బిల్డింగులు కడితే పోటీ పడొచ్చా...!

అధికారంలో ఉన్న పార్టీతో ప్రతిపక్షాలు ఎలా పోటీ పడాలి? ప్రజాదరణ పొందడానికి ఏవిధంగా వ్యవహరించాలి? ఏ విధానాలు అనుసరించాలి? ఏ వ్యూహాలు పన్నాలి? ...ఇలాంటివి ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా ఇదే సరైన ఆన్సరని లెక్కల్లో మాదిరిగా చెప్పగలమా? రాజకీయ పార్టీలు ఇలాగే వ్యవహరించాలనే, ఇదే చట్రంలో ఉండాలనే నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అధికార పార్టీతో ప్రతిపక్షాలు పోరాడాలంటే, పోటీ పడాలంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, నిరంతరం ప్రజా సమస్యలపై స్పందించడం, చట్ట సభల్లో గట్టిగా ప్రశ్నించడం మొదలైన మార్గాలుంటాయి. తెలంగాణలో కాంగ్రెసుకు అధికార టీఆర్‌ఎస్‌ను ఎలా ఢీకొనాలో అర్థం కావడంలేదు. కాంగ్రెసు ఏం చేసినా టీఆర్‌ఎస్‌కు ప్రజాదరణ తగ్గడంలేదు. 

టీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని, కేసీఆర్‌ పతనం మొదలైందని కాంగ్రసు నాయకులు ప్రచారం చేసినప్పుడల్లా ఏదో ఒక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బ్రహ్మాండంగా గెలుస్తూనే ఉంది. ఇందుకు తార్కాణం ఈమధ్యనే జరిగిన హూజూర్‌నగర్‌ ఉప ఎన్నిక. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైది రెడ్డి సూపర్‌ మెజారిటీతో గెలిచాడు. హూజూర్‌నగర్‌తోనే కేసీఆర్‌ పతనం ప్రారంభమవుతుందని తెగ ప్రచారం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌...తెచ్చింది కాంగ్రెస్‌ అని ఎంత ఊదరగొట్టినా జనం రెండోసారి కూడా టీఆర్‌ఎస్‌కే అధికారం అప్పగించారు. ఇక కాంగ్రెసు నుంచి వలసల సంగతి చెప్పక్కర్లేదు.  దీనికి తోడు పార్టీలో లుకలుకలు. ఇలా ఎంత చెప్పుకున్నా కాంగ్రెసు విషాద గాథ తరగదు.

ఈ నేపథ్యంలో టీపీసీసీ నాయకత్వానికి ఓ బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. టీఆర్‌ఎస్‌తో పోటీ పడాలంటే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పార్టీకి కార్యాలయ భవనం ఉండాలి. ఉమ్మడి ఏపీలో తెలంగాణలో పది జిల్లాలని తెలిసిందే. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక మరీ పది జిల్లాలేమిటి ఛండాలంగా అనుకొని జిల్లాల సంఖ్యను అమాంతం పెంచిపారేశారు. ఎక్కువ జిల్లాలుంటే కేంద్రం నుంచి నిధులు ఎక్కువ వస్తాయని కేసీఆర్‌ అభిప్రాయం. పార్టీ నాయకులకు కూడా పదవుల కొరత తీరుతుందని అనుకొని జిల్లాలు పెంచారు. టీఆర్‌ఎస్‌కు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయ భవనాలు లేవు. దీంతో కొంతకాలం కిందట అన్ని జిల్లాల్లో భవనాలు నిర్మించాలని ప్లాన్‌ చేశారు. 

అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి స్థలాల కేటాయింపు సమస్య లేదు. నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి కూడా. దీన్ని గమనించిన కాంగ్రెసు పార్టీ నాయకత్వం ప్రతి జిల్లాలో పార్టీకి భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌తో పోటీ పడటానికే ఈ నిర్ణయం తీసుకుందట....! గతంలోని పాత జిల్లాల్లో కార్యాలయ భవనాలు ఉన్నాయేమోగాని కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో లేవు. అక్కడ కట్టుకోవల్సిన అవసరం ఉంది. కొత్త కార్యాలయ భవనాల నిర్మాణ బాధ్యతను పీసీసీ మాజీ ఎంపీ, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పొన్నం ప్రభాకర్‌కు అప్పగించింది. 

స్థలాల కోసం జిల్లా కలెక్టర్లను కలుసుకొని మెమొరాండాలు సమర్పించాలని డీసీసీలను ఆదేశించింది. పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం జిల్లాల్లో కమిటీలను నియమించారు. స్థలాలు సేకరించే పని ఈ ఏడాది చివరకు ముగిసిపోవాలని డెడ్‌లైన్‌ పెట్టారు. డీసీసీలు లేని జిల్లాల్లో నిర్మాణ బాధ్యత సీనియర్‌ నాయకులు తీసుకోవాలని పీసీసీ చెప్పింది. సరే....బిల్డింగులు కట్టాలనే నిర్ణయం బాగానే ఉందిగాని పైసలెట్లా...? నిర్ణయం తీసుకోవడానికి డబ్బులు అక్కర్లేదుగాని కట్టడానికి కావాలి కదా. ప్రభుత్వం రాయితీపై స్థలాలు ఇచ్చినా నిధులు ఎలా వస్తాయని నాయకులు ప్రశ్నించుకుంటున్నారు. పీసీసీ దగ్గర అసలు రోజువారీ ఖర్చులకే డబ్బులు లేవని కొందరు నాయకులు చెబుతున్నారు. 

నిధుల సేకరణ బాధ్యతను ఇద్దరు ముగ్గురు రాష్ట్రస్థాయి నాయకులకు అప్పగించినా ఇది వారికీ సమస్యగానే ఉంది. డబ్బు కోసం ఆర్ధికంగా బలంగా ఉన్న నాయకుల మీద ఆధారపడాల్సిందే తప్ప శాశ్వతంగా ఆదాయం వచ్చే మార్గాలు పార్టీకి లేవు. ఆలిండియా కాంగ్రెసు కమిటీ దగ్గర కూడా డబ్బులు లేవని కొందరు నాయకులు అంటున్నారు. ఏఐసీసీ నాయకత్వం దేశమంతా విరాళాలు సేకరిస్తోందట....! డబ్బుల కోసం అదే మార్గం అనుసరించాలని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. డబ్బులు లేకుండా భవనాలు కట్టాలని అనుకోవడం, భవనాలు కడితే టీఆర్‌ఎస్‌తో పోటీ పడవచ్చనుకోవడం...ఏమిటీ ప్లాన్‌? పోనీ...ఏదోవిధంగా బిల్డింగులు కట్టారనే అనుకుందాం. దీంతో టీఆర్‌ఎస్‌తో పోటీ పడే శక్తిసామర్థ్యాలు వచ్చేస్తాయా?

Show comments