కాంగ్రెస్ తీరు మారలేదు.. ఇక అంతేనా!

సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తను రాజీనామా చేయడానికి రెడీ అంటున్నాడట రాహుల్ గాంధీ! అయితే కాంగ్రెస్ కోర్ కమిటీ, వర్కింగ్ కమిటీ మాత్రం 'అబ్బే వద్దు.. మీరు రాజీనామా చేయడం ఏమిటి..' అని వారు వారిస్తూ ఉన్నారట! రాహుల్ రాజీనామా పత్రంతో రెడీగా ఉన్నాడని, అయితే  సీడబ్బ్యూసీ మాత్రం ఆయన రాజీనామాకు ఒప్పుకోవడం లేదని మీడియాకు లీకులు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్లు.

ఒకవైపు రాజకీయం సీరియస్ గా మారిందనుకుంటే కాంగ్రెస్ వాళ్లు కామెడీ చేస్తూ ఉన్నారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ నెగ్గుకురావడం అయ్యే పనికాదని తేలిపోయింది. ఇప్పుడుకాదు.. దాదాపు పదేళ్ల కిందట యూపీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలప్పుడే రాహుల్ ఫెయిల్యూర్ అనే విషయం తేలిపోయింది.

అప్పట్లో ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు తీసుకుని రాహుల్ తనకు తాను పరీక్ష పెట్టుకున్నాడు. అప్పటికి కేంద్రంలో యూపీఏ-2 అధికారంలో ఉండేది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించడమే లక్ష్యమని  ప్రకటించుకుని రాహుల్ గాంధీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ కెరీర్ లో ఒక్కొక్కటిగా ఫెయిల్యూర్లే కానీ, విజయాలు లేకుండా పోయాయి!

అన్ని ఫెయిల్యూర్ల మధ్యన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి జాతీయాధ్యక్షుడు అయ్యాడు. అడ్డువచ్చే వాళ్లు లేరు కాబట్టి అధ్యక్షుడు కాగలిగాడు కానీ, ప్రజల్లో మాత్రం రాహుల్ గ్రాఫ్ ఏ మాత్రం పెరగడం లేదని స్పష్టం అవుతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. జరిగిన లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో స్వయంగా ఎంపీగా ఓడిపోయాడు రాహుల్ గాంధీ. అది కూడా తమ ఫ్యామిలీ కంచుకోట అమేథీలో!

కనీసం ఎంపీగా ఉండే అర్హతలేదు అని రాహుల్ విషయంలో ప్రజాతీర్పు వచ్చింది. అయితే కాంగ్రెస్ వాళ్లకు మాత్రం రాహుల్ మాత్రమే రుచిగా అనిపిస్తూ ఉన్నాడు! ఈ పార్టీ పురోగమిస్తుందా?