దసరా...మామూలుగా వుండదు

హీరో నాని అమితంగా నమ్మి చేస్తున్న సినిమా దసరా. నాని కెరీర్ లోనే పబ్లిసిటీ, వడ్డీలు కలిపి 75 కోట్ల రేంజ్ లో ఖర్చయిన తొలి సినిమా ఇది. అంతే కాదు. మరీ ఇంత రఫ్ గా, రగ్డ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా కూడా చేయలేదు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా టీజర్ ను రాజమౌళి విడుదల చేసారు. 

సింగరేణి బొగ్గు కుప్పల మాటున కనిపించని ఓ పల్లె కథ ఇది. అక్కడి జనాలు, వారి అలవాట్లు, వారి గొడవలు, ఇంకా..ఇంకా అన్నీ కలిసి కొత్త దర్శకుడు ఓదెల శ్రీకాంత్ కథగా అల్లుకున్నట్లు కనిపిస్తోంది. టీజర్ మొత్తంలో ముందుగా ఆకర్షించేది హీరో నాని గెటప్. ఈ గెటప్ లో నానిని చూడడం ఇదే తొలిసారి. 

గతంలో కూడా రఫ్ గెటప్ లు ట్రయి చేసాడు కానీ ఇది అల్టిమేట్. తెలంగాణ మాండలీకంలో లో బేస్ వాయిస్ తో డైలాగ్ లు, వాయిస్ ఓవర్ లు చెప్పాడు. టీజర్ లో మరో ముచ్చట ఏమిటంటే హీరోయిన్ ను చూపించకపోవడం. దాని వెనుక ఏదో సమ్ థింగ్ స్పెషల్ వుండి వుండాలి. అసలు ఆ మాటకు వస్తే నాని మీదే దృష్టి వుండేలా టీజర్ కట్ చేసారు. 

టెక్నికల్ గా సినిమా చాలా బలంగా వుండబోతోందని టీజర్ క్లారిటీ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ, సంగీతం ఆ రేంజ్ లో వున్నాయి. ఇటీవల డార్క్ థీమ్ సినిమాలను జనాలు ఆదరిస్తున్నారు. అందువల్ల కూడా ఈ సినిమా మీద ఇంత ఖర్చు చేయడానికి ధైర్యం వచ్చి వుండాలి. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీల్లో విడుదలవుతోందీ సినిమా.

Show comments