సీఎస్‌పై వేటు చంద్రబాబు 'పుణ్యమే' కదా.!

ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రెటరీగా పనిచేసిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ చంద్ర పునేఠాను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ, ఆయన స్థానంలో ఎల్వీ ప్రసాద్‌ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నియమించిన విషయం విదితమే. అంతకుముందు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బాధ్యతల నుంచి ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేస్తే, చంద్రబాబు తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. ఆ వ్యవహారంపై నానాయాగీ చేశారు.. వెంకటేశ్వరరావు విషయంలో చంద్రబాబు చూపించిన అత్యుత్సాహం, ఈ క్రమంలో అప్పటి సీఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠాపై ఒత్తిడి.. తెల్సిన విషయాలే.

అసలంటూ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో చంద్రబాబు లైట్‌ తీసుకుని వుంటే, సీఎస్‌గా అనిల్‌ చంద్ర పునేఠా కొనసాగి వుండేవారే. ఇందులో ఇంకో మాటకు తావులేదు. అనిల్‌ చంద్ర పునేఠా తొలగింపు 'పాపం' పూర్తిగా చంద్రబాబుదేనన్నది జగమెరిగిన సత్యం. ఐఏఎస్‌ అధికారుల్ని బలిపశువుల్ని చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. తన రాజకీయ స్వార్ధం కోసం, చంద్రబాబు ఎంతోమంది అధికారులతో ఇలాగే ఆటలాడుకున్నారు.. అందుకే, అధికారులెవరూ చంద్రబాబుని విశ్వసించని పరిస్థితి నెలకొంది.

వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆరోపణలు ఎదుర్కొన్న మాట వాస్తవమేగానీ, అది గతం. ఆయనకు క్లీన్‌ చిట్‌ లభించాకనే, తిరిగి విధుల్లో కొనసాగుతున్నారాయన. చంద్రబాబు హయాంలోనే అధికారిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనసాగిన దరిమిలా, ఇప్పుడాయనపై చంద్రబాబు ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. 'అనిల్‌ చంద్ర పునేఠాను తొలగిస్తే మాట్లాడని మాజీ ఐఏఎస్‌ అధికారులు, ఇప్పుడెందుకు తనకు వ్యతిరేకంగా గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తారు.?' అంటూ చంద్రబాబు గుస్సా అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో అధికారులుగా పనిచేసిన అజయ్‌ కల్లాం కావొచ్చు, ఐవైఆర్‌ కృష్ణారావు కావొచ్చు, మరొకరు కావొచ్చు.. చంద్రబాబు మీద, చంద్రబాబు ప్రభుత్వమ్మీదా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు.? ఈ విషయమై చంద్రబాబే ఆత్మ విమర్శ చేసుకుని వుండాలి. పైగా, ఆయా అధికారుల మీద అవినీతి ఆరోపణలు ఏమీలేవు. 'మిస్టర్‌ క్లీన్‌' అన్పించుకున్న అధికారులు, చంద్రబాబు పుణ్యమా అని వివాదాల్లోకెక్కుతున్నారు.

అనిల్‌ చంద్ర పునేఠా విషయంలో చంద్రబాబు వ్యవహారశైలి ముమ్మాటికీ ఆక్షేపణీయమే. ఆయన్ని చంద్రబాబు ఇప్పుడు వెనకేసుకొస్తున్నారుగానీ, రేప్పొద్దున్న చంద్రబాబే నాలిక మడతేసి, అనిల్‌ చంద్ర పునేఠాపై రాజకీయ విమర్శలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.  

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?