కాంగ్రెస్.. దిగజారుడులో మరో నీఛ అధ్యాయం!

తెలుగుదేశం నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లు భుజాలు తడుముకుంటున్నారు. ఈ ఐటీ దాడులను వీళ్లు తప్పు పట్టేస్తున్నారు. ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు అని అంటున్నారు. ఇంకా ఏ మూలో కాంగ్రెస్ వాదం ఉన్న వాళ్లలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న మాటలు అసహనాన్ని రేపుతున్నాయి. చంద్రబాబు నాయుడి ప్రాపకం కోసం కాంగ్రెస్ పార్టీ పడుతున్న పాట్లను చూసి కాంగ్రెస్ అభిమానులే నివ్వెరపోతున్నారు.

సీఎం రమేశ్ ఇంటిపై జరిగిన ఐటీ దాడులను ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి తప్పు పట్టాడు. ఇవి కక్ష సాధింపు చర్యలు అని ఈయన చెప్పుకొచ్చాడు. అలాగే కమ్యూనిస్టు పార్టీ నేతలు కూడా ఇలాగే మాట్లాడారు. కమ్యూనిస్టుల సంగతి పక్కన పెట్టినా.. కాంగ్రెస్ వాళ్లు చంద్రబాబు పార్టీపై ఇప్పుడు చూపుతున్న ప్రేమ, ఔదార్యాలకు నిజమైన కాంగ్రెస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దిగజారుడులో ఉన్న తమ పార్టీ ఇప్పుడు ఇలా మరీ నీఛమైన స్థాయికి దిగజారిపోవడంతో వారు విస్తుపోతున్నారు.

దారుణం ఏమిటంటే.. ఈ రోజుకూ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరే చెప్పుకుంటోంది. రాజశేఖర రెడ్డి తమ వాడని అంటోంది. అయితే ఇదే పార్టీ చనిపోయిన రాజశేఖర రెడ్డి పేరును చార్జిషీట్లలో పెట్టినప్పుడు స్పందించలేదు! రాజశేఖర రెడ్డి పాలనలో అక్రమాలు జరిగాయని అంటే ఆయన మంత్రి వర్గంలోని వారు నోరు మెదపలేదు. తమ మంత్రి వర్గ సహచరాలు.. తమతో దశాబ్దాల పాటు రాజకీయం చేసిన వాళ్లు, తమకు అండగా నిలిచిన వారు కేసుల్లో ఇరుక్కొంటే ఇదే రఘువీరారెడ్డి ఆ రోజు మాట్లాడలేదు.

ఎవరి బొమ్మను చూపి తన లాంటి వాడు గెలిచాడో.. అలాంటి వ్యక్తులపై బురద జల్లుతున్నా రఘువీరకు చీమైనా కుట్టలేదు. అయితే ఇప్పుడు సీఎం రమేశ్ పై ఐటీ దాడులు జరిగే సరికి కాంగ్రెస్ సహించలేకపోతోంది. ఈ దాడులను తప్పు పడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందనడంలో ఏ సందేహం లేదు. ఇలాగే సాగుతూ పోతే కాంగ్రెస్ పార్టీ రోజుకు ఐదారు అడుగులు ఊబిలోకి దిగబడుతూ ఉంటుంది. ఇక మళ్లీ పైకి రావడం ఉండదు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి