తెరాస ‘రెడ్డి’ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఫోన్లు?!

ఇలాంటి రాజకీయాల్లో ఆరితేరిన కర్ణాటక గౌడ డీకే శివకుమార్ ఇప్పటికే తెలంగాణలోకి దిగాడు. తెలంగాణ ఎన్నికల్లో డీకేశీ చాలా రాజకీయమే నడిపించాడు. కాంగ్రెస్ రెబల్స్ ను ఈయన తనదైన రీతిలో సంతృప్తి పరిచినట్టుగా వార్తలు వచ్చాయి. రేపు హంగ్ తరహా పరిస్థితి తలెత్తుతుందనే లెక్కతో ఇప్పటికే డీకేశీ అక్కడకు దిగాడని తెలుస్తోంది.

కాంగ్రెస్ లెక్కలు హంగ్ చుట్టూనే తిరుగుతున్నాయి. అందుకే ఒకటికి నాలుగుసార్లు గవర్నర్  నరసింహన్ ను కలుస్తున్నారు. హంగ్ వస్తే తమనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని వీరు ఆయన మీద ఒత్తిడి చేసినంత పని చేస్తున్నారు. మరి వీళ్ల మాటను గవర్నర్ ఎంతవరకూ వింటాడో తెలియదు.

ఆ సంగతలా ఉంటే.. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్తున్నాయని సమాచారం. ఖాయంగా గెలుస్తారనే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నుంచి ఫోన్లు వెళ్తున్నాయని తెలుస్తోంది. హంగ్ తరహా పరిస్థితి వస్తే.. కేసీఆర్ కాకుండా తమకు సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారని సమాచారం.

ఇలా ప్రలోభపెట్టడంలో కాంగ్రెస్ పార్టీ సెలెక్టివ్ గా వెళ్తోందట. ఖాయంగా గెలుస్తారనే వాళ్లను సెలెక్ట్ చేసుకుని, అందులోనూ 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలనే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుందని సమాచారం. కేసీఆర్ కింద ఏం పనిచేస్తారు.. రండి.. మనమందరం కలిసి పనిచేద్దాం అనే డైలాగులు వేస్తున్నారని సమాచారం.

అన్ని రకాలా ఆఫర్లూ ఉంటాయి, వాటితో పాటు క్యాస్ట్ అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు వాడుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవలే కులం లెక్కతో తెరాస నుంచి ఒకరిద్దరు నేతలను కాంగ్రెస్ చేర్చుకోగలిగిందని అంటున్నారు. ఇప్పుడు వాళ్లు తెరాసలోని రెడ్లకు మరింత గట్టిగా గాలం వేస్తున్నారని సమాచారం.

మరి ఈ గాలానికి ఆ చేపలు పడతాయా? అసలు హంగ్ పరిస్థితి ఉంటుందా అనేది మరి కొన్నిగంటల్లో తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ నుంచి తమకు ఫోన్లు వచ్చినట్టుగా పలువురు తెరాస నేతలు ధ్రువీకరించారు. వారిలో మర్రి జనార్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు ఉండటం విశేషం. ఎమ్మెల్యేలుగా పోటీచేసిన పలువురు దళిత నేతలను కూడా టార్గెట్ చేశారని వినికిడి!

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

Show comments