బీసీ క్రీమీ లేయర్‌పై నిపుణుల కమిటీ

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వర్గాలలో క్రీమీలేయర్‌ నిర్ధారణకు సంబంధించి ఉత్పన్నమవుతున్న సమస్యల పరిశీలన కోసం ఈ ఏడాది మార్చి 8న మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి బీ.పీ. శర్మ అధ్యక్షతన ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించినట్లు సామాజిక న్యాయశాఖ సహాయమంత్రి బుధవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.

నిపుణుల సంఘం విధి విధానల గురించి మంత్రి తన జవాబులో వివరిస్తూ వెనుకబడిన తరగతులలో క్రీమీలేయర్‌ (ఆర్థికస్థితి మెరుగ్గా ఉన్నవారు) నిర్ధారణ కోసం గతంలో నియమించిన ప్రసాద్‌ కమిటీ అనుసరించిన ప్రాతిపదికను లోతుగా పరిశీలిస్తుందని చెప్పారు. ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు వెల్లడించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్రీమీలేయర్‌ విధానాన్ని సరళతరం, క్రమబద్ధీకరించే దిశగా తగిన సిఫార్సులు చేయడం శర్మ కమిటీకి నిర్దేశించిన విధి విధానాలలో ఒకటని మంత్రి చెప్పారు.

అలాగే కేటగిరీ 2సీ కింద ప్రభుత్వరంగ సంస్థలలో బీసీలకు ఉద్యోగ ఖాళీల సంఖ్యను నిర్ధారించడానికి కూడా తగిన సిఫార్సులను ఈ నిపుణుల కమిటీ చేస్తుంది. క్రీమీలేయర్‌కు సంబంధించి సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్ధులు దాఖలు చేసిన అపరిష్కృత కేసులను శర్మ కమిటీ పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం బీసీ సర్టిఫికెట్‌ సమర్పించిన అభ్యర్ధులలో క్రీమీ లేయర్‌ వారిని గుర్తించి తొలగించడానికి అనుసరించవలసిన ఆచరణ సాధ్యమైన విధానాన్ని ఈ కమిటీ రూపొందిస్తుందని మంత్రి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ సర్వీసులో బీసీ సర్టిఫికెట్ల చెల్లుబాటుకు సంబంధించి ఇంతవరకు ఒక విధానం అంటూ లేనందున 2017 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరైన బీసీ అభ్యర్ధుల సర్టిఫికెట్లను యూపీపీఎస్‌సీ తిరస్కరించిన నేపథ్యంలో తిరస్కరణకు గురైన ప్రతి కేసుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన మీదట ఈ కమిటీ నిర్దుష్టమైన సిఫార్సు చేస్తుందని మంత్రి వివరించారు.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

Show comments