్తులుంటాయి. సర్కారే చేనెలో మేస్తూ మనల్ని గట్టు మీద మాత్రమే మేయమంటే ఎలా? ప్రభుత్వం తప్పులు చేయకూడదు. ఒకవేళ తప్పులు చేసినా, ఎవరైనా ఎత్తి చూపేలోపున సవరించేసుకోవాలి. 

ప్రజావేదిక విషయంలో ప్రభుత్వం తప్పు చేసింది, సరిదిద్దుకుంది. సరైన విధానమే. అయితే యిక్కడ చిక్కెక్కడ వచ్చిందంటే తప్పు చేసిన ప్రభుత్వం వేరే, సరిదిద్దుకున్న ప్రభుత్వం వేరే! రెండూ వేర్వేరు పార్టీలకు చెందిన ప్రభుత్వాలు. అందువలన దీన్ని రాజకీయకోణంలో చూసి యాగీ చేస్తున్నారు. అది అనవసరం. అక్కడ ఉల్లంఘనలు జరగలేదని ఏ పార్టీ అనలేదు. గత ప్రభుత్వమే అక్కడ యిళ్లు కట్టుకున్నవారికి నోటీసులు యిచ్చింది. అప్పటి మంత్రి మీడియాను వెంటబెట్టుకుని వెళ్లి, చూడండి, యివన్నీ అక్రమమైనవి, తీసేయిస్తున్నాం అని చెప్పారు. తీసేయించడానికి పాలనాపరమైన, న్యాయపరమైన చిక్కులుంటాయి కాబట్టి ఆలస్యం అయి వుండవచ్చు. 10,15 ఏళ్లగా పాతుకుపోయినవారిని పెకలించడం అంత సులభమేమీ కాదు. అందువలన టిడిపి ప్రభుత్వం ఆ పనిలో విజయం సాధించలేక పోయిందని ఎద్దేవా చేయనవసరం లేదు. ఈ రోజు వైసిపి ప్రభుత్వం నోటీసులు యిస్తోంది. కానీ తప్పకుండా తొలిగించి వేయగలదని ఎవరైనా చెప్పగలరా? వాళ్లంతా మాల్‌దార్‌ పార్టీలు. కోర్టుకి వెళ్లి, పెద్ద లాయర్లను పెట్టుకుని, స్టేలు తెచ్చుకుని, అడ్డు తగులుతారు. 

ప్రభుత్వం సొంత భవనం విషయంలో కోర్టుకి వెళ్లి స్టే అడగదు కదా, హాయిగా కొట్టేసుకోవచ్చు. కొట్టేసుకుంది. అలా యితరులను నిలదీసే నైతికబలం తెచ్చుకుంది. ఇతరులు అంటే కృష్ణా కరకట్ట మీద కట్టుకున్న వాళ్లనే కాదు, రాష్ట్రం మొత్తం మీద అడ్డగోలుగా కట్టుకున్న వాళ్లనేకులు ఉన్నారు. అందరూ శిక్షార్హులే. వారందరికీ బలమైన సంకేతం వెళ్లిపోయింది - ఇలాటివి ఒప్పుకోం అని. ఇక వాళ్లు తమంతట తామైనా కొట్టేసుకోవాలి, లేదా అధికారులు కొట్టేస్తూ ఉంటే నోరు మూసుకోవాలి. కోర్టు మాత్రం ఎంతమందికి, ఎన్నాళ్లకని స్టేలు యిస్తుంది? పైగా అక్రమంగా కట్టుకున్నవాళ్లందరూ పెద్ద లాయర్లను పెట్టుకునే స్తోమత ఉన్నవాళ్లు కాదు. ఉల్లంఘించినవారిలో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరూ ఉన్నారు. ఒకరిని చూసి మరొకరు. వాడికేం కాలేదు కదా, నాకు మాత్రం ఎందుకవుతుంది అనుకుని ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడది చెదురుతుంది. మోతుబరుల విషయంలో లేటయినా చిన్నవాళ్ల విషయంలో తొలగింపులు సులభమవుతాయి. 

ఒక్క బిల్డింగు కూలగొడితే యిన్నేసి మార్పులు వచ్చేస్తాయా అని ఆశ్చర్యం కలగవచ్చు. వచ్చేసినా ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే జగన్‌ అదే బిల్డింగులో మీటింగు పెట్టి యీ అక్రమంపై అందరి దృష్టినీ ఆకర్షించి తను చేసిన పనికి పబ్లిసిటీ వచ్చేట్లు చేశాడు. 9 కోట్లు వృథా ఖర్చు అంటున్నారు. అక్రమ కట్టడాలపై ప్రజలను హెచ్చరిస్తూ తెలుగు, ఇంగ్లీషు పత్రికల్లో ఫుల్‌పేజీ యాడ్స్‌ యిచ్చి వుంటే అంతకంటె ఎక్కువ అయ్యేదేమో! నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అక్రమ కట్టడాలు ధారాళంగా వెలుస్తూ వచ్చాయి. 1995కి ముందు నేను తమిళనాడులో పదేళ్లు ఉన్నాను. అక్కడ అపార్టుమెంటు కాంప్లెక్సులో పెంట్‌హౌస్‌ కట్టడానికి అనుమతించేవారు కాదు. ఆ సంవత్సరం హైదరాబాదుకి బదిలీ అయి వచ్చి చూస్తే ప్రతీ కాంప్లెక్సులోనూ బిల్డర్లు పెంట్‌హౌస్‌లు కట్టేసుకుని అమ్మేసుకుంటున్నారు. 

నిజానికి టెర్రేస్‌ స్థలం బిల్డరుది కాదు, అపార్టుమెంటు ఓనర్ల ఉమ్మడి ఆస్తి. అక్కడి స్థలం బిల్డరు కబ్జా చేసినట్లే. అక్కడ పెంట్‌హౌస్‌ ఎలా కట్టనిస్తాం? అని నేను అడిగితే, ఇక్కడ యిది రివాజే. దాని క్రయవిక్రయాలు కూడా జరుగుతాయి. ఎటొచ్చీ బ్యాంకు లోను రాదంతే. కొన్నాళ్లకు దాన్ని రెగ్యులరైజ్‌ చేసేస్తారు అని చెప్పారు. చెయ్యకపోతే కొట్టేస్తారా? అనుకున్నాను. కానీ అలా కొట్టేసిన సందర్భం ఒక్కటీ లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బు కొరత పడినప్పుడల్లా మీ మీ పాపాలు చెప్పేసుకోండి, డబ్బిచ్చి పాపప్రక్షాళన పత్రాలు కొనుక్కోండి అంటుంది. రైతుల ఋణమాఫీ పద్ధతి మంచిది కాదు, అలా అయితే ఏ రైతైనా అప్పు తిరిగి చెల్లిస్తాడా? ప్రభుత్వం కట్టేదాకా ఎదురు చూస్తాడు అని వాదిస్తాం. మరి దీని మాటేమిటి? రూలు ప్రకారం అటూయిటూ స్థలం వదిలేసి కట్టుకున్నవాడు వెర్రివాడవుతున్నాడు. నియమాలను అడ్డగోలుగా ఉల్లంఘించినవాడు, చెఱువులు దిగమింగినవాడు మొనగాడు అవుతున్నాడు.

నేను రాసినది అప్పటి తమిళనాడు మాట. మొన్ననే పేపర్లో చదివాను. అణ్నా నగర్‌లో ఓ షాపింగ్‌ కాంప్లెక్సుకి నీటి వసతీ లేదు, డ్రైనేజీ వసతీ లేదు, కానీ నడిచేస్తోంది. అనేక రాష్ట్రాల్లో భవంతులకు ఫైర్‌ సర్వీసుల అనుమతి ఉండదు. అగ్నిప్రమాదం జరిగినప్పుడే యీ విషయం బయటపడుతుంది. మరి అలాటప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్టు ఎలా యిచ్చారు? హోటళ్లు, హాస్పటల్స్‌, సినిమా హాళ్లు యిలా ఎన్నో వాటిల్లో యిదే పరిస్థితి.  ప్రమాదం జరిగాక బాధితులకు లక్షల రూ.ల నష్టపరిహారం చెల్లిస్తారు. ప్రభుత్వం ముందే అడ్డుపెడితే యిలా జరగదు కదా. ఇక్కడ కూడా బిల్డరు మూడు అంతస్తులకు అనుమతి తెచ్చుకుని మరో రెండు ఫ్లోర్లు వేసేస్తాడు. వాటికి ప్రభుత్వసంస్థలు గృహఋణాలు కూడా యిచ్చేస్తాయి. తర్వాతెప్పుడో నాలుగేళ్లకు కార్పోరేషన్‌ కూల్చేస్తామంటూ నోటీసు యిస్తుంది. మేమంతా అమాయ బాధితులం, మా కష్టార్జితంతో కట్టుకున్నవి కూల్చకండి అంటూ ఫ్లాట్‌ ఓనర్లు కోర్టుకి వెళతారు. కోర్టు జాలి చూపించి, సరే కాస్త డబ్బు కట్టేయండి అంటుంది.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, బిల్డరు మూడు అంతస్తులు సరిపడా నీటి వసతి, డ్రైనేజి వసతి, ఫయర్‌ సేఫ్టీ ఏర్పాటు చేశాడు. అక్కడ యిప్పుడు ఐదు అంతస్తుల భవంతి ఉంది, పెంట్‌ హౌస్‌ కూడా! మరి ఎలా సరిపోతుంది? ఇలాటివి బయటకు వస్తూనే ఉంటాయి. కోర్టులు అక్షింతలు వేస్తూనే ఉంటాయి. కొత్త అక్రమ కట్టడాలు వెలుస్తూనే ఉంటాయి. ఇది ఆగాలి. దానికి ప్రభుత్వమే పూనుకోవాలి. ఇలాటివి సహించను అని గట్టి వార్నింగు యివ్వాలి. అప్పుడు ప్రజలందరికీ భయం కలుగుతుంది. అక్రమాలను సహించని అధికారులకు శక్తి సమకూర్చినట్లవుతుంది. ఆ విధంగా చూస్తే జగన్‌ చేసినది దివ్యమైన, భవ్యమైన పని. ఎవరైనా కానీ ప్రవచించే ముందు ఆచరించి చూపాలి. గాంధీ గారి వద్దకు ఒకాయన వచ్చి 'మా అబ్బాయి బెల్లం తెగ తింటాడు. చెప్పినా వినటం లేదు. మీరు కాస్త నచ్చచెప్పి మాన్పించాలి' అన్నాడు. గాంధీగారు వారం తర్వాత రమ్మన్నారు. వచ్చాక 'అమితంగా బెల్లం తినడం మంచిది కాద'ని చెప్పారు. తండ్రి నిరుత్సాహపడ్డాడు. ఈ నాలుగు ముక్కలు చెప్పడానికి వారం వ్యవధి కావాలా? అని. అప్పుడు గాంధీ చెప్పారు - 'నాకూ అదే దురలవాటు ఉంది. ఈ వారంలో నేను దాన్ని మాన్పుకుని, అప్పుడు మీ వాడికి చెప్పే అర్హత సంపాదించుకున్నాను' అని.

(సశేషం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2019)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: కూల్చివేతపై యింత వ్యథా? - 2/2