కాంగ్రెస్‌, టీడీపీ.. ఇదొక 'వెకిలి' రాజకీయం.!

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నాల్లో బిజీగా వున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. మాజీ కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సైతం నిన్ననే ప్రకటించారు తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు. ఈ మేరకు చంద్రబాబు సర్కార్‌ కొన్ని తాయిలాల్ని 'అధికారికంగా' కోట్ల కోసం ప్రకటించడమూ చూశాం.

ఇప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన కోసం వస్తున్నారు. తిరుపతి సాక్షిగా ప్రత్యేకహోదా భరోసా ప్రజా యాత్ర.. అంటూ కాంగ్రెస్‌ పార్టీ హంగామా షురూ చేసింది. మరి, తెలుగుదేశం పార్టీ - కాంగ్రెస్‌ పార్టీ విషయంలో ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుంది.? కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌, తెలుగుదేశం పార్టీపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు.? ఢిల్లీలోనేమో స్నేహం, ఆంధ్రప్రదేశ్‌లోనేమో స్నేహం.. ఈ రాజకీయమేంటో అర్థం కాక, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం తలలు పట్టుకోవాల్సిందేనేమో.!

వైఎస్సార్సీపీ, టీఆర్‌ఎస్‌ని అడ్డం పెట్టుకుని బీజేపీ, ఆంద్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తోందనీ, తెలుగు రాష్ట్రాల్ని బీజేపీ సామంత రాజ్యాలుగా మార్చుకోవాలనుకుంటోందనీ ఆరోపిస్తోన్న చంద్రబాబు, తాను కాంగ్రెస్‌ పార్టీకి సామంత రాజుగా మారిపోయానని ఒప్పుకోకపోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

ఖచ్చితమైన రాజకీయ వ్యూహాలతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా ఓ వైపు కాంగ్రెస్‌ని దువ్వుతూ, ఇంకో వైపు జనసేన పార్టీకి వల వేస్తోన్న చంద్రబాబు రాజకీయం అందరికీ అర్థమవుతోంది. ఇంతటి వెకిలి రాజకీయం తామెప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నా, 'నేను నిప్పు' అంటూ చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటూనే వున్నారు.

ఏ సర్వేలోనూ, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేది లేదని తేలడంతో.. చివరాఖరి ప్రయత్నంగా పాపం చంద్రబాబు.. అస్త్ర శస్త్రాలన్నిటినీ కలిపి ప్రయోగించబోతున్న దరిమిలా.. ఈ ప్రయోగం వికటించక, సత్ఫలితాలనిస్తుందని ఎలా అనుకోగలం.?

Show comments