కిడ్నీ అమ్మకాల్లో మనమే నెంబర్‌ వన్‌.!

సాధారణంగా మానవ శరీరంలో రెండు కిడ్నీలుంటాయి. ఒక్క కిడ్నీతోనే సాధారణ జీవితం గడపడానికి ఆస్కారం వుంది. శరీరంలో ఇంకే అవయవానికీ ఇలాంటి ప్రత్యేకత లేదు. డయాబెటిస్‌, బీపీ సహా ఇతర అనారోగ్య సమస్యలతో ఓ కిడ్నీ పాడైపోయినా, రెండో కిడ్నీతో ఆరోగ్యంగా జీవించడానికి ఆస్కారం వుంది. ఇదే, ఈ ఒక్క అవకాశమే.. దేశంలో కిడ్నీ వ్యాపారానికి ఊపిరిలూదుతోంది. 

పది పదిహేనేళ్ళ క్రితం మాట. దేశంలో అక్రమంగా కిడ్నీ వ్యాపారం జోరుగా సాగుతోందనీ, ఏడాదికి రెండు వేలకు పైనే కిడ్నీలు అక్రమంగా అమ్ముడవుతున్నాయనీ అధికారిక గణాంకాలు తేల్చాయి. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ హెచ్చరిక ఇది. అధికారిక లెక్కలిలా వుంటే, అనధికారిక లెక్కల ప్రకారం ఇది చాలా చాలా ఎక్కువ. పదేళ్ళ క్రితం నాటి పరిస్థితే ఇలా వుంటే, ఇప్పుడెలా వుండి వుంటుంది.? ఓ అంచనా ప్రకారం, ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా మన దేశంలో కిడ్నీ అమ్మకాల వ్యాపారం జరుగుతోందట. ఏడాదికి 50 వేలు ఆ పైనే కిడ్నీ అమ్మకాలు జరుగుతున్నాయన్నది అనధికారిక లెక్కల సారాంశం. 

ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అన్న తేడాల్లేవు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కిడ్నీ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇది నిష్టుర సత్యం. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై అవగాహన పెరిగిన దరిమిలా, ఈ మధ్యకాంలలో కిడ్నీ మార్పిడి చుట్టూ పెద్ద మాఫియానే నడుస్తోందిప్పుడు. నిబంధనల ప్రకారం అయితే, బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి కిడ్నీలు సేకరించడానికి వీలుంది. అది కూడా, బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి సంబంధించిన కుటుంబీకుల అనుమతితోనే సాధ్యం. 

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఓ వ్యక్తికి అతని కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీని తీసి అమర్చేందుకూ అవకాశముంది. కానీ, ఈ నిబంధనలన్నీ నీటి మీద రాతలే. భారతదేశంలో చట్టాలుంటాయి.. కానీ అవి అమలయ్యే తీరే హాస్యాస్పదం. ఇది జగమెరిగిన సత్యం. సినిమాల్లో చూస్తుంటాం కదా.. ఓ పేద కుటుంబం, ఓ పేషెంట్‌ని తీసుకొచ్చి ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ముందుకొచ్చేస్తుంది. అందులో దాతకీ, గ్రహీతకీ అసలు సంబంధమే వుండదు. కానీ, బ్రోకర్లు ఓ కుటుంబాన్ని క్రియేట్‌ చేసేస్తారంతే. 

ఇది సినిమా కథ మాత్రమే కాదు.. రియల్‌ లైఫ్‌లో ఎన్నో జరుగుతున్నాయి. వాస్తవానికి కిడ్నీ రాకెట్‌లో ప్రధాన భూమిక పోషిస్తున్నది ఈ కథే. ఇలాంటి కథలు చెప్పే దేశంలో మెజార్టీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోవడం కాదు, సిగ్గుతో తలదించుకోవాల్సిందే ఎవరైనాసరే. కార్పొరేట్‌ ఆసుపత్రులు ఈ పాపంలో మెజార్టీ షేర్‌ దక్కించుకుంటున్నాయి. ఓ కిడ్నీ ఖరీదు పాతిక లక్షల నుంచి 50 లక్షల దాకా పలుకుతోంది. డిమాండ్‌ని బట్టి ఒక్కోసారి కోటి రూపాయలకు కిడ్నీ అమ్మిన దాఖలాలూ వున్నాయట. చిత్రంగా, దాతకి ఇందులో లభించేది లక్ష నుంచి రెండు మూడు లక్షలు మాత్రమే. కీడ్నీ పొందిన వ్యక్తి 50 లక్షలు వదిలించుకున్నా, ఆసుపత్రి ఖర్చులు అదనంగా భరించాలి. ఇరువురి తరఫున. 

ఇవేవో, ఆషామాషీ లెక్కలనుకుంటే పొరపాటే. వైద్యులే చెబుతున్నారీమాట. కొందరి కారణంగా పవిత్రమైన వైద్య వృత్తి పట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగే ప్రమాదం ఏర్పడుతోందని ఢిల్లీకి చెందిన నెఫ్రాలజిస్ట్‌ ఒకరు కిడ్నీ వ్యాపారంపై వ్యాఖ్యానిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. 

వివిధ కారణాలతో దేశవ్యాప్తంగా లక్ష మంది వరకు కిడ్నీ దాతల కోసం ఎదురుచూస్తున్నారట. అవయవదానంపై అవగాహన పెంచేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా, వాటి ద్వారా లభిస్తోన్న స్పందన చాలా తక్కువగానే వుందనీ, అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీలు అమ్ముకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందనీ, వీటితోపాటు కేవలం 'అవయవాల కోసం' జరుగుతున్న కిడ్నాప్‌లు, హత్యలు భయాందోళనలు కలిగిస్తున్నాయని వైద్య నిపుణులు, అలాగే అవయవదానంపై అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.

Show comments