కార్పొరేట్, వ్యక్తిగత వార్ కాదా ఇది?

టీవీ 9 మాజీ సిఇఒ రవిప్రకాష్ పనిగట్టకుని జర్నలిస్టులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాఫీయాకు మీడియాకు మధ్య వార్ అంటూ గొంతెత్తుతున్నారు. కానీ అసలు జరుగుతున్నది అంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? నిజంగా మీడియా-మాఫియా వార్ నా ఇది? అసలు టీవీ 9తో రవిప్రకాష్ సమస్య ఏమిటి?

టీవీ9 అనే సంస్థను రవిప్రకాష్ తన తెలివితేటలు, శ్రీనిరాజు పెట్టుబడి కలిపి స్థాపించారు. ఈనాడు సంస్థను తొలిసారి విశాఖలో ప్రారంభించినపుడు కానీ, వార్త, ఉదయం, సాక్షి పత్రికల స్థాపనలో కానీ సీనియర్ మోస్ట్ సంపాదకుడు ఎబికె ప్రసాద్ పాత్ర ఎంత అన్నది మీడియా జనాలకు అందరికీ తెలుసు. మరి ఈనాడు స్థాపనలో అంత కీలకంగా వ్యవహరించిన ఎబికె ప్రసాద్ ఎందుకు ఆ సంస్థను వీడాల్సి వచ్చింది. యాజమాన్యంతో సరిపడక. పైగా ఆయనకు యాజమాన్యంలో వాటా లేదు.

టీవీ 9 రవిప్రకాష్ ఉదంతం చూద్దాం. శ్రీనిరాజు గతంలో వైఎస్ సహకారంతో శ్రీసిటీని స్థాపించారు. దాని పనుల్లో వుండి ఆయన టీవీ 9ను పూర్తిగా రవిప్రకాష్ అజమాయిషీకి వదిలేసారు. వారిద్దరి మధ్య ఏ విధమైన ఒప్పందం వుందన్నది వారి విషయం. కానీ అదే శ్రీనిరాజు తన వాటాను అమ్మేసుకోవడం అన్నది కూడా వ్యక్తిగతమే. ఆయన వ్యాపారం ఆయన ఎవరికి కావాల్సిన వారికి ఆయన అమ్ముకుంటారు. ఫలానా వాళ్లకు అమ్మవద్దు అని చెప్పడానికి రవిప్రకాష్ ఎవరు?

అసలు రవిప్రకాష్ కు మైహోమ్ రామేశ్వరరావుకు మధ్య వ్యక్తిగత వైరం వుందనుకోవాలి. ఎందుకంటే మెఘా కృష్ణారెడ్డి కొనుక్కుంటానంటే రవిప్రకాష్ కు అభ్యంతరం లేదు. రామేశ్వరరావు కొంటానంటే అభ్యంతరం? అంటే ఏమనుకోవాలి? ఇది మీడియా మాఫియా వార్? లేదా కార్పొరేట్ భాగస్వామ్య వార్? సరే ఆ సంగతి అలా వుంచుదాం. వీళ్ల కన్నా పొట్లూరి వరప్రసాద్ టీవీ 9ను కొనాలని ప్రయత్నించారు. కానీ అప్పుడు కూడా రవిప్రకాష్ అడ్డంపడ్డారని వదంతులు వున్నాయి. అలా అడ్డంపడడం సరైన చర్యే అనుకోవాలా? మీడియా మాఫియా వార్ గానే చూడాలా?

సరే ఇదిలావుంటే, టీవీ 9 లోగో తనదే అని రవిప్రకాష్ వాదనగా తెలుస్తోంది. అలాగే ఆయన ఎనిమిది శాతమో, పదిశాతమో స్టేక్ వుంది. దానిపై అనుమానాస్పదపు లావాదేవీలు వున్నాయి. ఈ రెండు విషయాలు కూడా మీడియాకు సంబంధించినవి కాదు. వ్యాపార విషయాలు. ఒక మైనర్ స్టేక్ హోల్డర్ కు, ఓ మేజర్ స్టేక్ హోల్డర్ కు మధ్య నడుస్తున్న వ్యవహారం. మరి ఇలాంటి వ్యవహారాన్ని మీడియా-మాఫియా మధ్య వార్ గా చిత్రీకరించే ప్రయత్నం ఎలా చేస్తారు? నిజంగా ఇది జర్నలిస్టుల మూకుమ్మడి వ్యవహారం అయివుంటే, సీనియర్ జర్నలిస్ట్ లు, లబ్ద ప్రతిష్టులు ఎందరో వున్నారు? కానీ ఎవ్వరూ స్పందిచరేం?

నిజంగా ఇది మీడియా-మాఫియా మధ్య వ్యవహారం అయితే వివిధ రాజకీయ పక్షాలు వున్నాయి. ఏవీ రవిప్రకాష్ ను వెనకేసుకురావేం? ఇన్నాళ్లు తను ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లుగా టీవీ9ను రవిప్రకాష్ నిర్వహించగలిగారు. తన అనుబంధాలు, బంధాలతో కొందరిని పల్లకీ ఎక్కించారు. కొందరిని కిందకు తొక్కారు. ఇవన్నీ జనానికి తెలుసు. రవిప్రకాష్ ఇన్నాళ్లు ఏ పార్టీకి కొమ్ముకాసారు అన్నది రహస్యం ఏమీకాదు. ఇప్పుడు అన్ని వందల కోట్లు పోసి ఛానెల్ ను కొనుక్కున్నవారు, ఈ ఆటకు, పాటకు బ్రేక్ వేసేసరికి, మీడియా-మాఫియా అనే కొత్త నినాదం పుట్టుకువచ్చింది.

కానీ రవిప్రకాష్-శివాజీల మధ్య ఒప్పందం సరైనదే అయితే శివాజీ ఇప్పటికీ అదృశ్యంగానే ఎందుకు వున్నారు? రవిప్రకాష్ కూడా తన స్టేక్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు. అసలు టీవీ9ను అమ్మిన శ్రీనిరాజు ఎందుకు అస్సలు పెదవి విప్పడం లేదు? ఎన్నో జవాబు తెలియని ప్రశ్నలు వున్నాయి.

6 నెలలు కాదు.. 6 రోజుల్లోనే దూకుడు

సినిమా రివ్యూ: హిప్పీ