ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. ఇంకో పార్టీ చూసుకోవాల్సిందే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మరో పార్టీని చూసుకోవాల్సిన సమయం వచ్చినట్టుగా  ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొంతమందికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పదవులు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఫిరాయించి వచ్చినప్పుడేమో వీరికి బాబు చాలా ఆఫర్లు ఇచ్చారని.. ఇప్పుడు మాత్రం టికెట్ ఇవ్వడానికి బాబు ఆసక్తి చూపడంలేదని ప్రచారం జరుగుతూ ఉంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలు ఫిరాయించి వస్తే.. వారిలో చాలామంది పరిస్థితి ఇప్పుడు కొశ్చన్ మార్క్ గానే ఉందని తెలుస్తోంది. రాయలసీమలో అయితే చాలామందికి ఝలక్ లు తప్పవని అంటున్నారు. స్వయంగా మంత్రిపదవిలో ఉన్న అఖిలప్రియకు కూడా స్థానచలనమే అని.. ఆమెను నంద్యాల ఎంపీగా పోటీచేయించాలని బాబు అనుకుంటున్నారట.

ఆ ఎంపీ సీటు నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం అంటే.. ఓటమికి రెడీగా ఉండమని అర్థం. ఇక అఖిలప్రియ మామ ఎస్వీ మోహన్ రెడ్డి టికెట్ విషయంలో ఆఖరి పోరాటం చేస్తున్నారు. ఆయనకు టికెట్ దక్కేఅవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. అందుకే లోకేష్ పేరును ఆయన తెరమీదకు తెస్తున్నారు.

బుట్టారేణుక పరిస్థితి అంతే. కర్నూలు ఎంపీ టికెట్ దక్కదని స్పష్టం  అయిపోయింది. ఇక ఎమ్మిగనూరు సీటు మీదే ఆశలు. అది కూడా కన్ఫర్మ్ కావడంలేదు. ఇక ఆంధ్రా ఏరియాకు వస్తే.. ఉప్పులేటి కల్పనకు టికెట్ కష్టం అని అంటున్నారు. ఇక్కడ తెలుగుదేశంపార్టీలోని పాత వారికి టికెట్ ఇవ్వబోతున్నారని.. కల్పనను బాబు పక్కన పెడుతున్నారని సమాచారం.

ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులనెహ్రూ పరిస్థితి కూడా సంధిగ్ధంలోనే ఉందని సమాచారం. తోట నరసింహం కుటుంబం ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తుండటంతో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేకు టికెట్ దక్కడం కష్టమే అని తేలిపోయింది. ఇప్పటికే ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డికి సొంత నియోజకవర్గం టికెట్ దక్కలేదని తేలిపోయింది. ఆది కడప నుంచి పోటీచేయడం ఖరారు అయ్యింది.

వీరు మాత్రమే కాదని.. ఫిరాయింపుదారుల్లో సగంమందికి కూడా ఇప్పుడు చంద్రబాబు టికెట్ ఇచ్చేలా లేరని వార్తలు వస్తున్నాయి. వీళ్లంతా ఇప్పుడు మరో పార్టీని చూసుకోవాలని.. జగన్ నుంచి రెడ్ సిగ్నల్స్ వస్తున్న నేఫథ్యంలో వీరు జనసేన వైపు చూస్తున్నారని సమాచారం.

రాయలసీమ రైతుల పుండుపై కారం