సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌

సమీక్ష: డియర్‌ కామ్రేడ్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: మైత్రి మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ సినిమా
తారాగణం: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందాన, శృతి రామచంద్రన్‌, సుహాస్‌, చారుహాసన్‌, ఆనంద్‌ తదితరులు
మాటలు: జైకృష్ణ
కూర్పు: శ్రీజిత్‌ సారంగ్‌
సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌
ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌
నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌ చెరుకూరి, యష్‌ రంగినేని
రచన, దర్శకత్వం: భరత్‌ కమ్మ
విడుదల తేదీ: జులై 26, 2019

ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయిన 'మహిళలపై లైంగిక వేధింపులు' అంశాన్ని తెర మీదకి తెచ్చిన మొదటి మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా ఇది. అయితే ఆ అంశం ఈ చిత్రంలో తెరపైకి రావడానికి రెండు గంటలకి పైగా సమయం తీసుకుంది. అంతవరకు ప్రేమించుకోవడం, విడిపోవడం, విరహం లాంటి అంశాలతో సగటు లవ్‌స్టోరీలా సాగిన సినిమా కాస్తా సడన్‌గా వేరే మలుపు తిరుగుతుంది. అనూహ్యమైన మలుపుతో ఆకట్టుకోవడం వేరు, అవసరమైన మలుపుని ఆలస్యంగా తీసుకోవడం వేరు. ఈ విషయంలోనే 'డియర్‌ కామ్రేడ్‌' దారి తప్పింది. అనుకున్న కథని విజయ్‌ దేవరకొండకి వున్న 'అర్జున్‌రెడ్డి' ఇమేజ్‌కి అనుగుణంగా మలచడం వల్ల వచ్చిన సమస్య అది.

ప్రతి యువతికీ ఒక కామ్రేడ్‌ వుండాలి అనేది టైటిల్‌ జస్టిఫికేషన్‌ కాగా ఆ 'కామ్రేడ్‌' అనే పిలుపుకి జస్టిఫికేషన్‌ కోసం హీరోని విప్లవ భావాలున్న యువకుడిగా పరిచయం చేస్తారు. ఈ విప్లవ భావాలున్న యువకుడు తన తోటి విద్యార్థుల హక్కుల కోసం పోరాడతాడు, అలాగే తన స్నేహితులకి 'పర్‌ఫెక్ట్‌ కామ్రేడ్‌'గా తోడు నిలుస్తాడు. అయితే అదే సమయంలో పక్కింటి 'అక్క'కి లవ్‌ లెటర్‌ రాసి వుంటాడు. కొత్తగా ఆ ఇంటికి వచ్చిన చుట్టాలమ్మాయిని ప్రేమించేస్తాడు. మరి విప్లవ భావాలున్న సదరు 'చైతన్య'వంతుడు ఇలా సగటు కుర్రాడిలా చపలచిత్తం చూపించడం ఎందుకు? విజయ్‌ దేవరకొండకి యూత్‌ ఫాలోయింగ్‌ వుంది కనుక వారు 'చైతన్య' అలియాస్‌ 'బాబీ' పాత్రలో తమని తాము ఐడెంటిఫై చేసుకోవడానికై వుండొచ్చు! ఈ 'బాబీ' సగటు పక్కింటి కుర్రాడిలానే పరిచయం చేసినట్టయితే ఈ ప్రేమకథ రక్తి కట్టేది. కానీ అతడిని కామ్రేడ్‌ అనడానికి కారణం వెతకడం కోసం స్టూడెంట్‌ యూనియన్లు, కాలేజీ గొడవలు అంటూ ఏవేవో మిక్స్‌ చేయడంతో ఈ ఎరుపుతో (ప్రేమ) ఆ ఎరుపు (విప్లవం) మిక్స్‌ అవక ఆ మిశ్రమం కంటికింపుగా లేకుండా పోయింది.

అబ్బాయి అయిదు వేల రూపాయల బెట్‌కి గల్లీలో క్రికెట్‌ ఆడే టైప్‌ అయితే, అమ్మాయి స్టేట్‌ లెవల్‌ క్రికెటర్‌. అబ్బాయి అమితావేశపరుడయితే, అమ్మాయి అలాంటి ఆవేశపరుడైన అన్నయ్యని కోల్పోయి ఎలాంటి గొడవలనీ ఎంకరేజ్‌ చేయని క్యారెక్టర్‌. సగటు ప్రేమకథకి అవసరమైన కాన్‌ఫ్లిక్ట్‌ ఈ రెండు వ్యక్తిత్వాల నడుమ ఏర్పడింది. అయితే సదరు కామ్రేడ్‌ కోణాన్ని చొప్పించేసరికి అది ఫోర్‌ గ్రౌండ్‌లోకి వచ్చినపుడల్లా 'అతికించిన' భావం కలిగించింది. ఆ ప్రేమ మరియు అతని భావజాలం రెండూ రెండు పాయలున్న నదిలా కలిసినప్పుడు సాఫీగా అనిపించేలా తప్ప, ఒకదానితో ఒకటి సంబంధం లేనివి కలుస్తూ ఆ కలయిక ఇబ్బందిగా మారితే ఇలాగే వుంటుంది.

విజయ్‌ దేవరకొండ, రష్మికల నడుమ కెమిస్ట్రీ వల్ల ప్రేమ సన్నివేశాలు అతి సాధారణంగా వున్నా కానీ ఆకట్టుకోగలుగుతాయి. రెండు భిన్న మనస్తత్వాలు కనుక విడిపోవడం తథ్యమనేది తెలుస్తూనే వుంటుంది. అది ఇంటర్వెల్‌ దగ్గర జరిగితే... కాలేజీ కుర్రాడు మూడేళ్ల తర్వాత డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు ఏదో తెరపీ లాంటిది కనుగొని అన్నేళ్లు పెంచిన గడ్డాన్ని తీసేసి మళ్లీ నార్మల్‌ అవుతాడు. కానీ తను ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు తెరపీ అవసరమైన పరిస్థితిలో కనిపిస్తుంది. దానికి కారణమేంటి? ఆమె ఇష్టపడిన క్రికెట్‌ కోసం ఫైట్‌ చేసేలా అతడు ఆమెకి కామ్రేడ్‌గా ఎలా అండగా నిలుస్తాడు? అనేది మిగతా స్టోరీ.

అసలు విషయం ఏమిటంటే... డియర్‌ కామ్రేడ్‌ అసలు కథ అంతా ద్వితియార్ధంలోనే వుంటుంది. ఆ కథ కూడా ఎప్పుడో పతాక సన్నివేశాలకి చేరుకునే ముందు రివీల్‌ అవుతుంది. దీంతో మొదటి సగానికి, రెండవ సగానికి సంబంధం లేకుండా పోతుంది. ఎలాగైతే కామ్రేడ్‌ యాంగిల్‌ లవ్‌స్టోరీతో మిళితం కాలేదో... అంతవరకు చూపించిన ప్రేమకథ కూడా ఈ 'మీటూ' యాంగిల్‌తో సింక్‌ అవలేదు. ఈ కాన్సెప్ట్‌కి ఫుల్‌ సినిమా కాగల డెప్త్‌ వుంది. కానీ దానిని కేవలం 'బ్యాక్‌డ్రాప్‌'గా లేదా స్టోరీ ముగించడానికి 'కల్మినేషన్‌'గా మాత్రమే వాడుకోవడం వల్ల ఆ పాయింట్‌కి జస్టిఫికేషన్‌ జరగలేదనిపిస్తుంది.

అలాగే కథ హీరో పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చెప్పడం వల్ల 'లిల్లీ' మానసిక క్షోభ సరిగా ఫోకస్‌ అవలేదు. ఆమె ఎలాంటి బాధ అనుభవించింది, తన గతం నుంచి ఎందుకు పారిపోవాలని చూస్తోంది అనే దానిపై తగినంత దృష్టి పెట్టలేదు. ఇక ఈ కథకి ఇచ్చిన ముగింపు కూడా కన్విన్సింగ్‌గా లేదు. బిసిసిఐ సమావేశంలో కమిటీ మెంబర్లు జడ్జిల మాదిరిగా వ్యవహరించే తీరు, అక్కడ ఒక్కొక్కరి ప్రవర్తన హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈచిత్రంలో ఏదైతే పాయింట్‌ని చర్చించారో దానిని హైలైట్‌ చేయాలి, ఈ సందేశాన్ని ప్రజలకి ఇచ్చి తీరాలి. కానీ దానిని విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌ భుజాలని ఆసరా చేసుకుని చెప్పాలని చూడడం వల్లే సమస్య ఎదురయింది. ఉద్దేశం తప్పకుండా మెచ్చుకోతగినదే అయినప్పటికీ రెంటికీ చెడ్డ రేవడిగా ఈ చిత్రాన్ని మలచడమే చింతించేట్టు చేస్తుంది.

విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ పాత్రల్లో మరింతగా ఒదిగిపోతాడనేది 'అర్జున్‌రెడ్డి'తో తెలిసింది. అలాంటి పాత్ర ఇప్పటికి ఒక్కసారి మాత్రమే చేసినా కానీ దాని ఇంపాక్ట్‌ తీవ్రంగా వుంది. అందుకే ఇందులో విజయ్‌ని చూస్తోంటే ఇలా అతడిని చాలాసార్లు చూసిన భావన కలుగుతుంది. తన సినిమాలలో ఫలానా ఫలానా ఎలిమెంట్స్‌ వుంటే యూత్‌కి నచ్చుతుందనే ఫీలింగ్‌ తనలోను పాతుకుపోయినట్టుంది. అర్జున్‌రెడ్డిలో చేసినవి చాలానే ఇందులో రిపీట్‌ చేసాడు కానీ ప్రతి 'బాబీ' అర్జున్‌ రెడ్డి అయిపోలేడనేది అర్థం చేసుకోవాలి. రష్మిక నటన బాగుంది కానీ ఆమె పాత్ర తాలూకు భావోద్వేగాలని పూర్తిగా చూపించకపోవడంతో 'లిల్లీ' ఆశించినంతగా ప్రభావితం చేయలేకపోయింది. అయితే వీరిద్దరి అభినయం, వీరి నడుమ వుండే ఆ నేచురల్‌ కెమిస్ట్రీ ఈ కథని చూడగలిగేట్టు చేసింది.

అద్భుతమైన జస్టిన్‌ సంగీతం, అంతే కవితాత్మకమైన సుజిత్‌ ఛాయాగ్రహణం ఈ ఒడిదుడుకుల ప్రేమకథకి కూడా జీవం పోసింది. సాంకేతికంగా ఉన్నతంగా, దృశ్యపరంగా సమ్మోహనంగా వున్న 'డియర్‌ కామ్రేడ్‌' రచన పరంగానే రాజీ పడిపోయింది. విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌కి తగ్గట్టు 'డియర్‌ కామ్రేడ్‌' కావాలా, కథని ఎలివేట్‌ చేసేలా 'డియర్‌ లిల్లీ'గా మిగలాలా అనే ప్రశ్నకి మధ్య ఊగిసలాడుతూ హాఫ్‌ హార్టెడ్‌ అటెంప్ట్‌గా, హాఫ్‌ బేక్డ్‌ లవ్‌స్టోరీగా మిగిలిపోయింది.

బాటమ్‌ లైన్‌: కథకీ, కథానాయకుడికీ మధ్య నలిగిన కామ్రేడ్‌!
- గణేష్‌ రావూరి

డియర్ కామ్రేడ్ నా మూడేళ్ళ కష్టం.. భరత్ స్పెషల్ చిట్ చాట్

‘అర్జున్ రెడ్డి’ లెగసీ ఇంకా.. ఇంకా..!