ఒకచోట పొత్తు.. మిగతాచోట్ల పోరు.. ఇదేం స్నేహమో!

కాంగ్రెస్ కూటమి వైపు కనిపిస్తున్న పార్టీల మధ్యన గందరగోళం మామూలుగా లేదు! ఒక చోటనేమో ఇవి మిత్రపక్షాలుగా చలామణి అవుతున్నాయి. మరోచోట మాత్రం అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఒకదాన్ని మరొకటి దెబ్బతీసుకొంటూ ఉన్నాయి. అయితే పైకి మాత్రం తమది ఒకటే అజెండా అని, బీజేపీ దించడమే తమ పని అంటున్నాయి ఈ పార్టీలు. బీజేపీపై వీళ్లందరికీ శతృత్వం ఉంది కానీ వీరిలో వీరికి మితృత్వం లేదని చెప్పక  తప్పడంలేదు.

ఇప్పటికే యూపీలో కాంగ్రెస్ ఒంటరిగా, ఎస్పీ-బీఎస్పీలు పొత్తుతో పోటీ చేస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీ గట్టిగానే చీలుస్తుందని స్పష్టం అవుతోంది. ప్రత్యేకించి ఈసారి ముస్లిం ఓటు ఎస్పీ-బీఎస్పీలకు పడేలాలేదు. జాతీయ పార్టీనే మేలనే లెక్కలతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారట యూపీ ముస్లింలు. దీంతో ఎస్పీ-బీఎస్పీలకు చాలా దెబ్బపడనుంది. ఆ భయంతోనే మాయవతి ఓపెన్ గా ముస్లింలకు పిలుపునిచ్చారు. దీంతో ఆమె ఈసీ చిక్కుల్లో చిక్కుకున్నారు. స్థూలంగా ఎస్పీ-బీఎస్పీలు కలిసి పోటీచేస్తున్నా, అక్కడ కాంగ్రెస్ వారి ఓట్లను భారీగా చీలుస్తుందని మాత్రం స్పష్టం అవుతోంది.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ ల రచ్చ కూడా సీరియల్ గా సాగుతూ ఉంది. ఒక రాష్ట్రంలో పొత్తు, మరో రాష్ట్రంలో పోరు.. అన్నట్టుగా ఉంది వీళ్ల కథ. పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో వీరి పొత్తుకు ఆస్కారం ఉంది. అయితే ఆప్ తో పొత్తుకు ససేమేరా అని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తేల్చేశారు. దీంతో అక్కడ కాంగ్రెస్, ఆప్ ల మధ్యన ఎన్నికల యుద్ధం తప్పడంలేదు. ఇక హర్యానా కాంగ్రెస్ సీనియర్లు కూడా ఆప్ తో పొత్తుకు ఒప్పుకోవడం లేదు. దీంతో అక్కడా పోరు తప్పడంలేదు.

చండీగడ్, ఢిల్లీ పరిధిలో మాత్రం పొత్తు ఉంటుందని అంటున్నారు. ఇక్కడ ఉన్నది పరిమిత సీట్లే. అయినా వీటిని పంచుకోవడంలో కూడా ఈ ఇరుపార్టీల మధ్యన ఏకాభిప్రాయాలు కుదరడంలేదు. ఈ పొత్తు చర్చలతో రాహుల్, కేజ్రీవాల్ లు ట్విటర్ కు ఎక్కి అసలు కథ బయటపెట్టుకుంటున్నారు. వీళ్ల తీరుచూస్తుంటే.. ఈ పార్టీలు మిత్రపక్షాలా, శత్రుపక్షాలా.. అనే విషయంపై జనాలకే స్పష్టత లేకుండాపోయింది. ఈ కన్ఫ్యూజన్ జనాన్ని బీజేపీ వైపే మళ్లిస్తుందేమో!

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది

Show comments