టీడీపీ, టీజేఎస్ సీట్లలో కాంగ్రెస్ నామినేషన్స్!

మహాకూటమి.. మహాకూటమి అంటూ.. నామినేషన్ల చివరిరోజు వరకూ వ్యవహారాన్ని లాగించారు. కానీ.. చివరకు మాత్రం పార్టీలే అధికారికంగా ఈ పొత్తును ఉల్లంఘిస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు టీజేఎస్.. ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్లు నామినేషన్స్ దాఖలు చేసేస్తున్నారు. నామినేషన్స్ కు నేడే చివరిరోజు. ఈ నేపథ్యంలో కూటమిలోని పార్టీలు పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించిన వైనం స్పష్టంగా గోచరిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితికి, తెలుగుదేశం పార్టీకి కేటాయించిన పలు సీట్లలో తన అభ్యర్థులను తెరమీదకు తెచ్చింది. తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి బీఫారాలను జారీచేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ నియోజకవర్గాల జాబితా ఇలా ఉంది.

వరంగల్ తూర్పు, దుబ్బాక, మిర్యాలగూడ స్థానాలను కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కు కేటాయించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టింది. వారికి బీ ఫారాలను ఇచ్చేసింది. ఇక తెలుగుదేశం పార్టీకి కేటాయించిన సీట్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టడం గమనార్హం.

పటాన్ చెరు, హుజూర్ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు తెలుగుదేశానికి అన్నారు. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు రంగంలో దిగేశారు. కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించే సరికి అటు టీడీపీ, టీజేఎస్ లు ఫైర్ అవుతున్నాయి.

ఇక టీజేఎస్ కూడా పొత్తును ఉల్లంఘిస్తోంది. కూటమిలో ఈ పార్టీకి దక్కిన స్థానాల కన్నా అధిక స్థాయిలో ఇది పోటీచేస్తోంది. దాదాపు పద్నాలుగు నియోజకవర్గాల్లో టీజేఎస్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇదీ కూటమి కథ!

బిడ్డా రాస్కో.. తెలంగాణ‌లో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments