ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ మరింత చిత్తు అవుతుంది!

దేశంలో భారతీయ జనతా పార్టీ హవా ఏ మాత్రం తగ్గలేదని అంటున్నాయి తాజా ఎగ్జిట్ పోల్స్. మహారాష్ట్ర-హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా మరింత స్పష్టంగా గోచరించనుందని అంటున్నాయి ఎగ్జిల్ పోల్స్. సోమవారం పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. వాటి ప్రకారం.. బంపర్ మెజారిటీలతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి అధికారం దక్కించుకోనుంది.

మహారాష్ట్రలో గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనం అవుతుందని, కొన్ని సీట్లను అదనంగా కోల్పోతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉండటం గమనార్హం. ఇండియాటుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం…బీజేపీ- శివసేనల కూటమి అధికారాన్ని అందుకుంటుంది.  భారతీయ జనతా పార్టీ 109 నుంచి 124 సీట్లను సాధించుకుంటుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. శివసేనకు 57 నుంచి 70 సీట్ల వరకూ దక్కుతాయట. ఇలా ఈ రెండు పార్టీలూ కలిసి  అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని ఇండియాటుడే  అంచనా వేసింది.

ఇక కాంగ్రెస్ కు 32 నుంచి 40 సీట్ల వరకూ  దక్కుతాయని ఈ సర్వే అంచనా వేసింది. గతంతో కంటే ఇలా కొన్ని సీట్లను కాంగ్రెస్  కోల్పోతుందని ఇందులో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40 వరకూ సీట్లు వచ్చినట్టున్నాయి. ఇప్పుడు  తగ్గుతాయట! ఇక ఎన్సీపీ కొద్దో గొప్పో సీట్ల సంఖ్యను పెంచుకుంటుందని 50 వరకూ గెలుస్తుందని ఇండియాటుడే అంచనా వేసింది.

ఇక హర్యానాలో..బీజేపీ స్వీప్ అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆ రాష్ట్రంలోని 90 స్థానాలకు గానూ కాంగ్రెస్ పది అసెంబ్లీ సీట్లను నెగ్గడం కూడా  కష్టమే అని అవి అంచనా వేస్తున్నాయి. 

Show comments